Tuesday, November 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'షట్‌డౌన్‌'తో అభాసుపాలైన ట్రంప్‌!

‘షట్‌డౌన్‌’తో అభాసుపాలైన ట్రంప్‌!

- Advertisement -

అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ మూత (షట్‌డౌన్‌) ను ఎత్తివేసేందుకు ఆదివారం నాడు నాంది పలికారు. మూత 41వ రోజు సోమవారం నాడు ఎనిమిది అంశాలపై పార్లమెంటు ఎగువసభ సెనెట్‌లో తీర్మానాలు ఆమోదం పొందాయి. బుధవారం నాడు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన తరువాత చేసే తీర్మానంతో అధికారికంగా ప్రభుత్వమూతకు తెరపడుతుందని భావిస్తున్నారు. గతంలో తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2019లో 35 రోజుల పాటు మూత తరువాత తన రికార్డును ట్రంప్‌ బద్దలు కొట్టాడు. రారాజునంటూ, దిగిరానని బెట్టు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ మెట్టుదిగటంతో జనవరి 31వరకు ప్రభుత్వానికి అవసరమైన నిధులను పొందేందుకు వీలుగా సెనెట్‌ 60-40 ఓట్లతో ఆదివారం నాడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జనవరి ఒకటవ తేదీతో ముగియనున్న ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించేందుకు ట్రంప్‌ అంగీకరించటంతో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది సెనెట్‌ సభ్యులు మద్దతు ఇవ్వటంతో సర్కార్‌ గట్టెక్కింది.కుదిరిన ఒప్పందానికి తాను కట్టుబడి ఉంటానని ట్రంప్‌ ప్రకటించాడు. ఈ సమస్య ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో టీకప్పులో తుపాను వంటి చిచ్చురేపింది. ఎనిమిది మంది సభ్యులను డోనాల్డ్‌ ట్రంప్‌ ”ఆకర్షించి” మూత ఎత్తివేతకు మద్దతు పలికించినట్లు చెప్పవచ్చు. అసలు ఈ ప్రభుత్వ మూత అంటే ఏమిటి? దాని పర్యవసానాలేమిటో చూద్దాం. మూత కారణంగా రోజుకు 17 బిలియన్‌ డాలర్ల చొప్పున అప్పు పెరుగుతున్నదని, వారానికి 14 బిలియన్‌ డాలర్ల మేర నష్టమని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంచనాలు లెక్కించే పద్ధతి, పరిగణనలోకి తీసుకొనే అంశాలు ఒకటే కాకపోవటంతో భిన్నమైన అంకెలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి గందరగోళ పడాల్సిన అవసరం లేదు, నష్టమైతే వాస్తవం.
ప్రతిదేశంలో బడ్జెట్లకు పార్లమెంట్ల ఆమోదముద్ర పడితేనే నిధుల విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ నుంచి మార్చి నెల వరకు ఆర్థిక సంవత్సరం,అత్యధిక దేశాల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఉంటుంది. మార్చి 31వ తేదీలోగా ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలపకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి ఖజానా నుంచి నిధుల విడుదల ఆగిపోతుంది. అమెరికాలో అది జనవరి ఒకటి నుంచి జరుగుతుంది. అయితే ఇది పౌరకార్యకలాపాలకు తప్ప మిలిటరీ వంటి అత్యవసర సేవలకు వర్తించదు.1980దశకం నుంచి కొన్ని శాఖలకు తగినన్ని నిధులు కేటాయించటంలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పటివరకు 21సార్లు ప్రభుత్వ మూతలకు దారితీశాయి. ప్రారంభంలో కొద్ది గంటలతో మొదలై ఇప్పుడు వారాల తరబడి కొనసాగుతున్నది. ప్రారంభంలో ఈ మూతల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు ఉండేవి కాదు, ఇటీవలి 11 మూతల సమయంలో వారిపై వేటు పడటం సాధారణంగా మారింది. సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అమెరికా-మెక్సికో సరిహద్దులో ఇనుప గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తం కావటంతో 2018-19లో 35 రోజులు, అంతకు ముందు వివిధ సంక్షేమ పథకాలకు కోతలను ప్రతిపాదించటంతో బిల్‌క్లింటన్‌ ఏలుబడిలో 21, ఆరోగ్య సంక్షేమానికి సబ్సిడీలను పెంచాలన్న బరాక్‌ ఒబామా ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. ఇప్పుడు అదే ఒబామా అమలు చేసిన ఆరోగ్య పథకానికి జనవరి ఒకటి నుంచి నిధులు నిలిపివేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా రికార్డు సృష్టించిన మూత ప్రారంభమైంది.2013లో మూత కారణంగా 24 బిలియన్‌ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు దూరమైనట్లు, ఆ ఏడాది నాలుగవ త్రైమాస కాలంలో జీడీపీ 0.6శాతం నష్టపోయినట్లు అంచనా వేశారు. తాజా ఉదంతంతో నష్టం ఎంతో తెలియాల్సి ఉంది.

తెగేదాకా లాగితే రాజకీయంగా మరింత నష్టమన్న భయమే ట్రంప్‌ను దిగివచ్చేట్లు చేసింది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్‌ మేయర్‌, రెండు రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ మట్టికరవటం, వచ్చే ఏడాది పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో రిపబ్లికన్‌ పార్టీ మీద తీవ్ర వత్తిడి వచ్చిన ఫలితమే తాజా పరిణామం అని చెప్పవచ్చు. మూత చివరి రోజులలో రెండువేల విమానాలు రద్దు కావటం, ఏడువేల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, ప్రయాణీకుల నుంచి వచ్చిన నిరసన కూడా దోహదం చేసి ఉండవచ్చు. రానున్న సెనెట్‌ ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోట్లాది మంది పేదలు, యువత ఇబ్బందులు పడిన తీరు రానున్న రోజుల్లో ట్రంప్‌ మీద వ్యతిరేకత పెంచేదే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆ పెద్దమనిషి ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడినట్లు ? పాలకవర్గాల సేవలో తరించేవారికి సామాన్య జనం పట్టదు. మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌-అమెరికాను మరోసారి గొప్పదానిగా చేద్దాం) రాజకీయాలు చెల్లవని న్యూయార్క్‌, న్యూ జెర్సీ, వర్జీనియా రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేశాయి.లక్షలాది కుటుంబాలకు వచ్చే స్వల్ప ఆదాయానికి అంతరాయం కలగటంతో పెన్షన్‌ ఖాతాల నుంచి కుటుంబ అవసరాలకోసం డబ్బు తీసుకొనేందుకు సైతం సంకోచించారు, అప్పులు తీసుకుంటే రానున్న రోజుల్లో తీర్చలేమోననే భయంతో అనేక మంది సర్దుకున్నారు.
నలభై రోజులకుపైగా మూతతో అమెరికా ఏమైనా స్తంభించిందా అంటే లేదు. అంతకు ముందు నుంచి కొనసాగిస్తున్న అన్ని దుర్మార్గాలకు ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తూనే ఉంది.మన దేశంలో పేదరికాన్ని నిర్మూలించామని చెబుతూనే ఆకలితో ఉన్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలను అందిస్తున్నది.ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికా, అక్కడి జనాభా 34 కోట్లు, వారిలో నాలుగున్నర కోట్ల మంది ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందుకుంటున్నారు. ప్రభుత్వ మూత అంటే కుదరదు వారందరికీ ఆహార సహాయం చేయాలంటూ కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ట్రంప్‌ ఉల్లంఘించాడు. మరోవైపు తన కార్యాలయంలో ఉన్నదాన్ని పడగొట్టించి విలాస వంతమైన బాల్‌రూమ్‌ డాన్సు మందిరాన్ని నిర్మించాడు. అర్జెంటీనా లోని పచ్చి మితవాద ప్రభుత్వాన్ని ఆదుకొనేందుకు 80బిలియన్‌ డాలర్ల మేర సాయం అందించాడు. ఇవి మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే.ట్రంప్‌ వంటి వారి ప్రాధాన్యతలు ఎలాంటివో లోకానికి స్పష్టమైంది. వేలాది విమానాలు నిలిచిపోవటంతో ప్రయాణాలు రద్దయి లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే మూత కారణంగా విమానరాకపోకల నియంత్రణ సిబ్బంది ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారంటూ ట్రంప్‌ యంత్రాం గం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ఇచ్చే విందులు, వినోదాలు చాలా ఖర్చుతో కూడినవి, పిల్లలకు రెండు బదులు ఒక బొమ్మ కొనిపెట్టండని తలిదండ్రులకు మూత సమయంలో ట్రంప్‌ సలహాయిచ్చాడు.

మూతకు తెరపడినప్పటికీ అది ముందుకు తెచ్చిన సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకాల్సి ఉంది. ఫెడరల్‌ ఉద్యోగులు తొమ్మిది లక్షల మంది, ఇతరులు ఇరవై లక్షల మందికి మూత సమయంలో ఎలాంటి వేతనాలు ఉండవని అధికార యంత్రాంగం పేర్కొన్నది.దాన్ని ఉద్యోగులు అంగీకరించే అవకాశం లేదు, ఎందుకంటే మూతకు వారి విధులకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ బీమా పథకం పొడిగింపుకు ట్రంప్‌ దిగివచ్చినా కొనసాగిస్తాడనే హామీ లేదని ఏపి వార్తా సంస్థ పేర్కొన్నది. అన్నింటికీ మించి ఫెడరల్‌ ప్రభుత్వ ఉద్యోగులను భారీగా తగ్గించాలన్న ట్రంప్‌ యంత్రాంగ అజెండాకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. మూత ఎత్తివేతకు కుదిరిన రాజీ ప్రకారం తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకొనేందుకు, వేతనాలు చెల్లించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం జనవరి మాసం వరకు మాత్రమే గనుక వచ్చే ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ట్రంప్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం నాటి రాజీ రెండు పార్టీల్లో ఉన్న విబేధాలను వెల్లడించింది. న్యూయార్క్‌ డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ష్కన్నర్‌ వ్యతిరేకంగా ఓటు వేశాడు. ట్రంప్‌తో జరుపుతున్న పోరాటాన్ని వదలివేయటం భయంకరమైన తప్పిదమని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ స్వతంత్ర సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ వర్ణించాడు. రాజీకి అంగీకరించిన ఎనిమిది మంది డెమోక్రటిక్‌ సెనెటర్లు తమచర్యను సమర్ధించుకున్నారు. మరికొన్ని వారాలు మూత కొనసాగినా ఇంతకంటే మంచి ఒప్పందం కుదిరి ఉండేది కాదని త్వరలో పదవీకాలం ముగియనున్న సెనెటర్‌ షాహీన్‌ చెప్పింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్లుగా మూత ముగిసినా వివిధ శాఖలకు కేటాయింపులకు అనేక అంశాల మీద ఓటింగ్‌ జరగాల్సి ఉంది. ఎక్కడైనా తేడా వస్తే మద్దతు ఇచ్చిన వారు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆదివారం నాడు వ్యతిరేకంగా ఓటు చేసిన డెమోక్రాట్లు ట్రంప్‌ సర్కార్‌ మీద పోరాడిల్సిందే అంటున్నారు.

మూత కారణాలను గనుక చూస్తే రిపబ్లికన్లు ఇంకా దిగిరావాల్సి ఉంటుందన్నది స్పష్టం.2026 సంవత్సర బడ్జెట్‌ కేటాయింపులపై తలెత్తిన విబేధం నలభై రోజులకు పైగా మూతకు దారితీసింది. జనవరి ఒకటి నుంచి ఆరోగ్యబీమా సబ్సిడీలను ఎత్తివేస్తానని ట్రంప్‌ ప్రకటించాడు, దాన్ని డెమోక్రాట్లు తిరస్కరించారు. ప్రధానమైన ఈ అంశంతో పాటు వృద్ధుల సంరక్షణ, ఇతర సేవలకు కేటాయింపులు కూడా వివాదాస్పదం చేశాడు. కోట్లాది మంది కార్మికుల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను జటిలం చేయటానికి ట్రంప్‌దే బాధ్యత. గతంలో కూడా అనేకసార్లు మూత ఉదంతాలు జరిగాయి. కానీ ఈసారి దానితో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు.దేన్నీ మానుకోలేదు. ప్రయాణాలు మానుకోలేదు, గోల్ఫ్‌ ఆడటం ఆపలేదు, మెక్‌డొనాల్డ్‌ నుంచి గాక వేరే సంస్థ నుంచి హామ్‌బర్గర్లు (పంది మాంసంతో చేసినవి) తెప్పించుకు తినటం తగ్గించలేదు. గతంలో ఇలాంటి సమయాల్లో అధ్యక్షులందరూ కనీసం జనానికి సానుభూతి చూపుతున్నట్లు కనిపించేందుకైనా తమ కార్యక్రమా లను తగ్గించుకున్నారు.ట్రంప్‌ అలాంటివేమీ లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరించాడు. నలభై రోజులూ తన కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించాడు. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులదీ అదే వరుస. సామాన్యులు తప్ప అసామాన్యులెవరూ ఇబ్బంది పడలేదు.గతంలో అధ్యక్ష భవనంలో పనిచేసే సిబ్బందిలో 61 నుంచి 70శాతం మంది విధులకు హాజరుకాలేదు, ఈ సారి 32శాతమే రాలేదు.అంటే ఏ సేవకూ అంతరాయం కలగలేదు.చివరి నిమిషంలో ప్రజా ప్రతినిధుల సభలో ఆరోగ్య సబ్సిడీలకు ప్రభుత్వం అడ్డం తిరగవచ్చా అంటే స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ చెప్పిన సమాధానం కొన్ని సందేహాలకు తావిస్తున్నది. తానెలాంటి హామీ ఇవ్వలేనని, సభ్యుల మధ్య ఏకాభిప్రాయ సాధన రావాల్సి ఉందన్నాడు.అయితే ఇప్పటికే ఇంటా బయటా అభాసుపాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ పౌరుల ఆరోగ్యం విషయంలో మొరటుగా వ్యవహరిస్తే మరింతగా జనాలకు దూరం కావటం ఖాయం!
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -