Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ ఒక క్రిమినల్‌ !

ట్రంప్‌ ఒక క్రిమినల్‌ !

- Advertisement -

ఇరాన్‌ నేత ఖమేనీ వ్యాఖ్యలు
ఉద్రిక్తతలకు ఆ రెండు దేశాలే కారణమంటూ విమర్శలు
ఇరాన్‌లో 3వేలు దాటిన మరణాలు
స్వదేశానికి భారతీయులు
ఇరాన్‌ నుంచి వాణిజ్య విమానాల్లో ఇండియాకు!
ఎంత మంది వచ్చారన్నదానిపై లేని స్పష్టత
ఎలాంటి ఏర్పాట్లూ చేయని కేంద్రం

టెహరాన్‌ : ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు వారాల తరబడి చెలరేగడానికి, వందలు వేల సంఖ్యలో ప్రజలు మరణించడానికి అమెరికా, ఇజ్రాయిల్‌ బాధ్యులని ఇరాన్‌ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని విమర్శించారు. గత రెండు వారాలకు పైగా కొనసాగుతున్న నిరసనల్లో ఇజ్రాయిల్‌, అమెరికాలతో సంబంధమున్నవారు తీవ్రమైన నష్టం కలిగించారనీ, వేలాదిమంది చనిపోవడానికి కారణమయ్యారని ఖమేనీ శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో హింసాకాండలో ఆ రెండు దేశాల ప్రత్యక్ష ప్రమేయముందని విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక క్రిమినల్‌ అని వ్యాఖ్యానించారు. తాజాగా తీసుకువచ్చిన ఇరాన్‌ వ్యతిరేక దేశద్రోహ చట్టం భిన్నంగా ఉందని, ఇందులో ట్రంప్‌నకు ప్రత్యక్షంగా ప్రమేయముందని అన్నారు. తమ దేశంలో అశాంతి పెచ్చరిల్లేలా చేసేది తమ శత్రుదేశాలు, ప్రధానంగా ఇజ్రాయిల్‌, అమెరికాలని ఇరాన్‌ ఇటీవల పదే పదే విమర్శిస్తోంది. ఇందుకు బాధ్యులైన వారు కచ్చితంగా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారని ఖమేని హెచ్చరించారు. దేశాన్ని యుద్ధంలోకి లాగాలని మేం కోరుకోవడం లేదు, కానీ ఆ విధంగా చేసే దేశీయ లేదా అంతర్జాతీయ నేరస్తులను శిక్షించకుండా వదిలిపెట్టబోమని ఖమేనీ స్పష్టం చేశారు.

వేలల్లో మృతులు, అరెస్టులు
ఇప్పటివరకు ఇరాన్‌ అల్లర్లలో 3వేల మందికి పైగా మరణించినట్టు వార్తలందుతున్నాయి. అయితే ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. వందలాది మృతులని మాత్రమే ఇరాన్‌ అధికారులు పేర్కొంటున్నారు. అయితే మృతులు వేల సంఖ్యలో వున్నారని ఖమేనీ తొలిసారిగా నోరు విప్పారు. బహిరంగంగా, అధికారికంగా ప్రకటిస్తున్న సంఖ్య కంటే చాలా ఎక్కువగా మరణాలు ఉన్నాయని టెహరాన్‌లో అల్‌జజీరా విలేకరి రియోల్‌ సెర్దార్‌ వ్యాఖ్యానించారు. నిరసనలు, ఆందోళనల సందర్భంగా అదుపులోకి తీసుకుంట్నున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది. మూడువేలమందికి పైగా అరెస్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున విధ్వంసకాండకు దిగుతున్నారని, ఇప్పటివరకు 250కి పైగా మసీదులు, ఆస్పత్రులు తగలబెట్టారని సెర్దార్‌ చెప్పారు.

భారత్‌ వినతి
గతేడాది డిసెంబరు 8న ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీ) అదుపులోకి తీసుకున్న 16మంది భారత నావికులకు తక్షణమే కాన్సులర్‌ సదుపాయం కల్పించాలని టెహరాన్‌లోని భారత ఎంబసీ శనివారం ఇరాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఇరాన్‌లో ఈ అంశంపై జ్యుడిషియల్‌ విచారణ జరుగుతుందని భావిస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. ఈ నావికులంతా ‘ఎంటి వాలియంట్‌ రోర్‌’ నౌకలో గల సిబ్బంది. అప్పటి నుంచి వారికి కాన్సులర్‌ సదుపాయం కల్పించాలని భారత్‌ పదే పదే విజ్ఞప్తి చేస్తూనే వస్తోంది.

స్వదేశానికి భారతీయులు
వారాల తరబడి నిరసనలు, ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇరాన్‌ నుంచి విద్యార్థులతో సహా పలువురు భారతీయులు వాణిజ్య విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్‌ నుంచి భారతీయుల్ని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా స్వంతంగానే భారత్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి వీరంతా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ విమానాల్లో ఎంత మంది భారతీయులు వచ్చారో వెంటనే తెలియరాలేదు. దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత రాయబార కార్యాలయం అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థతో అక్కడ ఉన్న భారతీయ పౌరులందరికీ భరోసా ఇస్తోందని వచ్చిన వారు చెప్పారు. తమ వారికోసం వచ్చిన బంధువులు, స్నేహితులతో విమానాశ్రయం రద్దీగా కనిపించింది. ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ… ”ప్రస్తుతం ఇరాన్‌లో 9వేల మంది భారతీయులు ఉన్నారనీ, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే”నని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -