Wednesday, July 16, 2025
E-PAPER
Homeజాతీయంభారత రైతులపై ట్రంప్‌ కత్తి

భారత రైతులపై ట్రంప్‌ కత్తి

- Advertisement -

– జీఎం విత్తనాలు అనుమతించాలని ఒత్తిడి
– టారిఫ్‌ చర్చల్లో ప్రధాన డిమాండ్‌
– మోడీ తలొగ్గితే తీవ్ర నష్టం
– దేశ వ్యవసాయ రంగానికి పెనుప్రమాదం
– నేటి నుంచి సంప్రదింపులు ప్రారంభం

చిట్యాల మధుకర్‌
రైతులపై తీవ్ర ఆర్థిక భారం..
జీఎం విత్తనాలు బేయర్‌, కోర్టెవా లాంటి అమెరికా బహుళజాతి కంపెనీల పేటెంట్‌ల కింద ఉంటాయి. ఈ కంపెనీలే విత్తన ధరను నిర్ణయిస్తాయి. కాలక్రమేణా భారత విత్తన రంగంపై వీటి గుత్తాధిపత్యం పెరగనుంది. అమెరికాలో 2000-2015 మధ్య విత్తన ధరలను ఏకంగా 700 శాతం పెంచాయి. ఇలాంటి చర్యలు భారత్‌లో చిన్న, సన్నకారు రైతుల నడ్డి విరుస్తాయి. ప్రతీ సీజన్‌లో కొత్త విత్తనాలు కొన వలసి ఉంటుంది. దీంతో రైతులపై భారం పడనుంది. సేంద్రీయ ఎగుమతులు పతనమవు తాయి. వ్యవసాయ రంగం తీవ్ర భారం కానుంది. దీనికి ఉదాహరణ బీటీ పత్తి విత్తనాలే. రైతులు ఖరీదైన పత్తి విత్తనాలు, పురుగుమందుల కోసం అప్పులు చేసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్న ఘటనలను ఇప్పటికే చూస్తున్నాము.


భూమి, నీరు విషతుల్యం
జీఎం పంటలు ఎక్కువ రసాయనాల (హెర్బిసైడ్‌లు) వాడకాన్ని కలిగి ఉంటాయి. అమెరికాలో గ్లైఫోసేట్‌ వాడకం 28 శాతం పెరిగి మట్టి ఫలదీకరణ శక్తి భారీగా తగ్గిపోయింది. జీఎం పంటల జన్యు కాలుష్యం వల్ల స్థానిక పంటలు దెబ్బతింటాయి. అమెరికాలో హెర్బిసైడ్‌లను తట్టుకునే కలుపు మొక్కలు (సూపర్‌వీడ్స్‌) ఏర్పడ్డాయి. దీనివల్ల రైతులు మరింత విషపూరిత రసాయనాలను ఉప యోగించాల్సి వస్తుంది. జీఎం పంటలతో వచ్చే రసాయన వాడకం రైతుల ఆరోగ్యాన్ని, మట్టిని, నీటిని విషతుల్యం చేయనున్నాయి. ఇది భవిష్యత్‌ తరాలకు హాని కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రజారోగ్యానికి దెబ్బ..
జీఎం ఆహార పంటలు భారత ఆహారంలోకి ప్రవేశిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు చూపనున్నాయి. అమెరికాలో గ్లైఫోసేట్‌ వంటి రసాయనాలు క్యాన్సర్‌తో ముడిపడి ఉన్నాయని పలు అధ్యయనాలు గగ్గోలు పెట్టాయి. ఈ పంటల కోసం ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చర్మ వ్యాధులు, శ్వాసకోస సమస్యలు పెరుగుతాయి. క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, వంధ్యత్వం వంటి సమస్యలకు దారితీయవచ్చు. స్థూలంగా ప్రజారోగ్యం దెబ్బ తిననుంది. జన్యు కాలుష్యం సేంద్రీయ పంటలను కలుషితం చేస్తుందని అమెరికా అనుభవాలే చెబుతున్నాయి.


అమెరికా ప్రధాన డిమాండ్లు..
– భారత్‌లో జీఎం విత్తనాలు, పంటలను అనుమతించాలి.
– యూఎస్‌ ఆటోమొబైల్‌, స్టీల్‌ రంగాలపై టారిఫ్‌లను తగ్గించాలి.
– ఔషధ రంగంలో నియంత్రణలను సరళీకరించాలి.
– వాణిజ్య ఒప్పందాలను త్వరగా ఖరారు చేయాలి.
– భారత్‌ సహా బ్రిక్స్‌ దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధింపు.
– అమెరికా ఇతర ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలి.


భారత వ్యవసాయ రంగం ప్రమాదంలో పడుతోంది. మన రైతులపై అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి వేలాడుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న టారిఫ్‌ చర్చల నేపథ్యంలో జన్యుమార్పిడి(జెనిటిక్‌ మాడిఫైడ్‌ (జీఎం)) విత్తనాలను భారత్‌లోకి అనుమతించాలని అమెరికా తీవ్ర ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయం సహా ఫార్మాస్యూటికల్‌, ఆటోమొబైల్స్‌, స్టీల్‌ రంగాల సుంకాలపై ప్రధాన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో జీఎం విత్తనాలపైనే తీవ్ర చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భారత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడితే ఇక్కడి వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. మొక్కజొన్న, సోయాబీన్‌ జీఎం విత్తనాలను అనుమతించాలని అమెరికా పట్టుబడు తోంది. భారత్‌లో పత్తి మినహా ఈ తరహా పంటలకు ఇప్పటి వరకు అనుమతి లేదు. ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, పోలాండ్‌, హంగరీ, భూటాన్‌, టర్కీ, సౌదీ అరేబియా, అనేక యూరప్‌ దేశాలు జీఎం పంటల సాగు, దిగుమతులను నిషేధించాయి. భారత్‌లో జీఎం పంట లను నియంత్రించే జన్యు ఇంజనీరింగ్‌ మూల్యాంకన కమిటీ (జీఈఏసీ) కఠిన పరీక్షలను అనుసరిస్తుంది. అమెరికా ఒత్తిడి వల్ల ఈ నియంత్రణలు సడలిస్తే ఆహార భద్రత, పర్యావరణ రక్షణకు ప్రమాదం ఏర్పడనుంది.


వాషింగ్టన్‌కు భారత బృందం
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం భారత వాణిజ్య మంత్వ్రి శాఖ బృందం సోమవారం వాషింగ్టన్‌ చేరుకుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల గడువు ఆగస్టు 1 సమీపిస్తోండటంతో టారిఫ్‌లపై స్పష్టత కోసం నాలుగు రోజుల పాటు ఈ సంప్రదింపులు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, సుంకాలు, వాణిజ్య అడ్డంకులపై చర్చించడం ఈ సమావేశాల లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.


ప్రమాదంలో సాంప్రదాయ వ్యవసాయం
అమెరికా జీఎం పంటలతో మట్టి, జీవవైవిధ్యం దెబ్బతిననుంది. పురుగుమందుల ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధులపై ఆందోళనలు ఉన్నాయి. యూఎస్‌ పేటెంట్‌లతో రైతులు తమ స్వేచ్ఛను కోల్పోనున్నారు. భారత సాంప్రదాయ వ్యవసాయం ప్రమాదంలో పడనుంది. సేంద్రీయ వ్యవసాయం పూర్తిగా దెబ్బతిననుంది. భారత్‌లోని మొక్కజొన్న, సోయాబీన్‌ వంటి సంప్రదాయ పంటలు పూర్తిగా కనుమరుగవుతాయి. జీఎం పంటలు యూఎస్‌ కంపెనీలపై ఆధారపడేలా చేస్తాయి. దీనివల్ల రైతుల స్థానిక విత్తనాలు, సేంద్రీయ పద్ధతులు లాంటి సంప్రదాయ వ్యవసాయ జ్ఞానం క్రమంగా కనుమరుగవుతుంది. వీటి వల్ల ఇప్పటికే అమెరికాలో రైతులు సాంప్రదాయ నైపుణ్యాలను కోల్పోయారు. ఇది భారతీయ రైతులకూ జరిగే ప్రమాదం ఉంది. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానిక విత్తనాలను భద్రపరచడం, సేంద్రీయ వ్యవసాయం కనుమరుగు కావడంతో తీవ్ర దుష్ఫరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


క్రమంగా అమెరికాకు దాసోహం..
జీఎం విత్తనాలు పేటెంట్‌ల ద్వారా అమెరికా కంపెనీల ఆధీనంలో ఉంటాయి. ఇవి భారత రైతుల నుంచి విత్తన ధరలు, రాయల్టీల ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తాయి. క్రమంగా భారత వ్యవసాయ రంగంపై అమెరికా ఆధిపత్యం పెరుగుతుంది. ఈ బయోఫైరసీ పంటలు అమెరికా కంపెనీలకు లాభం చేకూర్చి, రైతులను దోపిడీ చేస్తాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది 2024లో భారత్‌కు అమెరికా 1.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.13వేల కోట్లు) విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ ఎగుమతులను బహుళ రెట్లు పెంచుకోవడానికి వీలుగా జీఎం విత్తనాలను అనుమతించాలని పట్టుబడుతోంది. అమెరికా ఒత్తిడి వల్ల జీఎం విత్తనాలకు అనుమతులిస్తే భారత ఆహార భద్రత, పర్యావరణ రక్షణకు ప్రమా దం ఏర్పడటంతో పాటుగా భారత వాణిజ్య లోటు అమాంతం పెరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -