Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ మైండ్‌ గేమ్‌

ట్రంప్‌ మైండ్‌ గేమ్‌

- Advertisement -

అమెరికా అధ్యక్షుడి మసాలా డీల్‌తో జాగ్రత్త
యూఎస్‌ వాణిజ్యసంబంధాలపై బీకేర్‌ఫుల్‌…
లేకపోతే భారత్‌కే తీవ్ర నష్టం : ఆర్థిక నిపుణుల హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరస్పర విరుద్ధ చర్యలు, మాటలు ఇటీవల అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌ విషయంలో ఈ తీరు స్పష్టంగా కనబడుతున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ప్రచార కార్యక్రమాల నుంచి భారత్‌పై విధించిన నేటి సుంకాల వరకు ఆయన చేస్తోన్న చర్యలు, చెప్తున్న మాటల్లో ఎలాంటి నిలకడ కానీ, విశ్వసనీయత కానీ కనబడటం లేదు. కేవలం తమ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసమే ఎంతటికైనా తెగించే, దిగజారే ట్రంప్‌ తీరు పట్ల భారత్‌ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా భారత్‌తో వాణిజ్య చర్చలంటూ ఆయన చెప్తున్న మాటల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.

న్యూఢిల్లీ : తాను అధ్యక్షుడినైతే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఆపుతానని తన ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్‌ పలుమార్లు చెప్పారు. ఎట్టకేలకు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైతే అయ్యాడు కానీ.. యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. దీంతో ఏమీ చేయలేక రష్యాపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), నాటో వంటి తన మిత్రదేశాలతో కలిసి ఆంక్షలు విధించారు. అయితే ఇదే సమయంలో రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయటం పట్ల ట్రంప్‌ కన్నెర్ర చేశాడు. భారత్‌పై 50 శాతం అదనపు సుంకాలు విధించాడు. ఇది భారతీయ ఎగుమతిదారులను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం విదితమే. చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశం ట్రంప్‌ స్వరం మారేలా చేసింది. ఎస్‌సీఓ సమ్మిట్‌లో భారత్‌, చైనా, రష్యా అధినేతలు మోడీ, జిన్‌పింగ్‌, పుతిన్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించటంతో ఆయనలో ఆందోళన మొదలైంది.

మోడీ ఓ మంచి మిత్రుడంటూ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పొగడ్తలు చేశారు. భారత్‌తో వాణిజ్య చర్చలు కొనసాగుతాయనీ, ఇందుకు అడ్డంకిగా ఉన్న అంశాలపై ఇరు పక్షాలూ సంప్రదింపులను జరుపుతాయని వివరిం చారు. అయితే అమెరికా అధ్యక్షుడి పోస్టుకు మోడీ కూడా స్పందించారు. భారత్‌-అమెరికా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని పేర్కొన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వాములనీ, ఇరు దేశాల భాగస్వామ్యంలో లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించే ట్రేడ్‌ డీల్‌కు చర్చలు బాటలు వేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో భారత్‌, చైనాలపై వంద శాతం సుంకాలు వేయాలనీ, రష్యాను శిక్షించటానికి ఇదే మార్గమంటూ మరోపక్క ఈయూ దేశాలనూ ట్రంప్‌ ఉసిగొల్పారు. ఒకపక్క భారత్‌తో వాణిజ్య చర్చలంటూనే.. ఈయూ దేశాలను సుంకాలకు పురిగొల్పటం ట్రంప్‌ తీరుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి నిలకడ లేని ఆయన మాటలు, చేష్టల పట్ల భారత్‌ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరించే అమెరికా వైఖరిని భారత్‌ గతంలోనే చూసింది.

అందుకే ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు సైతం భారత్‌కు సూచిస్తున్నారు. ట్రంప్‌ మాటలతో ప్రమాదం ఉంటుందని ఇన్ఫోమెరిక్స్‌ రేటింగ్స్‌లో చీఫ్‌ ఎకనామిస్ట్‌ డాక్టర్‌ మనోరంజన్‌ శర్మ తెలిపారు. ట్రంప్‌ విరుద్ధమైన సంకేతాలు భారత-అమెరికా వాణిజ్య చర్చల అవకాశాన్ని క్లిష్టతరం చేస్తాయని అన్నారు. భారత్‌పై ఇప్పటికే 50 శాతం సుంకాలేసిన ట్రంప్‌.. ఇప్పుడు ఈయూను కూడా వంద శాతం టారిఫ్‌లు విధించాలనటం ఆయన తీరు పట్ల నమ్మకం, విశ్వాసాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ట్రంప్‌ తీరు పట్ల అప్రమత్తంగా ఉండకపోతే భారత్‌ ‘మసాలా డీల్స్‌’ ట్రాప్‌లో పడే ప్రమాదముంటుందని హెచ్చరించారు. మ్యుచువల్లీ అగ్రీడ్‌ సెటిల్‌మెంట్స్‌ అచీవ్డ్‌ త్రూ లెవరేజ్డ్‌ ఆర్మ్‌-ట్విస్టింగ్‌కు సంక్షిప్త నామమే మసాలా. దీనర్థం.. ఇలాంటి ఒప్పందాలు బయటకు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాస్తవానికి మాత్రం అందులో అనేక ఒత్తిళ్లు, నష్టాలు, సమస్యలకు పరిష్కారం దొరకకపోవటం వంటి అనేక ప్రతికూలతలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాకు ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఉంటాయి.

ఫలితంగా ఇలాంటి ఒప్పందాలు భారత ఎగుమతిదారుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తాయని మనోరంజన్‌ శర్మ అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి మసాలా డీల్స్‌ అడ్డుతొలగించుకోవాలంటే మార్కెట్‌లో కీలక రంగాలైన వస్త్ర, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, ఆటోమోటివ్‌ వంటి రంగాలపై భారత్‌ ఒక స్పష్టతను పొందటం ముఖ్యమని ఆయన చెప్పారు. ఇప్పటికే టారిఫ్‌ల పెంపు భారత ఎగుమతులు, జీడీపీ అంచనాలపై ప్రభావాన్ని చూపిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రంప్‌ ప్రలోభాలకు లొంగకుండా టారిఫ్‌లను వెనక్కి తీసుకునేలా, వివాదాలకు పరిష్కారం కనుగోనే యంత్రాంగాలు, బలమైన మార్కెట్‌ అనుమతులు పొందేలా భారత బృందం అమెరికాపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు రెట్టింపు చేయాలనే ‘మిషన్‌ 500’ దార్శనికతను పెంపొందించుకుంటూ.. భారత్‌ కస్టమ్స్‌ వాల్యుయేషన్‌ నియమాలు, దిగుమతి లైసెన్సింగ్‌, వాణిజ్య సంబంధ పెట్టుబడుల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -