Friday, February 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్‌ బడా(యి) మాటలు!

ట్రంప్‌ బడా(యి) మాటలు!

- Advertisement -

అతిశయోక్తులు, అబద్దాలకు నిలువెత్తు ప్రతీక డోనాల్డ్‌ ట్రంప్‌. అతగాడి మీద వ్యక్తిగత కక్షతోనే, మరో కారణంగానో ఇలా చెప్పటం లేదు. మంగళవారం రాత్రి (మనకు బుధవారం) అమెరికా పార్లమెంటును ఉద్దేశించి నూతన సంవత్సర సందర్భంగా (ఏడాది ప్రారంభంలో మన రాష్ట్రపతి, గవర్నర్లు చేసే మాదిరి) చేసిన ప్రసంగంలో ప్రవచించిన అంశాలు అందుకు ఆస్కారమిచ్చాయి. రెండవసారి అధికారానికి వచ్చిన ట్రంప్‌ తొలి ఏడాది పాలనాతీరును మూడింట రెండొంతుల మంది ఆమోదించటం లేదని ఒక వైపు సర్వేలు చెబుతుండగా వాటిని పూర్వపక్షం చేస్తూ తన పాలన అదరహో అన్నట్లు ఉందని ట్రంప్‌ గొప్పలు చెప్పుకున్నాడు. వెనుకటికెవడో ఇంటికి వచ్చిన వారి ముందు తన గొప్ప గురించి చెప్పరా అని సేవకుడికి చెబితె ‘మా దొరగారి తోటలో మిరియాలు కొబ్బరికాయల్లా ఉంటాయి దొరా’ అన్నాడట. మీరు గనుక జోక్యం చేసుకొని ఉండకపోతే భారత్‌-పాక్‌ మధ్య అణుయుద్ధం జరిగి మూడున్నర కోట్ల మంది జనం మరణించి ఉండేవారని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తనతో అన్నట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. తన అవసరం రీత్యా పాక్‌ నేత నిజంగా అలానే అన్నాడేమో అని ఎవరైనా అనుకోవచ్చుగానీ ట్రంప్‌ చెప్పటమే విపరీతం.

మరికొన్నింటిని చూస్తే… అమెరికాలో నేరాల మీద తిరుగులేని విజయం, సరిహద్దుల రక్షణ,గృహనిర్వహణ ఖర్చు తగ్గింపు,ప్రపంచ వేదికలో అమెరికా ప్రతిష్టపెంపు….అంతేనా, అంతా మీరే చేశారన్న బొమ్మరిల్లు డైలాగ్‌ మాదిరి అంతా జోబైడెనే చేశాడంటూ గిడసబారిన ఆర్థిక స్థితిలో సంక్షోభంలో ఉన్న దేశం తనకు వారసత్వంగా వచ్చిందన్నాడు. ఎక్కడ చూసినా నేరాలు, యుద్ధాలు, గందరగోళం ఉన్న స్థితిలో పగ్గాలందుకున్న తాను పరిస్థితిని ఎన్నడూ, ఎవరూ చేయని రీతిలో, గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాను పెద్దది, మెరుగైన, ధనవంతమైనదిగా మరోసారి మార్చాను అన్నాడు. ప్రపంచ చరిత్రలో గొప్పవాటిగా పరిగణించే మిలిటరీ చర్యలో ఒకటిగా వెనెజులా అధ్యక్షుడిని బందీచేశా. అమెరికాను చూసి ఇప్పుడు విరోధులు భయపడుతున్నారని చెప్పుకున్నాడు. గతంలో వియత్నాం నుంచి పారిపోయిన అమెరికన్లు మరోసారి అప్ఘనిస్తాన్‌లో అదే చేశారు. కట్టుబట్టలతో వెళ్లిపోతామంటూ తాలిబాన్‌లతో ప్రాధేయపడి ఒప్పందం చేసుకున్నది ఈ పెద్దమనిషే అన్నది దాస్తే దాగని సత్యం. మరోసారి దాడి చేస్తామని ప్రకటించి యుద్ధనౌకలను మోహరించటాన్ని చూసి నిజంగా భయపడితే రండి తేల్చుకుందాం అని ఇరాన్‌ అనగలదా?

అమెరికాను గొప్పగా చేయటం తరువాత సంగతి, మరోసారి దిగజారుస్తున్నారని అంటున్నట్లు సర్వేలు చెబుతుంటే, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు నమ్మించేందుకు ట్రంప్‌ ఈ ప్రసంగంలో పూనుకున్నాడు. తొలి ఏడాది జీడీపీలో 122శాతంతో 38లక్షల కోట్ల డాలర్లకు చేరిన అమెరికా అప్పు ఈ పెద్దమనిషి రెండవసారి పదవీకాలం పూర్తయ్యే నాటికి 2028లో 48లక్షల కోట్లకు చేరనుందని అంచనాలు వెలువడుతుంటే పటిష్టం చేశానని జనం చెవుల్లో పూలు పెడుతున్నాడు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ సరిగా లేదని 57శాతం, పన్నుల విధింపు సమర్ధనీయం కాదని 64శాతం మంది జనం అభిప్రాయపడుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి పాలనలోనూ జరగని విధంగా ఒక ఏడాది వ్యవధిలో సామాన్య అమెరికన్లు రెండు సార్లు లక్షలాది మంది అతగాడి పాలనా విధానాలకు వ్యతిరేకంగా వీధులకు ఎక్కటాన్ని దాస్తే దాగుతుందా?

గతేడాది కాలంగా చెబుతున్న అబద్దాలనే మరోసారి తాజా ప్రసంగంలో వల్లెవేసిన ట్రంప్‌ గోబెల్స్‌ను అదర్శంగా తీసుకున్నాడు. విదేశాల్లో అమెరికా పౌరులకు భద్రతను పెంచా, పశ్చిమార్ధగోళంలో అమెరికా ఆధిపత్యాన్ని స్థాపించా అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని అధికారానికి వచ్చిన 24గంటల్లోనే నిలిపివేస్తానని ప్రగల్భాలు పలికాడు. అప్పు రేపు అని గోడమీద రాసినట్లుగా అదెప్పుడు పరిష్కారం అవుతుందో, ఎలా చేస్తాడో తెలియటంలేదు గాని యావత్‌లోకం నవ్వితే, ‘ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు’అన్నట్లుగా ఎనిమిది యుద్ధాలను నిలిపివేశా అన్నాడు. అమెరికా చరిత్రలో 108 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసి రికార్డు సృష్టించిన ట్రంప్‌ మన గురించి చెప్పకుండా ఉంటాడా!

అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా వేసినట్లు మనదేశం చెప్పగా, తాను విధించిన పన్నులు చెల్లవని తీర్పు ఇచ్చినప్పటికీ అంతకు ముందు తనతో ఒప్పందాలు చేసుకున్న దేశాలన్నీ వాటికి కట్టుబడి ఉన్నాయన్నాడు. వాటితో తమదేశంలో ఉత్పత్తి రంగంలో 18లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయని ట్రంప్‌ చెప్పాడు. అమెరికాతో చర్చలు వాయిదా అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ జనాన్ని మభ్య పెడుతున్నదా? అన్న అనుమానం కలుగుతోంది. పన్నులను చూపి బెదిరించిన కారణంగా అనేక యుద్ధాలు (ఆపరేషన్‌ సింధూర్‌ గురించి అదే చెప్పాడు) నిలిచినట్లు చెప్పాడు. ఇప్పటికీ మనదేశాన్ని అమెరికా బ్లాక్‌మెయిలు చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే మన దేశం నుంచి ఎగుమతి చేసే సోలార్‌ వస్తువులపై 125.87శాతం దిగుమతి పన్ను విధిస్తున్నట్లు అమెరికా చెప్పింది. ఇలాంటి దేశం గురించి మన నేతలు భ్రమలు పెట్టుకున్నారా? లొంగిపోతారో చూద్దాం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -