– దావోస్ వెళ్తుండగా మధ్యలోనే వెనుదిరిగిన ‘ఎయిర్ ఫోర్స్ వన్’
– టేకాఫ్ అనంతరం సాంకేతిక లోపం గుర్తింపు
– మరో విమానంలో ప్రయాణం కొనసాగించిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఇందుకు కారణమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే తిరిగి వాషింగ్టన్‌కు చేరుకున్నది. విమానంలో తలెత్తిన చిన్న సాంకేతిక లోపమే ఇందుకు కారణమని వైట్ హౌస్ ప్రకటించింది.
రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ కథనాల ప్రకారం.. ట్రంప్ ప్రయాణిస్తున్న బోయింగ్ 74-200 (వీసీ-25ఏ) విమానం స్విట్జర్లాండ్ వైపు బయలుదేరిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని తిరిగి వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్‌ర్యూస్‌కు మళ్లించారు. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. విమానంలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య గుర్తించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. అయితే ఆ లోపం గురించి పూర్తి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. విమానంలో ఉన్న ఒక విలేఖరి తెలిపిన వివరాల ప్రకారం.. టేకాఫ్ తర్వాత ప్రెస్ క్యాబిన్‌లో లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. సుమారు అరగంట ప్రయాణం చేసిన తర్వాత ఎయిర్‌ఫోర్స్ వన్ వెనక్కి మళ్లింది.
కాగా ట్రంప్ విమానంలో సాంకేతిక లోపం, తిరిగి వాషింగ్టన్‌కు చేరుకోవడంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరలయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉదహరిస్తూ ఈ పోస్టులు ఉన్నాయి. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తూ తిరిగి మళ్లిందనీ, అదే సమయంలో మరికొన్ని సైనిక విమానాలు కూడా హౌల్డింగ్ ప్యాటర్న్‌లో ఉన్నట్టు సదరు పోస్ట్‌లు పేర్కొన్నాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ తిరిగి వాషింగ్టన్ చేరుతుండగా.. ట్రంప్ మోటార్‌కేడ్‌కు చెందిన వాహనాలు వేగంగా ఎయిర్‌బేస్ వైపు దూసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
సాంకేతిక లోపం కారణంగా మొదటి విమానం వెనక్కి వచ్చినప్పటికీ.. డోనాల్డ్ ట్రంప్ మరో విమానంలో దావోస్ పర్యటనను కొనసాగించారు. దావోస్ సమావేశాల్లో ఆయన గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించిన తన ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
ట్రంప్‌నకు తప్పిన ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



