Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ చర్యలు సంక్షోభానికి ప్రతిబింబం

ట్రంప్‌ చర్యలు సంక్షోభానికి ప్రతిబింబం

- Advertisement -

యూఎస్‌తో ఒప్పందం భారత్‌కు వ్యతిరేకం
సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌
దేశంలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను అందరూ పిచ్చివాడిగా అభివర్ణించినప్పటికీ, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులను ఆ పిచ్చిలో భాగంగా పరిగణించలేమని ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ట్రంప్‌ మూర్ఖుడనే వాదన నిజమే అయినప్పటికీ, ట్రంప్‌ చర్యలు ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కేంద్రమైన అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రతిబింబమని స్పష్టంగా చెబుతున్నాయని ఆయన అన్నారు. సోమవారంనాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ సంఘాలు సంయుక్తంగా ‘అమెరికా వాణిజ్య ఒప్పందం, అసమాన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాలు, దేశ ప్రజలు’ అనే అంశంపై జాతీయ సెమినార్‌ నిర్వహించాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమెరికాతో భారత్‌ చేసుకున్న వాణిజ్య ఒప్పందం దేశవ్యతిరేకమైనదని అన్నారు. ”ఈ ఒప్పందాన్ని మూడు ప్రధాన కారణాల వల్ల అసమానంగా వర్ణిస్తు న్నాను. మొదటి కారణం ఏమిటంటే, చమురును రష్యా నుంచి కొనుగోలు చేయకూడదని, యూఎస్‌ఏ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని అది చెబుతోంది. రెండో కారణం, యూఎస్‌ నుంచి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల (100 బిలియన్‌ డాలర్ల) విలువైన వస్తువులను ఇండియా కొనుగోలు చేయాలని అది చెబుతోంది. ప్రస్తుతం భారత్‌.. అమెరికా నుంచి రూ.3.63 లక్షల కోట్ల (40 బిలియన్‌ డాలర్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. దీనిని 9 లక్షల కోట్లకు పెంచాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు.

ఒప్పందం అసమానమని నిరూపించే మూడో కారణం ఏమిటంటే, అమెరికా ఉత్పత్తులపై సున్నా శాతం సుంకం, భారతీయ ఉత్పత్తులపై 18 శాతం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం దేశ వ్యతిరేకమైనదని అంటున్నాను” అని ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఇప్పటికే సుంకాల పేరుతో ట్రంప్‌ చర్యల ద్వారా భారత్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, తాజాగా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. తయారీ, వ్యవసాయ రంగాల సార్వభౌమాధికారం పోతుందని అన్నారు. ఈ ఒప్పందాలు లక్షలాది మంది కార్మికులు, రైతులు, శ్రమించే ప్రజల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు తలొగ్గిందని అన్నారు.

ట్రేడ్‌ డీల్‌తో భారత్‌కు ఒరిగేదేమీ లేదు : జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ ధర్‌
జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ ధర్‌ మాట్లాడుతూ… అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలతో భారత్‌కు జరిగే ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. ఆ ఒప్పందాలతో అమెరికాకు మాత్రమే ప్రయోజనమని అన్నారు. పైగా ఆ ఒప్పందాల ప్రభావం దేశంలోని కార్మికులు, రైతులపై ఉంటుందని ఆందోళన వెలిబుచ్చారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం మాట్లాడుతూ… అమెరికా వాణిజ్య ఒప్పందాలతో దేశంలోని కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. అమెరికా ప్రభుత్వ ప్రకటనల ద్వారానే ఇండియా-యూఎస్‌ ఒప్పందాలు బయటకు వస్తున్నాయని చెప్పారు.
ఇది దేశానికి అవమానమనీ, ప్రజలకు ద్రోహం చేయడమని విమర్శించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకుంటున్న ట్రేడ్‌ డీల్‌ల వివరాలను ఇప్పటివరకు పార్లమెంట్‌కు గానీ, దేశ ప్రజలకు గానీ తెలియజేయలేదన్నారు. ఈ ఒప్పందాలపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన దెబ్బ అని చెప్పారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే చర్యగా ఆయన అభివర్ణించారు.ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌ మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశ వ్యవసాయాన్ని అమెరికా అగ్రో-కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నమని విమర్శించారు. దీనిని రైతుల జీవనాధారాలపై దాడిగా అభివర్ణించారు. దేశీయ పరిశ్రమలు, ఉపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని హెచ్చరించారు. జాతీయ విదేశీ విధాన స్వతంత్రత, భద్రతపై ముప్పు తప్పదని అన్నారు. ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ మాట్లాడుతూ.. అమెరికా ఒప్పందాలతో వ్యవసాయ కార్మికుల జీవనోపాధిపై దాడి జరుగుతుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -