– ఎలన్ సహచరుడి నామినేషన్‌కు నో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సలహాదారు ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చారు. నాసా అధిపతిగా మస్క్ సూచించిన బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఐసాక్‌మాన్ ‘పూర్వ సంబంధాల’ను కూలంకషంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చానని శనివారం రాత్రి ట్రంప్ తెలియజేశారు. కాగా ఈ నిర్ణయం వెనుక ట్రంప్ ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలియడం లేదు. వివరణ కోరుతూ శ్వేతసౌధానికి ఈ-మెయిల్ పంపగా సమాధానం రాలేదు. ‘ఐసాక్‌మాన్ పూర్వ సంబంధాలను కూలంకషంగా సమీక్షించిన తర్వాత నాసాకు నేతృత్వం వహించేందుకు ఆయన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నాను’ అని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో తెలిపారు. త్వరలోనే నూతన నామినీని ప్రకటిస్తానని, ఆయన అంతరిక్షంలో అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతారని చెప్పారు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు తదుపరి అధినేతగా ఐసాక్‌మాన్‌ను ఎంపిక చేసుకున్నానని గత డిసెంబరులో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో ట్రంప్ ప్రకటించారు. 42 సంవత్సరాల ఐసాక్‌మాన్‌కు మస్క్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2021లో మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ నుండి ఐసాక్‌మాన్ తన తొలి ఛార్టర్డ్ విమానాన్ని కొనుగోలు చేసినప్పటి నుండి వీరిద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఐసాక్‌మాన్ క్రెడిట్‌కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ షిప్ట్4కు సీఈఓగా, వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్పేస్‌ఎక్స్ నుండి అనేక అంతరిక్ష నౌకలను కొనుగోలు చేశారు. తొలిసారి ప్రైవేటుగా అంతరిక్షంలో నడిచారు. స్పేస్‌ఎక్స్ కంపెనీకి నాసాతో విస్తృత కాంట్రాక్టులు ఉన్నాయి. కాగా సెనెట్‌కు చెందిన వాణిజ్య, శాస్త్ర, రవాణా కమిటీ ఏప్రిల్‌లో ఐసాక్‌మాన్ నామినేషన్‌ను ఆమోదించింది. దీనిపై త్వరలోనే సెనెట్‌లో పూర్తి స్థాయి ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ లోగానే ట్రంప్ ఆయన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
ట్రంప్ నిర్ణయంపై మస్క్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంతటి సమర్ధుడు, మంచి మనసున్న మనిషి దొరకడం చాలా అరుదు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మస్క్ ఇటీవలే ప్రభుత్వ సమర్ధతా విభాగమైన డోజ్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.
మస్క్‌కు ట్రంప్ షాక్
- Advertisement -
- Advertisement -