ప్రతీకార చర్యలు సరికావు
ప్రతిఘటించాల్సిన ప్రధాని ప్రసంగాలకే పరిమితం
అమెరికా అధ్యక్షుడి చర్యలకు తీవ్ర ఖండన
మోడీది పలాయనవాదం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : యూఎస్‌లోని ట్రంప్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తప్పుబట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఏకపక్ష, ప్రతీకార చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది. విదేశీ నిపుణులకు అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ యంత్రాంగం అమాంతం రూ.88 లక్షలకు పెంచిన విషయం విదితమే. ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. ఇతర దేశాలను పణంగా పెట్టి తన సొంత వాణిజ్య ప్రయోజనాలను పెంచుకోవటంలో భాగంగా అమెరికా బలవంతపు వ్యూహాలను ఉపయోగిస్తుందన డానికి ఇది మరొక ఉదాహరణ అని పేర్కొన్నది. భారత్‌పై 50 శాతం సుంకాల విధింపు, ఇరాన్‌లో భారత్ ఆపరేట్ చేసే చాబహార్ పోర్ట్‌పై తిరిగి ఆంక్షలను విధించిన తర్వాత హెచ్-1బీ వీసా రుసుము పెంపు నిర్ణయం వచ్చింది. అయితే ఇదంతా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమైన వెంటనే భారత్‌పై ఒత్తిడి తీసుకురావటానికి ఉద్దేశించిన చర్యగా పొలిట్‌బ్యూరో అభివర్ణించింది. ఈ చర్య బెదిరింపులతో సమానమనీ, అన్యాయమైన అమెరికా సుంకాల సంబంధిత డిమాండ్లకు భారత్ లొంగిపోయేలా చేయటానికి ఉద్దేశించినదని వివరించింది.
భారత ప్రధాని మోడీ.. ట్రంప్ నుంచి వచ్చే ఈ బలమైన వ్యూహాలను ప్రతిఘటించాల్సిందిపోయి స్వావలంబన అవసరమంటూ ఎలాంటి స్పష్టతా లేని ప్రసంగాలను ఎంచుకున్నారని అసంతృప్తిని వ్యక్తం చేసింది. మోడీది పలాయనవాద విధానమనీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ప్రతిస్పందన ఆశించినంతగా లేదని వివరించింది. ఇది భారత్‌కు నిరాశ, అవమానకరమని పార్టీ పొలిట్‌బ్యూరో పేర్కొన్నది. హెచ్-1బీ వీసా హోల్డర్ల ప్రవేశాన్ని పరిమితం చేస్తూ అమెరికా చేసిన ప్రకటన వేలాది మంది నైపుణ్యం కలిగిన భారత నిపుణులను ప్రత్యక్షంగా, తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వారి కెరీర్లకు అంతరాయం కలిగించటమే కాకుండా వారి కుటుంబాల జీవనోపాధిని కూడా దెబ్బ తీస్తుందని పార్టీ పొలిట్‌బ్యూరో వివరించింది. ఇలాంటి బలవంతపు, అన్యాయమైన చర్యలకు వ్యతిరేకంగా కేంద్రం ఒక బలమైన వైఖరిని తీసుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికా ఒత్తిడికి లొంగవద్దని సూచించింది. భారత ప్రజల హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.