డోనాల్డ్ ట్రంప్ రష్యాలోని రెండు పెద్ద చమురు కంపెనీలపై తాజాగా విధించిన ఆంక్షలతో మరోమారు ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. ముడిచమురు ధరలు ఐదుశాతం పైగా పెరిగి దిగుమతి చేసుకొనే దేశాలన్నింటి బడ్జెట్లను తారుమారు చేయటమే కాదు, వినియోగదారుల మీద భారం మోపేందుకు తెరతీశాడు. డోనాల్డ్ ట్రంప్, అతగాడికి మద్దతిస్తున్న పశ్చిమ దేశాల బాధ్యతా రాహిత్యమే దీనంతటికీ కారణం. హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుతిన్‌తో మరో భేటీ జరిపి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ట్రంప్ అలాంటి సమావేశం లేదని, మాటలతో ప్రయోజనం లేదని చెప్పేశాడు.
తాత్కాలిక కాల్పుల విరమణతో ప్రయోజనం లేదని, శాశ్వత పరిష్కారం కుదరాలని పుతిన్ తెగేసి గతంలోనే చెప్పాడు. నెల లేదా కొద్ది నెలల పాటు మిలిటరీ చర్య నిలిపివేస్తే ఆ వ్యవధిని ఉపయోగించుకొని ఉక్రెయిన్‌కు సాయుధ జవసత్వాలు చేకూర్చటం పశ్చిమ దేశాల ఎత్తుగడ అని తెలుసుగనుకనే చర్చల సమయంలో కూడా దాడులను ఆపేది లేదని రష్యా స్పష్టం చేసింది. తెలివితేటలు అమెరికా అబ్బసొత్తు కాదు, ‘తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడని’ పెద్దలు ఊరికే చెప్పలేదు.ట్రంప్‌తో సహా ఎవరు కోరినా మాట్లాడటానికి సిద్ధమన్న పుతిన్ ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా తమ దేశభద్రత గురించి రాజీ పడేది లేదనే వైఖరిని తీసుకున్నాడు.
నాటోను విస్తరించి ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇచ్చి తమ ముంగిట ఆయుధాలు పెట్టవద్దన్న రష్యా న్యాయమైన కోరికను మన్నిస్తే ఇంత జరిగేది కాదు, దానితో అసలు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోనీ అదేమన్నా గొంతెమ్మ కోరికా! కానే కాదు, సోవియట్ విచ్ఛిన్న సమయంలో నాటోను రష్యా వైపునకు విస్తరించబోమని అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మూడున్నర దశాబ్దాల క్రితం చెప్పాయి. ఆ మాట నిలుపుకోవాలనే రష్యా కోరుతున్నది. కానీ అమెరికా నాయకత్వంలోని పశ్చిమదేశాలు రష్యాను దెబ్బతీయాలనే ఉన్మాదంతో యావత్ ప్రపంచాన్నే ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఎవరి భద్రతను వారు చూసుకోవటం సహజ హక్కు. ఆ రీత్యా పశ్చిమదేశాల కుట్రలకు వ్యతిరేకంగా రష్యా 2014 నుంచి తన రక్షణ కార్యాచరణకు పూనుకుంది. దానిలో భాగంగా అప్పటివరకు తమకెలాంటి ముప్పు తలపెట్టలేదు పోనీలే అని ఉపేక్షించి క్రిమియా ద్వీపకల్పాన్ని ఉక్రెయిన్‌లో కొనసాగనిచ్చేందుకు అంగీకరించిన రష్యన్లు ఒకనాటి తమ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నారు.
ఉక్రెయిన్ స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తే ఆ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, రష్యాకు వ్యతిరేకంగా అమెరికా కుట్రలో భాగస్వామి కావటంతో దానికి అనూహ్యమైన గుణపాఠాన్ని పుతిన్ యంత్రాంగం నేర్పింది. పోనీ అప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకున్నదా అంటే అదీ లేదు. అందుకే 2022 ఫిబ్రవరి చివరి వారం నుంచి రష్యా మిలిటరీ చర్య ప్రారంభించి ఉక్రెయిన్‌కు మరో పాఠం చెప్పేందుకు పూనుకుంది, గత 1,338 రోజులుగా కొనసాగుతున్నది. మెల్లమెల్లగా నాలుగోవంతు ఉక్రెయిన్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఏ రీత్యా చూసినా రష్యాను వెనక్కు కొట్టే స్థితిలేదని అందరికీ తెలుసు, అయినప్పటికీ డోనాల్డ్‌ట్రంప్, ఐరోపా సమాఖ్య ప్రతిష్టకుపోయి ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నందున యావత్ దేశాలు వాటి బాధ్యతారాహిత్యాన్ని నిరసించాలి. తాను అధికారానికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ పోరు నిలిపివేస్తానని చెప్పిన ట్రంప్ అనేక పిల్లిమొగ్గలు వేశాడు, ఆ పరంపరలో భాగమే రష్యా చమురు కంపెనీలపై తాజా ఆంక్షలు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేవీ రష్యాను ప్రభావితం చేయలేకపోయాయి.
తాజా ఆంక్షల ప్రభావం ఎలా ఉండేదీ చూడాల్సి ఉంది. చైనా ఎలాగూ లొంగే ఘటం కాదని తెలుసు గనుక మనకంటే ఎక్కువ కొనుగోలు చేస్తున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు ట్రంప్. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మనదేశం మీద అపరాధ పన్నులు వేశాడు.దానికి మనదేశం లొంగలేదు.సరిగ్గా తాజా ఆంక్షల ప్రకటనకు ముందు కొనుగోలు నిలిపివేసేందుకు మోడీ అంగీకరించినట్లు ఒక ప్రకటన చేశాడు. రష్యన్ కంపెనీలపై ఆంక్షలతో చైనా, మనదేశం కూడా ముడిచమురు దిగుమతులు ఆపివేస్తాయన్నది పశ్చిమదేశాల ఆశ. దీనికి ప్రతిగా రెండు దేశాలూ ఏం చేస్తాయో చూడాల్సి ఉంది. తాజా ఆంక్షలు లేదా ట్రంప్ వైఖరి తాత్కాలికమా లేక మరోసారి మారుతుందా? ఎందుకంటే అవి రష్యాకే పరిమితం కాదు, అనేక దేశాలు అమెరికా, ఐరోపా దేశాలతో సంబంధాలను సమీక్షించుకోక తప్పనిస్థితిని ట్రంప్ కల్పించాడు. మనదేశమూ ఒక స్పష్టమైన వైఖరిని తేల్చుకోకతప్పదు.
ఉద్రిక్తతను పెంచుతున్న ట్రంప్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



