నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్భంధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ఎంపికలపై అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం చర్చిస్తోందని వైట్‌హౌస్ మంగళవారం ప్రకటించింది. లక్ష్యాన్ని సాధించేందుకు ‘మిలటరీ’ని ప్రయోగించడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను అడ్డుకునేందుకు గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతా ప్రాధాన్యతగా ట్రంప్ భావిస్తున్నారని జాతీయ మీడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే మార్గాల గురించి ఓవల్ కార్యాలయంలో చర్చలు కొనసాగుతున్నాయని మరియు సలహాదారులు వివిధ మార్గాలపై చర్చిస్తున్నారని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా నాటో నేతలు చేసిన ప్రకటనలపై ట్రంప్ భయపడటం లేదని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కోనుగోలు చేయడం లేదా ఆ భూభాగంతో స్వేచ్ఛా అనుబంధ ఒప్పందం (సిఒఎఫ్‌ఎ) ఏర్పరుచుకోవడం కూడా ఉందని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఒక అధికారి తెలిపారు. సిఒఎఫ్‌ఐ ఒప్పందం గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో భాగం చేయాలనే ట్రంప్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని అన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన అనంతరం గ్రీన్‌ల్యాండ్‌పై సుమారు రెండు నెలల్లో నిర్ణయం ప్రకటిస్తానని ట్రంప్ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే.



