1.6 ట్రిలియన్ డాలర్ల ఆదాయలోటు భర్తీకి వ్యూహం
చట్టాల్లోని లొసుగులతో కొత్త టారిఫ్‌ల ఆలోచన
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త సంకాలను విధించేందుకు సిద్ధమవుతున్నారా? సుప్రీంకోర్టు తీర్పుతో తగ్గిన 1.6 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.133 లక్షల కోట్లు) ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా వైట్‌హౌస్ సరికొత్త కార్యాచరణ ను ప్రకటించనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త చట్టపరమైన మార్గాల ద్వారా దిగుమతి సుంకాలను పునరుద్ధరించే ందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ వారం వాషింగ్టన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు అమెరికా వాణిజ్య విధానంలో నూతన మర్పులను సూచిస్తున్నాయి.గతేడాది ట్రంప్ ప్రభుత్వం దేశ ఆర్థిక లోటును పూడ్చేందుకు దిగుమతి సుంకాలను భారీగా పెంచింది.
అయితే, ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ‘అత్యవసర అధికారాల’ కింద విధించిన కొన్ని రకాల దిగుమతి సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. దీని వల్ల ఆ దేశ ప్రభుత్వం ఆశించిన 1.6 ట్రిలియన్ డాలర్ల ఆదాయానికి గండిపడినట్టయింది. ఈ ఆదాయం లేకుండా అమెరికాలోని ప్రజలకు పన్ను తగ్గింపులు కొనసాగించడం చాలా కష్టంతో కూడుకోవడంతో పాటు, దేశ ఆర్థిక లోటును ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ 1974 నాటి వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ ని ప్రయోగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ చట్టం కింద సుంకాలు విధించడం కొంచెం క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, దీనికి చట్టబద్ధత ఉండటం వల్ల ట్రంప్ ఈ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్టు అమెరికా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం ‘సెక్షన్ 301’ ద్వారా సుంకాలను మళ్లీ పెంచవచ్చని అర్బన్- బ్రూకింగ్స్ టాక్స్ పాలసీ సెంటర్ డైరెక్టర్ ఎలెనా పటేల్ అభిప్రాయపడ్డారు. చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాతో సహా 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అమెరికా రెండు అంశాల్లో పరిశీలించనున్నట్టు యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ తెలిపారు. ఆయా దేశాల ప్రభుత్వాలు తమ దేశీయ పరిశ్రమలకు భారీగా ఆర్థిక సబ్సిడీలు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అందువల్ల ఆ ఫ్యాక్టరీలు అవసరానికి మించి వస్తువులు ఉత్పత్తి చేస్తూ, అతి తక్కువ ధరలకు అమెరికాకు ఎగుమతి చేయడం వల్ల, యూఎస్‌లోని తయారీ కంపెనీలు ధరల విషయంలో పోటీపడలేక నష్టపోతున్నాయని, తయారీ రంగం దెబ్బతింటోందని ట్రంప్ అభిప్రాయమని జేమీసన్ గ్రీర్ చెప్పారు.
అలాగే రెండో విషయం ఏంటంటే, కొన్ని దేశాల్లో వెట్టిచాకిరితో తయారవుతున్న వస్తువుల వల్ల అమెరికా కార్మికులకు నష్టం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు అంశాలపై 1974 ట్రేడ్ చట్టం సెక్షన్ 301 కింద అమెరికా అధికారులు విచారణ చేపడుతారు. ఈ చట్టానికి అనుగుణంగా లేని దేశాలపై సుంకాలు పెంచేందుకు ట్రంప్ యంత్రాంగం రెడీ అవుతోంది. ఏప్రిల్ 28, మే 5వ తేదీల్లో విచారణలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టం ట్రంప్ గతేడాది విధించిన అత్యవసర చట్టం కంటే చాలా పటిష్టమైనది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ వేరే చట్టం ఆధారంగా అన్ని దిగుమతులపై విధించిన 10 శాతం పన్ను వాలిడిటీ 150 రోజుల పాటు మాత్రమే కొనసాగుతుంది. ఈ లోపు సెక్షన్ 301 విచారణలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చరిత్రలో తొలిసారిగా
సాధారణంగా ఏ దేశమైనా తమ దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి సుంకాలను తక్కువ స్థాయిలో విధిస్తుంది. కానీ కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికే సుంకాలను అమెరికా వాడుకుంటోందని, చరిత్రలో ఇదే మొదటిసారి అని పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెంట్ స్మెట్టర్స్ అభిప్రాయపడ్డారు.
వినియోగదారులపై ప్రభావం
అధిక సుంకాల ద్వారా విదేశీయులు అమెరికాకు పన్నులు చెల్లిస్తున్నారని ట్రంప్ పదే పదే చెబుతున్నప్పటికీ, వాస్తవం మరోలా ఉందని ఆర్థికవేత్తలు వెల్లడిస్తున్నారు. ట్రంప్ విధించే దిగుమతి సుంకాల భారాన్ని విదేశీ కంపెనీలు భరించవని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలోని దిగుమతిదారులు ఆ అదనపు సుంకాలను ప్రభుత్వానికి చెల్లిస్తారు, తర్వాత ఆ భారాన్ని వస్తువుల ధరలు పెంచడం ద్వారా సామాన్య అమెరికా వినియోగదారులపైకి నెడతారు. దీనివల్ల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



