వాషింగ్టన్: వాణిజ్య భాగస్వాముల పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కలప, కలప ఉత్పత్తులపై సుంకాలు విధించారు. దిగుమతి చేసుకున్న కలప, టింబర్, కిచెన్ కేబినెట్, ఫర్నీచర్ దిగుమతులపై విధించిన సుంకాల కారణంగా భవన నిర్మాణ సామగ్రి, ఇంటీరియల్ డెకరేషన్ ఖర్చులు పెరగబోతున్నాయి. ఇప్పటికే వీటి ధరలు బాగా పెరిగిపోయాయి. భవన నిర్మాణ సామగ్రిలో ఎక్కువగా ఉపయోగించే విదేశీ కలప, టింబర్‌పై పది శాతం టారిఫ్ విధించారు. అలాగే కిచెన్ కేబినెట్లు, వానిటీలు, మృదువుగా ఉండే చెక్క ఫర్నీచర్‌పై పాతిక శాతం టారిఫ్ విధిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ రేట్లు అక్టోబర్ 14వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. తాజాగా విధించిన సుంకాలతో క్యాబినెట్లపై టారిఫ్ 50 శాతానికి, మృదువైన ఫర్నీచర్‌పై 30 శాతానికి పెరుగుతుంది.
నూతన టారిఫ్‌లపై ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. అమెరికాలోని స్థానిక పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు, దేశ భద్రతకు మద్దతు తెలిపేందుకు విదేశీ కలపపై సుంకాలు విధించానని ట్రంప్ ఆ పోస్టులో వివరించారు. తన నిర్ణయాన్ని ఆయన సమర్ధించుకుంటూ దీంతో సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని, పారిశ్రామిక సామర్ధ్యం ఇనుమడిస్తుందని, అత్యంత నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయని, కలప ఉత్పత్తుల దేశీయ వినియోగ సామర్ధ్యం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. తన చర్య దేశీయ వినియోగాన్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుందని, ఎగుమతులు పెరిగి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అయితే అమెరికాలో 300 బిలియన్ల చెట్లు ఉన్నప్పటికీ అవి దేశీయ డిమాండును తీర్చలేవని ఆర్థికవేత్తలు, బిల్డర్లు హెచ్చరిస్తున్నారు. కెనడా నుంచి దిగుమతి అవుతున్న కలపపై సుంకాన్ని పెంచితే సంక్షోభం మరింత తీవ్రమవుతుందని వారు తెలిపారు.
అమెరికాలో గృహ నిర్మాణానికి కలప చాలా అవసరమన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా దేశం వినియోగిస్తున్న కలపలో 30 శాతం కెనడా నుంచే దిగుమతి అవుతోంది. అయితే అక్కడి నుంచి జరిగే కలప దిగుమతులపై ఇప్పటికే 14.5 శాతం డంపింగ్ నిరోధక సుంకాలు విధిస్తున్నారు. ట్రంప్ విధిస్తున్న వివిధ రకాల సుంకాల కారణంగా గత సంవత్సర కాలంలో ఫర్నీచర్ ధరలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టు నాటికి ఫర్నీచర్ ధరలు 4.7 శాతం పెరిగాయి. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఫర్నీచర్ ధరలు అయితే 9.5 శాతం పెరిగాయి. కెనడాతో పాటు వియత్నాం నుంచి కూడా అమెరికాకు కలప సరఫరా అవుతోంది. వియత్నాం నుంచి జరుగుతున్న దిగుమతులపై కూడా ట్రంప్ సుంకాలు పెంచేశారు.
కొనసాగుతున్న ట్రంప్ టారిఫ్ యుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES