Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంఫార్మాకు ట్రంప్‌ షాక్‌

ఫార్మాకు ట్రంప్‌ షాక్‌

- Advertisement -

బ్రాండెడ్‌ ఔషధాలపై వంద శాతం సుంకాలు
గృహోపకరణాలు, ట్రక్కుల పైనా టారిఫ్‌లు
అక్టోబర్‌ 1 నుంచి వర్తింపు
ట్రూత్‌ సోషల్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు వెల్లడి
భారత్‌పై అధిక ప్రభావం

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలతో విరుచుపడ్డారు. ఈ సారి ఫార్మా ఇండిస్టీని అనిశ్చితిలోకి నెట్టేసేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫార్మా డ్రగ్‌ దిగుమతులపై వంద శాతం టారిఫ్‌లు విధించారు. అలాగే గృహోపకరణాలు, ట్రక్కుల పైనా వేర్వేరు సుంకాలు వేశారు. పెంచిన టారిఫ్‌లు అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ”ఫార్మాస్యూటికల్‌ డ్రగ్స్‌పై వంద శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నాం. యూఎస్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసే కంపెనీలపై మాత్రం ఈ సుంకాలు ఉండవు. దీని నుంచి ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదు” అని ఆయన పోస్ట్‌ చేశారు. విదేశీ కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాలో దేశీయ తయారీని బలోపేతం చేయడానికి ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే భాగంగానే ట్రంప్‌ నుంచి ఈ ప్రకటన వచ్చినట్టుగా చెప్తున్నారు.

భారత్‌పై అధిక ప్రభావం
ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం బ్రాండెడ్‌ ఔషధాలు, పేటెంట్‌ పొందిన ఔషధ ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే ఈ టారిఫ్‌ విధింపులు ప్రపంచవ్యాప్తంగా ఫార్మా పరిశ్రమను అనిశ్చితిలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ట్రంప్‌ చర్యలు భారత్‌నూ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత్‌.. ప్రపంచంలో నే అతిపెద్ద ఔషద ఎగుమతుల దేశాల్లో ఒకటిగా ఉన్నది. అలాగే అమెరికాలో వినియోగించే ఔషధాలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ భారత్‌ ఎగుమతి చేస్తుంది. కానీ వీటిలో ఎక్కువ భాగం పేటెంట్‌ కింద లేని, బ్రాండెడ్‌ వెర్షన్ల కంటే చౌకైన మందులే కావటం ఉపశమనం కలిగించే అంశం. ఎందుకంటే.. ట్రంప్‌ వంద శాతం సుంకాలు పేటెంట్‌ పొందిన, బ్రాండెడ్‌ ఔషధాలను టార్గెట్‌ చేస్తుంది.ముఖ్యంగా భారత్‌లో ఔషధకేంద్రంగా ఉన్న తెలంగాణ నుంచి కీలకమైన మందులు సరఫరా అవుతాయి. తాజా టారిఫ్‌తో అధికభారం పడనున్నదని మార్కెట్‌ నిపుణులు పేర్కోంటున్నారు.

భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా
ఫార్మాన్యూటికల్‌ ఉత్పత్తులకు అమెరికా భారతదేశపు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌. 2024 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం 27.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతుల్లో, 31శాతం లేదా 8.7 బిలియన్‌ డాలర్లు (సుమారురూ.77,138 కోట్లు) అమెరికాకు వెళ్లాయని ఫార్మాన్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనే పరిశ్రమల సంస్థ పేర్కొన్నది. 2025 మొదటి అర్థభాగంలో 3.7 బిలియన్‌ డాలర్ల (రూ.32, 505కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. నివేదికల ప్రకారం.. అమెరికాలో వినియోగించే జనరిక్‌ ఔషదాలలో 45 శాతం మరియు బయోసిమిలర్‌ ఔషదాలలో 15శాతం భారత్‌ సరఫరా చేస్తోంది. డా.రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌, సన్‌ ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా వంటి సంస్థలు తమ మొత్తం ఆదాయంలో
30-50శాతం వరకు అమెరికన్‌ మార్కెట్‌ నుంచి వస్తున్నట్టు సమాచారం. సాధారణంగా అమెరికన్లు భారత్‌లో తయారైన తక్కువ ధరకు లభించే జనరిక్స్‌పై ఆధారపడతారు. అధిక సుంకాలతో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, దేశంలో ఔషద కొరతకు దారితీయవచ్చు. యూఎస్‌ జనరిక్స్‌ రంగంలో స్వల్ప మార్జిన్‌తో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు, వాటిపై సుంకాలు విధిస్తే.. అదనపుఖర్చులను భరించడం కష్టతరం కావచ్చు.

‘భవిష్యత్‌లో జనరిక్‌ ఔషధాలపై టారిఫ్‌ విధిస్తే నష్టమే’
అయితే ట్రంప్‌ ప్రకటన అనేది మార్కెట్‌ సెంటిమెంట్‌ను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ”భారత్‌ జనరిక్‌ ఔషధాల ఎగుమతిదారుగా ఉన్నది. కాబట్టి ట్రంప్‌ నిర్ణయం వెంటనే ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ ఈ ప్రకటన ఔషధ స్టాక్‌లపై సెంటిమెంట్‌ ప్రభావాన్ని చూపవచ్చు. భవిష్యత్‌లో ట్రంప్‌ టారిఫ్‌ చర్యలు జనరిక్‌ ఔషధాలకూ విస్తరించే ప్రమాదం ఉన్నది. ఒకవేళ అదే జరిగితే.. అది మరింత గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు” అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ డాక్టర్‌ వి.కె విజయకుమార్‌ అన్నారు. ఈ సుంకాలు ఎలా అమలు చేస్తారన్న విషయంలో మరింత స్పష్టత వచ్చే వరకు దాని ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని వెల్త్‌మిల్స్‌ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్‌ క్రాంతి బత్ని అన్నారు.

వీటి పైనా సుంకాలు..
ఫార్మా డ్రగ్స్‌తో పాటు గృహోపకరణాల పైనా ట్రంప్‌ టారిఫ్‌లు విధించారు. ఇందులో ఫర్నిచర్‌, ట్రక్కులు, కిచెన్‌ ఉపకరణాలు వంటివి ఉన్నాయి. కిచెన్‌ క్యాబినెట్‌, బాత్‌రూమ్‌ పరికరాలపై 50 శాతం, అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాల బాదారు. బయటి దేశాల నుంచి ఈ ఉత్పత్తులు పెద్దమొత్తంలో యూఎస్‌లోకి వస్తుండటం చాలా అన్యాయమనీ, జాతీయ భద్రత, ఇతర కారణాల దృష్ట్యా ఈ సుంకాలు విధించనట్టుగా ట్రంప్‌ తన పోస్ట్‌లో వివరించారు.

అమెరికాలో రెట్టింపు కానున్న ఔషధ ధరలు
సుంకాల పెంపు ద్వారా అమెరికన్‌ దిగుమతిదారులు, వినియోగదారులకు బ్రాండెడ్‌ ఔషధ ఉత్పత్తుల ధరలు రెట్టింపు కానున్నాయి. అయితే ఈ వంద శాతం సుంకాల విధింపు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిఉన్నది. ఈ కొత్త సుంకాలు వాణిజ్య భాగస్వాములపై విధించిన జాతీయ సుంకాలకు అదనంగా వర్తింపజేస్తారా లేదా అన్నది ట్రంప్‌ వివరించలేదు. అమెరికాకు ఎక్కువగా భారత్‌తో పాటు ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ వంటి యూరోపియన్‌ దేశాల నుంచి ఔషధ దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. అబ్జర్వేటరీ ఆఫ్‌ ఎకనామిక్‌ కాంప్లెక్సిటీ (ఓఈసీ) ప్రకారం.. 2023లో యూఎస్‌ 86.4 బిలియన్‌ డాలర్ల విలువైన ప్యాక్‌ చేసిన మందులను దిగుమతి చేసుకున్నది. ఇందులో అత్యధికంగా 14.2 శాతం అంటే 12.3 బిలియన్‌ డాలర్ల విలువైన మందులు ఐర్లాండ్‌ నుంచి వచ్చాయి. భారత్‌ నుంచి 10.6 శాతం.. అంటే 9.2 బిలియన్‌ డాలర్ల విలువైన ప్యాక్‌ చేసిన మందులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.

మార్కెట్లపై ప్రభావం
ట్రంప్‌ ప్రకటన తర్వాత ఆసియా, యూరప్‌లలోని ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు తమ షేర్ల ధరలలో తగ్గుదలను చూశాయి. భారత్‌లో ఫార్మాస్యూటికల్‌ ఇండెక్స్‌ రెండు శాతం పడిపోయింది. సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండిస్టీస్‌ మూడు శాతం పడిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -