సెర్గియోగోర్ నియామకానికి సెనెట్ ఆమోదం
వాషింగ్టన్ : భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియోగోర్‌ను నియమిస్తున్నట్టు ఇటీవల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియామకానికి తాజాగా సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఆయన భారత్‌లోనే కాకుండా దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోన్న తరుణంలో సెనెట్ నుంచి ఈ ఆమోదం లభించింది. వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా కొనసాగిన 38 ఏండ్ల సెర్గియోగోర్.. ట్రంప్‌నకు వీర విధేయుడు. అందుకే అతితక్కువ కాలంలోనే ఆయన ట్రంప్ పరిపాలన విభాగంలో స్థానం సంపాదించగలిగారు. అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన సెర్గియోగోర్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియాలో పర్యవేక్షకుడిగా నియమించడం దౌత్యవర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే సెర్గియో నియామకంపై భారత్‌లో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై విదేశీ వ్యవహారాల నిపుణుడు, మాజీ దౌత్యవేత్త కన్వల్ సిబల్ స్పందిస్తూ భారత్‌లో నియమించిన దౌత్యవేత్తను దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా నియమించడం ఇదే తొలిసారి అని అన్నారు. పాకిస్తాన్ సహా పొరుగుదేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలను ఆయన గమనిస్తాడన్నది వాస్తవమని పేర్కొన్నారు. అయితే.. ఈ చర్య భారత్, పాకిస్తాన్‌ను ఒకేగాటన కట్టినట్లవుతుందని.. ఇలాంటి అమెరికా వైఖరిని భారత్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. అంతేకాదు.. ఇక భారత్-అమెరికా సంబంధాల్లో ఇండో-పసిఫిక్ ప్రాధాన్యం కనుమరుగవుతుందని చెప్పారు.
అధ్యక్షుడి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికే ఆయన నియామకం చేపట్టారన్న విమర్శ వ్యక్తమైంది.”ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన ప్రాంతంలో (ఆసియా దేశాలను ఉద్దేశిస్తూ) నా ఎజెండా అమలుచేయడానికి, దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నాకు సహాయపడడానికి నేను పూర్తిగా విశ్వసించే ఓ వ్యక్తి కావాలి. ఆ విషయంలో సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు. సెర్గియోకు నా అభినందనలు” అని ఆ నియామకం వేళ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సెర్గియోపై ట్రంప్‌నకు విపరీతమైన నమ్మకం ఉంది. ఆయన చెప్పిన మీదటే నాసా చీఫ్ నియామకాన్ని చివరి నిమిషంలో మార్చేయడం గమనార్హం.