Wednesday, October 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌ ప్రధానితో ట్రంప్‌ భేటీ

జపాన్‌ ప్రధానితో ట్రంప్‌ భేటీ

- Advertisement -

రేర్‌ ఎర్త్స్‌ సరఫరా ఒప్పందంపై సంతకాలు

టోక్యో : ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం టోక్యోలో జపాన్‌ నూతన ప్రధాని సానే తకైచీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రేర్‌ ఎర్త్స్‌, కీలక ఖనిజాల సరఫరాకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. తకైచీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపిస్తూ ఇదో పెద్ద ఒప్పందమని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు గతంలో కంటే బలోపేతం అవుతాయని చెప్పారు. జపాన్‌కు ఏ సాయం కావాలన్నా అందిస్తానని భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రపంచ దేశాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలను పరిష్కరిం చడంలో ట్రంప్‌ చూపుతున్న చొరవను తకైచీ కొనియాడారు. నోబెల్‌ శాంతి బహుమతికి ఆయనను నామినేట్‌ చేస్తానని అన్నారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు అమెరికా నౌకాదళ స్థావరాన్ని సందర్శించారు. జీడీపీలో రక్షణ వ్యయాన్ని రెండు శాతానికి పెంచాలన్న తకైచీ నిర్ణయాన్ని ట్రంప్‌ స్వాగతించారు. జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టొయాటో అమెరికాలో పది బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఆటో ప్లాంట్లు ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి సైనిక సామగ్రి కొనుగోళ్లను పెంచుకోవాలన్న జపాన్‌ నిర్ణయాన్ని ప్రశంసించారు.

కాంబోడియా-థాయిలాండ్‌, ఇజ్రాయిల్‌- హమాస్‌ మధ్య కాల్పుల విరమణ సాధించడం ట్రంప్‌ అసాధారణ విజయానికి నిదర్శనమని తకైచీ తెలిపారు. కాగా అనేక ముఖ్యమైన ఎలక్ట్రానిక్‌ విడిభాగాల తయారీలో చైనా ప్రదర్శిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టాలని అమెరికా, జపాన్‌ భావిస్తున్నాయి. అందుకే రేర్‌ ఎర్త్స్‌, ఖనిజాల సరఫరాలను పెంచుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ట్రంప్‌ పట్ల మాజీ ప్రధాని అబే చూపిన ప్రేమాభి మానాలను తకైచీ పదే పదే ప్రస్తావించారు. అబే 2022లో హత్యకు గురయ్యారు. 2016లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను కలుసుకున్న తొలి విదేశీ నేత అబే. గోల్ఫ్‌ క్రీడపై వీరిద్దరికీ మంచి ఆసక్తి ఉండడంతో వారి మధ్య స్నేహబంధం బలపడింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అబే పేరును తకైచీ తెర పైకి తెచ్చారు. స్వదేశోం తకైచీ రాజకీయంగా ఏమంత బలంగా లేరు. ఆమె నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్‌ దిగువసభలో మెజారిటీకి రెండు ఓట్ల దూరంలో ఉంది.

జపాన్‌లోనూ తప్పని నిరసనల సెగ
ట్రంప్‌ పర్యటనను నిరసిస్తూ జపాన్‌లో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ల వద్దకు చేరుకొని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ప్రపంచంలోని నిరంకుశులు మాకు అవసరం లేదు’, ట్రంప్‌, నెతన్యాహూలకు మేము వ్యతిరేకం’ అనే నినాదాలతో షింబాషీ స్టేషన్‌ పరిసరాలు మార్మోగిపోయాయి. టోక్యోలోని మినాటో వార్డ్‌లో షింబాషీ స్టేషన్‌ ప్రధానమైన రవాణా హబ్‌. దేశంలోని అతి పురాతన రైల్వే స్టేషన్లలో అది ఒకటి. ట్రంప్‌ సృష్టిస్తున్న ప్రపంచాన్ని మేము తిరస్కరిస్తున్నామంటూ రాసి ఉన్న ఓ బ్యానర్‌ను నిరసనకారులు ప్రదర్శించారు. సైనిక బడ్జెట్‌ను పెంచుకోవాలన్న నూతన ప్రధాని నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వెనుక ట్రంప్‌ ఒత్తిడి ఉన్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రయిల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయవద్దని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -