Friday, March 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ అడ్డదారి

ట్రంప్‌ అడ్డదారి

- Advertisement -

వాణిజ్య భాగస్వామ్య దేశాలు టార్గెట్‌
‘సెక్షన్‌ 301’ను ప్రయోగించేందుకు సిద్ధం
జాబితాలో భారత్‌, చైనా సహా 16 దేశాలు
సుంకాలు, ఆంక్షల విధింపునకు ట్రంప్‌ మరో మార్గం!
ఇప్పటికే టారిఫ్‌లకు వ్యతిరేకంగా యూఎస్‌ సుప్రీంకోర్టు తీర్పు


వాషింగ్టన్‌ : టారిఫ్‌లకు వ్యతిరేకంగా యూఎస్‌ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొత్త దారులు వెతుకుతున్నారు. పలు దేశాలపై మళ్లీ సుంకాల బాదుడు, ఆంక్షల విధింపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన 16 కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఉన్నాయి. తాజా చర్యల్లో భాగంగా ట్రంప్‌ యంత్రాంగం ఈ దేశాలపై వాణిజ్య చట్టం 1974లోని ‘సెక్షన్‌ 301’ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. టారిఫ్‌లు చట్టవిరుద్ధమని గతనెల యూఎస్‌ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరుణంలో ట్రంప్‌ యంత్రాంగం ఇలాంటి నిర్ణయంతో ముందుకు రావడం గమనార్హం. దీంతో ఆయా దేశాలపై టారిఫ్‌ల ఒత్తిడిని పునరద్ధరించేందుకు చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాల దర్యాప్తులను ట్రంప్‌ యంత్రాంగం ప్రారంభించిందని వాణిజ్య విశ్లేషకులు చెప్తున్నారు.

సెక్షన్‌ 301 వాణిజ్య భాగస్వాములపై సుంకాలు లేదా ఇతర ప్రతీకార చర్యలను చేపట్టే అధికారం యూఎస్‌ వాణిజ్య ప్రతినిధికి ఇస్తుంది. ఇతర దేశాలు అనుసరిస్తున్న చట్టవిరుద్దమైన వాణిజ్య విధానాలను సవాలు చేయడమే ఈ సెక్షన్‌ 301 లక్ష్యం. తమ వాణిజ్యభాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్‌ పాలసీలు తమ వ్యాపారాలు, ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అనే దానిపై ఈ సెక్షన్‌ కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు కల్పిస్తుంది. అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ అనంతరం తమకు నష్టం కలిగిస్తున్నాయంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) అనుమతి లేకుండానే ఆయా దేశాలపపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు అమెరికాకు అవకాశం కలుగుతుంది.

భారత్‌ సహా పలు దేశాలపై కొత్త సుంకాలు!
ఈ వేసవినాటికి యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, మెక్సికోలపై కొత్త సుంకాలను విధించే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌ వివరించారు. అదనపు సామర్థ్య దర్యాప్తునకు లోబడి ఉన్న ఇతర వాణిజ్య భాగస్వాములలో తైవాన్‌, వియత్నాం, థాయిలాండ్‌, మలేషియా, కంబోడియా, సింగపూర్‌, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, స్విట్జర్లాండ్‌, నార్వేలు ఉన్నాయి. అయితే ఈ వాణిజ్య దర్యాప్తు కింద అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం కెనడా పేరును సూచించలేదు. ఈ దర్యాప్తులు తయారీ రంగాల్లో నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం, ఉత్పత్తి ఆధారాలు ఉన్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టిసారిస్తాయని గ్రీర్‌.. కాన్ఫరెన్స్‌ కాల్‌లో మీడియాకు వెల్లడించారు.

ఇతర దేశాల పైనా ఈ సెక్షన్‌తో దాడి
బలవంతపు శ్రమతో ఉత్పత్తి చేయబడిన వస్తువుల దిగుమతులను నిషేధించడానికి సెక్షన్‌ 301 కింద మరో దర్యాప్తును ప్రారంభించనున్నట్టు గ్రీర్‌ తెలిపారు. ఈ దర్యాప్తు 60 కంటే ఎక్కువ దేశాలకు వర్తిస్తుందని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేసిన ఉయ్ఘర్‌ ఫోర్స్‌ లేబర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద చైనా నుంచి సోలార్‌ ప్యానెల్‌ దిగుమతులు, ఇతర వస్తువులపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ సెక్షన్‌ కింద ఈ చర్యలను ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -