Wednesday, January 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ వాణిజ్య భాగస్వాములనూ వదలని ట్రంప్‌

ఇరాన్‌ వాణిజ్య భాగస్వాములనూ వదలని ట్రంప్‌

- Advertisement -

భారత్‌పై 75 శాతానికి చేరనున్న టారిఫ్‌
పాతిక శాతం సుంకం విధింపు

ఇరాన్‌పై కోపంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ వాణిజ్య భాగస్వాములను కూడా వదలడం లేదు. ఇరాన్‌తో వాణిజ్యం నెరపుతున్న దేశాలపై పాతిక శాతం సుంకాన్ని విధించారు. అయితే ట్రంప్‌ లక్ష్యం భారదేశమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇరాన్‌, ఉక్రెయిన్‌…ఇలా ఎక్కడ సంక్షోభం తలెత్తినప్పటికీ భారత్‌పై గురి పెట్టడానికి ట్రంప్‌కు ఏదో ఓ కారణం దొరుకుతుంది. భారత్‌ తమకు ‘అత్యంత అవసరమైన భాగస్వామి’ అంటూ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న సెర్గియో గార్‌ గొప్పలు చెప్పిన కొద్ది గంటలకే ట్రంప్‌ బాంబు పేల్చారు. ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న దేశాలపై పాతిక శాతం సుంకాలు విధిస్తున్నానని ప్రకటించారు. ఈ చర్య భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఎందుకంటే ఇరాన్‌తో వాణిజ్య భాగస్వామ్యం నెరపుతూ మొదటి ఐదు స్థానాలలో ఉన్న దేశాలలో భారత్‌ కూడా ఉంది. ఇప్పటికే భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించగా ట్రంప్‌ తాజా చర్యతో అవి 75 శాతానికి చేరబోతున్నాయి.
వాషింగ్టన్‌ : ఇరాన్‌ను అష్టదిగ్బంధనం చేయాలని చూస్తున్న ట్రంప్‌ దాని వాణిజ్య భాగస్వాములపై కూడా కన్నెర్ర చేస్తున్నారు. ఇరాన్‌తో వాణిజ్యం నెరపే దేశాలు అమెరికాతో కూడా వ్యాపారం చేస్తుంటే అవి పాతిక శాతం టారిఫ్‌ చెల్లించాల్సిందేనని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇది తుది ఆదేశమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరక ముందే భారత ఉత్పత్తులు యాభై శాతం టారిఫ్‌ రేటును ఎదుర్కోవాల్సి వస్తోంది. పాతిక శాతం ప్రతీకార సుంకాన్ని విధించిన ట్రంప్‌, రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు మరో పాతిక శాతం టారిఫ్‌ వడ్డించారు. ఇప్పుడు ఇరాన్‌ వాణిజ్య భాగస్వామి అయినందున మరో పాతిక శాతం సుంకం చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తం సుంకాలు 75 శాతానికి చేరుకోబోతున్నాయి.

ఒత్తిడి ఎత్తుగడా?
ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్‌ విధించాలంటూ అమెరికా బిల్లు ప్రతిపాదిస్తోంది. భారత్‌, రష్యా, చైనాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ బిల్లుకు ట్రంప్‌ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఇరాన్‌కు చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ ట్రంప్‌ చర్య భారత్‌కే ఎక్కువ నష్టం కలిగి స్తుంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వాణిజ్య ఒప్పందంపై భారత్‌, అమెరికా ప్రతినిధులు తదుపరి విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా షరతులకు అంగీకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్‌ ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చునని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌తో వాణిజ్యం.. భారత్‌పై ప్రభావం
ప్రభుత్వ డేటా ప్రకారం 2024-25లో భారత్‌, ఇరాన్‌ మధ్య రూ.14,000 కోట్ల వ్యాపారం జరిగింది. భారత్‌ రూ.10,000 కోట్ల విలువైన వస్తువులను ఇరాన్‌కు ఎగుమతి చేయగా ఆ దేశం నుంచి రూ.3,700 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో 2019 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఇరాన్‌ చమురును భారత్‌ దిగుమతి చేసుకోవడం లేదు. మన దేశం నుంచి ఇరాన్‌కు ప్రధానంగా ఆర్గానిక్‌ రసాయనాలు, బాసుమతి బియ్యం, తేయాకు, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పుధాన్యాలు, మాంసం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన బాసుమతి బియ్యానికి అతి పెద్ద మార్కెట్లుగా ఉన్న దేశాలలో ఇరాన్‌ కూడా ఒకటి. ట్రంప్‌ తాజా సుంకం బాసుమతి బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ట్రంప్‌ ఆంక్షల కారణంగా ఇరాన్‌ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిం చేందుకు భారత కంపెనీలు వెనకడుగు వేయవచ్చు. రెండు దేశాల మధ్య ఛాబహార్‌ ఓడరేవు ద్వారా వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌ అక్కడ షాహిద్‌ బెహెష్తీ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తోంది. అమెరికా తాజా సుంకాలు ఓడరేవు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపబోవు.

అమెరికాకు ఖమేనీ హెచ్చరికలు

ఇరాన్‌తో వాణిజ్యం జరిపే అన్ని దేశాల పైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ”మా ఇరాన్‌ దేశం శత్రువుల ముందు తలొగ్గదని పలుమార్లు చాటి చెప్పాం. ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలు ఆపాలని, మా దేశానికి ద్రోహం చేస్తోన్న కిరాయి వ్యక్తులపై ఆధారపడటం మానేయాలని హెచ్చరి స్తున్నాం. ఇరాన్‌ బలమైన, శక్తిమంతమైన దేశం. మాకు శత్రువు గురించి తెలుసు. వారిని ఎదుర్కోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం” అని ఖమేనీ ఖాతాలో రాసుకొచ్చారు. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు రెండువేల మంది నిరసనకారులు చనిపోయారని అధికారవర్గాలు ధ్రువీకరిం చాయి. అదే సమయంలో ప్రభుత్వానికి అను కూలంగా రాజధాని నగరం టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్‌ స్క్వేర్‌ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి తదితరులు అందులో భాగం కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -