విమర్శలకు తలొగ్గిన అమెరికా న్యాయ శాఖ
వాషింగ్టన్ : లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ దర్యాప్తు ఫైల్స్ నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ ఫొటో అదృశ్యమైన ఉదంతంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో న్యాయ శాఖ దిగివచ్చింది. ట్రంప్ ఫొటోతో కూడిన చిత్రాన్ని ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తిరిగి చేర్చడం జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఈ చిత్రం కారణంగా ఎప్‌స్టీన్ బాధితులను బయటపెట్టే ప్రమాదం ఏదీ లేదని నిర్ధారించుకున్నందున దానిని తిరిగి పోస్ట్ చేశామని న్యాయ శాఖ ఆదివారం తెలిపింది. ఇంతకీ ఆ ఫొటోలో ఒక బల్ల కన్పించింది. దాని సొరుగు తెరిచి ఉంది. అందులో పలువురు మహిళలతో ట్రంప్ ఉన్న ఫొటో ఉంది. ముందు జాగ్రత్తగా జరిపిన సమీక్షలో భాగంగా దానిని ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి తొలగించారు.
‘ఎప్‌స్టీన్ బాధితులెవ్వరూ ఆ ఫొటోలో లేరని నిర్ధారణ అయింది. అందుకే దానిలో ఎలాంటి మార్పు చేయకుండా తిరిగి పోస్ట్ చేశాం’ అని న్యాయ శాఖ తెలిపింది. కాగా ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి దేశాధ్యక్షుడి ఫొటోను తొలగించాలని తీసుకున్న నిర్ణయంతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అటా ర్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ అంతకుముందు చెప్పారు. ఫొటోలో క న్పించిన మహిళ గురించే ఆలోచించాము తప్ప ట్రంప్ గురించి కాదని వివరణ ఇచ్చారు. ఫొటోను తొలగించిన సమయంలో అధికారులకు పూర్తి సమాచారం అందలేదని, అందుకే దానిని తాత్కాలికంగా తీసేశారని చెప్పుకొచ్చారు.



