మంగళవారం నాడు అమెరికా, జపాన్ మధ్య వాణిజ్య, విలువైన ఖనిజాల ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రథమ మహిళా ప్రధాని తకాయిచి టోక్యోలో సంతకాలు చేశారు.వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ అంగీకరించగా ప్రతిగా దాని వస్తువులపై 15శాతం దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా అంగీకరిం చింది. ట్రంప్‌కు కావాల్సినన్ని పొగడ్తలు తప్ప అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారైన న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాలను రెండు దేశాల మధ్య సంబంధాల్లో ” నూతన స్వర్ణయుగం” అని వర్ణించారు. అదిరింపులు, బెదిరింపుల మధ్య జూలై నెలలోనే పెట్టుబడులు, పన్నుల గురించి ఒక అవగాహన కుదిరినట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.
అయితే మంగళవారం నాడు సంతకాలు జరగటానికి ముందు చివరి క్షణం వరకు అనేక అనుమానాలు షికారు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి, థారులాండ్-కంపూచియా మధ్య వివాదాన్ని పరిష్కరించటంలో ట్రంప్ పాత్రను తకాయిచి ఆకాశానికి ఎత్తారు. అసాధారణ చారిత్రక విజయాలుగా ఆమె వర్ణించారు. వారి చర్చల తర్వాతే టోక్యోలోని అక్సాకా పాలెస్‌లో జరిగిన స్వాగత కార్యక్రమానికి ట్రంప్ హాజరయ్యాడు. ఈ ఒప్పందం గురించి ప్రశంసలు, విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. జపాన్ నుంచి అమెరికా ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్ల మేర రుణాలుగా తీసుకుంది. అమెరికా డాలర్లకోసం ప్రతిదేశాన్నీ బెదిరిస్తున్నది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం గురించి గతంలోనే ట్రంప్ మీద విమర్శలు వచ్చాయి. ఆ ఒప్పందంలో తరువాత ఎలాంటి మార్పులూ చేసినట్లు ఎవరూ ప్రకటించలేదు గనుక గత విమర్శలేమిటో ఒకసారి చూద్దాం.
ఐదువందల యాభై బిలియన్ డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తే తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామని, దాని మీద వచ్చే లాభాల్లో 90శాతం తమకే అని ట్రంప్ వత్తిడి చేశాడు. అయితే ఆ మొత్తంలో కేవలం రెండు శాతం మాత్రమే పెట్టుబడిగా ఉంటుందని, మిగిలిన మొత్తం రుణాలు, రుణ హామీల వంటి ఇతర రూపాల్లో ఉంటుందని జపాన్ ప్రతినిధి వర్గనేత రోయెసీ అకజావా టీవీలో బహిరంగంగా చెప్పాడు. కొంత మంది అమెరికన్లకు జపాన్‌ను విక్రయించారని విమర్శిస్తున్నారని, లాభాల్లో 90శాతానికి అంగీకరించినందున నష్టం పెద్దగా ఉండదని దీనికి ప్రతిగా అమెరికా తగ్గించే పన్నుల వలన 68 బిలియన్ డాలర్ల మేర జపాన్‌కు లబ్ది కలుగుతుందని కూడా చెప్పాడు. బహుశా ఈ కారణంతోనే మంగళవారం నాడు ఒప్పందంపై సంతకాల తరువాత న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతికూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. తమ దేశంలో పెట్టుబడులకు, పన్నులు విధింపుకు లంకెపెట్టటం ఒక జపాన్ విషయంలోనే కాదు. ఇప్పటికే ఐరోపా యూనియన్‌తో 600బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడితేనే 15శాతం పన్నులు విధిస్తామని లేకుంటే ఎక్కువ అని ట్రంప్ బెదిరించాడు.
వాణిజ్యం చేయటం, లాభాలు పిండుకోవటంలో అమెరికా, జపాన్ ఎవరికి ఎవరూ తీసిపోరు గనుక పరస్పర లబ్ది లేకుండా అంగీకరించే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక లక్షకోట్ల డాలర్లు అమెరికాకు అప్పు ఇవ్వటమేగాక మరో రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఇప్పటికే జపాన్ పెట్టుబడులు పెట్టింది. జపాన్‌లో డాలర్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరైనా అక్కడి బాంకుల్లో డబ్బుదాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు ఇవ్వాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే అమెరికాకు అప్పులు ఇవ్వటం జపాన్‌కు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్‌లో తక్కువ వడ్డీ చెల్లించి జనాల నుంచి బాంకులు రుణాలు తీసుకుంటాయి, వాటిని ఎక్కువ వడ్డీ రేట్లకు అమెరికా, ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తాయి, ఈ క్రమంలోనే అమెరికాకు అత్యధికంగా జపాన్ లక్ష కోట్ల డాలర్ల మేర రుణబాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయంలో బ్రిటన్ రెండవ స్థానంలో ఉంటే చైనా మూడవదిగా ఉంది.
అమెరికాలో ఉన్న జపాన్ కంపెనీలైన సోనీ,టొయోటా వంటి బహుళజాతి కంపెనీలు, ద్రవ్యపెట్టుబడి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తున్నాయి, వచ్చిన లాభాలను తిరిగి అక్కడే పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజా ఒప్పందంలో అమెరికా కార్లకు ద్వారాలు తెరిచేందుకు జపాన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు డీజిలు, పెట్రోలు తాగే అమెరికన్ కార్లను జపాన్‌లో కొనుగోలు చేసేదెవరు? లేదూ అమెరికన్లు అమ్ముకోవాలనుకుంటే జపనీయుల అవసరం, అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు అందచేస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ అమెరికా కార్లకు డిమాండ్ కూడా తక్కువే గనుక వాటి దిగుమతులకు అనుమతించినా జపాన్ కార్ల మార్కెట్‌కు పెద్ద నష్టమేమీ ఉండదు. జపాన్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా జనాలు ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మొగ్గుచూపుతున్నారు. నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండే అమెరికన్ కార్లను పట్టించుకుంటారా? గతంలో కార్లంటే అమెరికా, ఇప్పుడు జపాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలూ తక్కువ తినలేదు, విద్యుత్ కార్ల రంగంలో చైనా సవాలు విసురుతోంది.
అందువలన ట్రంప్ విధించే పదిహేనుశాతం దిగుమతి పన్నుతో అమెరికా కంపెనీల యజమానులు కొంత కాలం పాటు ఊరట పొందవచ్చు తప్ప తర్వాత పోటీకి అనుగుణంగా తయారుగాకపోతే అంతే సంగతులు. ట్రంప్ ఆసియా పర్యటనలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు కొన్ని షరతులను రుద్దినట్లుగా కనిపిస్తోంది. చిన్న చిన్న దేశాలలో ఎంత దొరికితే అంత అన్నట్లుగా విలువైన ఖనిజాల గురించి ఒప్పందాలు చేసుకున్నాడు. మలేషియా వస్తువుల మీద 19శాతం పన్నుల విధింపు అమల్లో ఉందని చెబుతూనే కొన్నిమినహాయింపులిచ్చాడు.దీనికి ప్రతిగా అమెరికా వస్తువులు, గ్యాస్, వ్యవసాయ ఉత్పత్తులను మలేషియా కొనుగోలు చేయనుంది. అమెరికా కంపెనీ బోయింగ్ నుంచి 30 విమానాలను కొనుగోలు చేస్తామని, మరో 30 గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇవిగాక అమెరికాలో 70 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా పెట్టేందుకు అంగీకరించింది. అయితే కీలకమైన సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేస్తున్న మలేషియా అమెరికా షరతులకు తలొగ్గలేదు. కంపూచియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువుల దిగుమతిపై ఎలాంటి పన్ను ఉండదు.
విలువైన ఖనిజాల శుద్ధి వంటి ప్రక్రియకు అమెరికా పెట్టుబడులను అనుమతిస్తుంది. వియత్నాంపై విధించిన 46శాతం పన్నులను 20శాతానికి తగ్గించేందుకు అమెరికా దిగొచ్చింది. దీనికి ప్రతిగా ఎనిమిది బిలియన్ డాలర్లతో 50 బోయింగ్ విమానాలను కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్ను వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. థారులాండ్ వస్తువులపై 19శాతం పన్నుల నుంచి అనేక వస్తువులకు మినహాయింపు ఇస్తారు. ఎనభై విమానాలను థారు కొనుగోలు చేస్తుంది.
డోనాల్డ్ ట్రంప్ కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ ప్లస్ 3 (ఏపిటి) సమావేశాలకు, తరువాత దక్షిణ కొరియాలో జరిగే మరోసభలో పాల్గ్గొనేందుకు వస్తూ అనేక దేశాలతో విలువైన లోహాలు, ఇతర ఒప్పందాలు కుదుర్చు కొనేందుకు వచ్చాడు. పది ఆగేయాసియా దేశాలతో కూడిన ఆసియన్ కూటమిలో తాజాగా తైమూర్-లెస్తే చేరింది. ఇవిగాక చైనా, జపాన్, దక్షిణ కొరియా అనుబంధంగా ఉన్న కారణంగా ఆసియన్ ప్లస్ మూడు అని పిలుస్తున్నారు. ధనిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల నుంచి తట్టుకోవాలంటే ఈ కూటమి దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని చైనా ప్రధాని లీ క్వియాంగ్ కోరాడు.
గత కొద్ది సంవత్సరాలుగా తూర్పు ఆసియా వేగంగా వృద్ధి చెందుతున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ సమావేశాలకు తమ మంత్రిద్వారా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభూ సుబియాంతో ఒక సందేశం పంపాడు. ఆర్‌సిఇపితో సమన్వయం చేసుకొని దాన్నొక వేదికగా ఆసియన్ దేశాలు వినియోగించుకోవాలని కోరాడు.ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న దేశాలను ఐక్యంగా ఎదుర్కొవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేయి మయుంగ్ కోరాడు. రక్షణాత్మక చర్యలతో పాటు సరఫరా గొలుసుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు, సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు ఆసియన్ దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయని, వాటిని చూసి నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండరాదని మలేసియా ప్రధాని అన్వర్ చెప్పాడు. ఇప్పుడున్న భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ కొత్త భాగస్వామ్యాల కోసం ధైర్యంగా వ్యవహరించాలన్నాడు. వర్తమాన సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలంలో చైనా, ఆసియన్ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు 782 బిలియన్ డాలర్ల మేర జరిగాయి.
అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.6శాతం ఎక్కువ. కౌలాలంపూర్ సమావేశంలో చైనా-ఆసియన్ దేశాల స్వేచ్చావాణిజ్య ప్రాంతం 3.0 ఒప్పందం కుదిరింది. ‘అమెరికా పన్నులకు అందరం బాధితులమే అని, దాని రక్షణాత్మక వైఖరిని వ్యతిరేకించాలని’ ఆసియన్ దేశాలన్నింటా సమన్వయం కనిపించింది. అయితే వివిధ కారణాలతో అనేక దేశాలు అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ ఒక్కటిగా ఉండకపోతే నష్టమనే భావన ఏర్పడింది. గతేడాది లావోస్‌లో జరిగిన 27వ సమావేశం పెరుగుతున్న ప్రాంతీయ సహకారం గురించి చర్చించింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కౌలాలంపూర్ సమావేశం దృష్టి సారించింది, ఇది అనివార్యమైన పరిణామం. అన్ని దేశాల మీద ట్రంప్ పన్నుల దాడి మొదలు పెట్టిన పూర్వరంగంలో దానికి గురయ్యే దేశాలకు ఇంతకు మించి మరొక మార్గం లేదు.
ఈ కూటమి లేదా వ్యవస్థ 1997లో ఉనికిలోకి వచ్చింది. ఆసియన్ కూటమిలో బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థారులాండ్, వియత్నాం సభ్యులుగా ఉండగా పదకొండవ దేశంగా తైమూర్-లెస్తే చేరింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా దక్షిణ కొరియాలో జరిగే ఆసియా -పసిఫిక్ ఆర్థిక వేదిక (ఎపిఇసి) సమావేశాల మీద ఉంది. అక్కడ 30వ తేదీన చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నాడు. విలువైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధించిన తర్వాత కొద్ది రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. తుది ఒప్పందం మీద ఇరు దేశాల నేతలు సంతకాలు చేయవచ్చని చెబుతున్నారు. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ అన్‌కు అంగీకారమైతే తాను అతనితో కూడా భేటీ అవుతానని విలేకర్ల ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చాడు. అయితే అది జరిగేందుకు ఆస్కారం లేదనే చెప్పవచ్చు!
ఎం కోటేశ్వరరావు
8331013288



