Monday, February 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ కోరితే ట్రంప్‌ భేటీ అవుతారు

ఖమేనీ కోరితే ట్రంప్‌ భేటీ అవుతారు

- Advertisement -

మా మిత్రులు చైనా వెళ్లడం తప్పు కాదు
ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అనుమతించం..అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

వాషింగ్టన్‌ : ఇరాన్‌తో నెలకొన్న వివాదానికి దౌత్య పరిష్కారం సాధించాలన్నదే తమ అభిమతమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. అవకాశం లభిస్తే ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యేందుకు తమ అధ్యక్షుడు ట్రంప్‌ సుముఖంగా ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం నేరుగా చర్చించడం ఒక ఆచరణాత్మక మార్గంగా ట్రంప్‌ భావిస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులతో సమావేశం కావడాన్ని వారి అభిప్రాయాలతో ఏకీభవించడంగా అర్థం చేసుకోకూడదని చెప్పారు. ‘నేను ఎవరితో అయినా కలవడానికి ఇష్టపడే అధ్యక్షుడి కింద పనిచేస్తున్నాను’ అని బ్లూమ్‌ బర్గ్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ను కలవాలని అనుకుంటున్నానని ఖమేనీ చెబితే ఆ సమావేశం జరుగుతుందని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు.

దాడి చేస్తే ఎదుర్కోవడానికే సైనిక మోహరింపు
‘ఖమేనీని కలవడం అంటే ఆయనతో ఏకీభవిస్తున్నట్లు కాదు. ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించే మార్గం అదేనని ట్రంప్‌ అనుకుంటున్నందునే ఆ భేటీ జరుగుతుంది. అంతేకానీ ఎవరితో అయినా కలవడం అంటే ఆయనతో ఏకీభవించినట్లుగా ట్రంప్‌ భావించడం లేదు’ అని రుబియో తెలిపారు. మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక మోహరింపులను పెంచుతున్న తరుణంలో రుబియో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా దళాలు, స్థావరాలపై ఇరాన్‌ దాడి చేస్తే వాటిని ఎదుర్కోడానికే ఈ సన్నాహాలు చేస్తున్నామని రుబియో చెప్పారు. అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్‌ గతంలో అనుకున్నదని గుర్తు చేశారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇరాన్‌ను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇరాన్‌ అణు కార్యక్రమం అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని అన్నారు.

చైనాలో పర్యటిస్తే తప్పేముంది?
మధ్యప్రాచ్యంలో సైనిక బలగాలను పెంచుతున్నప్పటికీ ఇరాన్‌తో ఒప్పందం కోసం చర్చలు జరిపేందుకు ట్రంప్‌ కృతనిశ్చయంతో ఉన్నారని రుబియో చెప్పారు. ఇరాన్‌తో త్వరలోనే చర్చలు జరగవచ్చునని, తదుపరి సమావేశాలలో అమెరికా రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌, జేర్డ్‌ కుష్నర్‌ భాగస్వాములు అయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. ఒప్పందం ద్వారా సమస్యలకు ముగింపు పలికేందుకు ట్రంప్‌ ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. అమెరికా మిత్రదేశాలు చైనాకు చేరువ కావడాన్ని రుబియో ప్రస్తావించారు. కెనడా, బ్రిటన్‌ ప్రధానులు ఇటీవల బీజింగ్‌లో జరిపిన పర్యటనలు, జర్మనీ ఛాన్సలర్‌ జరపబోయే పర్యటనను ఆయన ఉటంకిస్తూ అవి మిత్రదేశాల బలహీనతకు సూచికలు కావని అన్నారు. ప్రధాన దేశాల మధ్య దౌత్యం సాధారణమేనని, అది అవసరం కూడా అని తెలిపారు. ప్రధాన దేశాలు సంబంధాలను కలిగి ఉండకపోవడం, వివిధ అంశాలపై చర్చించుకోకపోవడం, అనవసరమైన ఘర్షణలను నివారించకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని చెప్పారు. బీజింగ్‌లో పర్యటించాలని ట్రంప్‌ అనుకుంటున్నారని, గతంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆయన కలిశారని గుర్తు చేశారు. అదే వేదికపై తాను చైనా విదేశాంగ మంత్రిని కలిశానని రుబియో అన్నారు.

ఆంక్షలు ఎత్తివేస్తే..
అమెరికాతో అణు ఒప్పందానికి సిద్ధం : ఇరాన్‌మంత్రి

ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు ట్రంప్‌ సిద్ధంగా ఉంటే.. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి, రాజీకి తమ దేశం సిద్ధంగా ఉందని ఉప విదేశాంగ మంత్రి మాజిత్‌ తఖ్త్‌ రావంచి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. ఆంక్షలను ఎత్తివేస్తే, అణు కార్యక్రమంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ఈ సమస్యను పదేపదే క్షిపణులతో ముడిపెట్టడాన్ని తోసిపుచ్చారు. ప్రారంభ చర్చలు సానుకూల దిశలో సాగాయని, అయితే వెంటనే పరిష్కారానికి రాలేమని అన్నారు. దౌత్యవేత్తలు స్టీవ్‌ విట్కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌ సహా అమెరికా ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం ఇరాన్‌ ప్రతినిధులతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలకు ఒమన్‌ ప్రతినిధులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -