Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిట్రంప్‌ సుంకాల ఉగ్రవాదం- గుణపాఠాలు

ట్రంప్‌ సుంకాల ఉగ్రవాదం- గుణపాఠాలు

- Advertisement -

తన దేశీయ ఉత్పత్తిదారులను విదేశాల నుండి దిగుమతయ్యే సరుకుల తాకిడి నుండి కాపాడుకునే ఉద్దేశంతో ఏ దేశమైనా దిగుమతి సుంకాలను విధిస్తుందని మనకి ఆర్థికశాస్త్రం పాఠ్యపుస్తకాలు చెప్తాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల వెనుక అంతకన్నా పెద్ద లక్ష్యమే ఉంది. ఇతర దేశాలు తన చిత్తానికి లొంగి పడివుండేట్టు చేయడానికి అది ఒక సైనిక జోక్యం వంటి చర్య. లేదా అంతర్గత సైనిక తిరుగుబాటును ప్రోత్సహించే చర్య వంటిది. లేదా ఒక ఉగ్రవాద దాడి లాంటిది. ఉదాహరణకు, ఇప్పుడు భారతీయ దుస్తుల మీద 50 శాతం అదనపు సుంకాన్ని విధించడం అక్కడ అమెరికాలో ఉన్న వస్త్ర ఉత్పత్తిదారులను (అటువంటి వారెవరూ లేరక్కడ) రక్షించుకోవడం కోసం కాదు. కేవలం భారతదేశం ట్రంప్‌ చెప్పినట్టు పడి వుండేలా చేయడానికే.
అందువల్లే ట్రంప్‌ ప్రకటించిన సుంకాల పెంపులో అన్ని అవకతవకలు కనిపిస్తున్నాయి. ఇండియా మీద ట్రంప్‌ 50 శాతం సుంకాన్ని అదనంగా విధించడం అనేది మనం రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందువల్ల అని అంటున్నాడు. కాని మనకన్నా రష్యా నుండి ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశం చైనా. కాని ఆ చైనా మీద సుంకాల పెంపు 50 శాతం కన్నా తక్కువగానే ఉంది. ఏమిటి ఈ తేడాకి కారణం? ఇండియా మీద పెత్తనం చేయడం తేలిక అని, చైనాతో వ్యవహారం అంత తేలిక కాదని ట్రంప్‌ భావిస్తున్నాడు. అమెరికన్‌ ప్రయోజనాలను దెబ్బ తీసేలా చైనా ప్రతీకార చర్యలకు పూనుకోగలదు. ఉదాహరణకు చైనా తలుచుకుంటే, అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులను వెంటనే నిలిపివేయగలదు. ఇంతవరకూ అటువంటి ప్రతీకార చర్యల గురించి మన దేశం మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. కాని మనతోబాటు 50 శాతం సుంకాల పెంపును ఎదుర్కొంటున్న బ్రెజిల్‌ మాత్రం అమెరికా మీద ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది.
బ్రెజిల్‌ సరుకుల మీద 50 శాతం సుంకాన్ని విధించడానికి ట్రంప్‌ చూపుతున్న కారణం మరీ వికారం తెప్పించేదిగా ఉంది. గతంలో బ్రెజిల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన నయా ఫాసిస్టు జైర్‌ బోల్సనారో ఈ మారు ఎన్నికల్లో ఓడిపోయాడు. అతడి అధికార దుర్వినియోగం మీద ఇప్పటి ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. కాని బోల్సనారోను సగౌరవంగా, ఏ విచారణా లేకుండా విడిచిపెట్టేయాలని ట్రంప్‌ కోరుతున్నాడు. ఇది మరో దేశపు న్యాయ వ్యవస్థ పనితీరులో అవాంఛనీయమైన తీరులో జోక్యం చేసుకోవడమే. కాని ఆ కారణం వల్లే తాను 50 శాతం సుంకాన్ని అదనంగా బ్రెజిల్‌ మీద విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించాడు. ఐతే ట్రంప్‌ పొగరుమోతుతనానికి ఇదొక్కటే కారణం కాదు. కేవలం బ్రెజిల్‌ మీద, ఇండియా మీద మాత్రమే 50 శాతం సుంకాన్ని అదనంగా విధించడం వెనుక మరో ప్రధాన కారణం ఉంది. అమెరికన్‌ సామ్రాజ్యవాదపు పెత్తనానికి వ్యతిరేకంగా మూడవ ప్రపంచ దేశాలు ఐక్యం కాకుండా చూసేందుకే ఆ మూడవ ప్రపంచ దేశాలలో రెండు అతి పెద్ద దేశాలైన బ్రెజిల్‌, ఇండియా లను ట్రంప్‌ భయపెట్టడానికి తయారయ్యాడు.

ఇలా సుంకాల విధింపును ఒక ఆయుధంగా ఉపయోగించడం అనేది సామ్రాజ్యవాదపు వినూత్నమైన ఎత్తుగడ. వలస పాలన నుండి బైట పడ్డ తర్వాత మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు తమ తమ ఆర్థిక వ్యవస్థలను ప్రభుత్వ నియంత్రణ లో నిర్వహించాయి. స్వావలంబనను బలపరచడం, దేశీయ మార్కెట్‌ను విస్తరించడం, దేశీయ ఉత్పత్తి సామర్ధ్యాన్ని, సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వ రంగాన్ని ప్రధానంగా పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాయి. ఈ ఆర్థిక వ్యూహాన్ని సామ్రాజ్యవాదం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ ఆ వ్యూహాన్ని దెబ్బ తీయడానికి నిరంతరాయంగా పోరాడుతూనే వుంది. ఆ పోరాటంలో భాగంగా సాగించిన సైద్ధాంతిక ప్రచారం ‘తూర్పు ఆసియా పులుల’ పురోగతి గురించి హోరెత్తించింది. తూర్పు ఆసియాలోని హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, తైవాన్‌, దక్షిణ కొరియా దేశాలు నాలుగూ బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించాయని సామ్రాజ్యవాదులు వాటిని ఆకాశానికెత్తారు. ఆ దేశాల పురోగతిని చూపించి తక్కిన మూడవ ప్రపంచ దేశాలన్నీ తమ ‘ముడుచుకు పోయే’ విధానాలకి స్వస్తి చెప్పి ఆసియా పులుల ”చొచ్చుకుపోయే అభివృద్ధి వ్యూహం’ చేపట్టాలని ప్రపంచబ్యాంక్‌ బాగా ప్రచారం చేసింది.
అటువంటి వ్యూహాన్ని గనుక అనుసరిస్తే అన్ని దేశాలూ ఆ నాలుగు దేశాల మాదిరిగానే, అదే జిడిపి వృద్ధిరేటును, అదే ఎగుమతుల వృద్ధిరేటును సాధించగలుగుతాయంటూ జరిగిన ప్రచారంలో ఏ విధమైన నిజాయితీ మేథోపరంగా మనకి కనిపించదు. మొత్తంగా చూసినప్పుడు ప్రపంచ మార్కెట్‌ ఏ రేటున వృద్ధి చెందుతుందో, దానిని బట్టి అన్ని దేశాల ఎగుమతుల వృద్ధిరేటూ ఆధారపడి వుంటుంది. ప్రపంచ మార్కెట్‌ వృద్ధి పరిమితంగా ఉన్నప్పుడు కొన్ని దేశాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించినా, ఆమేరకు తక్కిన దేశాల ఎగుమతులు తగ్గిపోతాయి. కాని ఈ వాదనను సామ్రాజ్యవాద పండితులు కొట్టిపారేశారు. ప్రపంచ మార్కెట్‌తో పోల్చినప్పుడు ప్రతీ మూడవ ప్రపంచ దేశమూ ఆసియా పులుల మాదిరిగానే చిన్న దేశమేనని, తాను ఎంత సాధ్యపడితే అంత ఎగుమతి చేసుకోగలుగుతుందని వారు దబాయించారు.
ఈ వాద ప్రతివాదాలు మొదట్లో సామ్రాజ్యవాదులకు అనుకూలంగా పరిణమించాయి. దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది చైనా ఎగుమతుల్లో సాధించిన పురోగతి. వాస్తవానికి చైనా పూర్తిగా విభిన్నమైన సామాజిక-ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ, తనదైన ప్రత్యేకమైన అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. కాని ఆ సంగతిని పక్కనబెట్టి, చైనా కూడా తాము చెప్పిన ‘చొచ్చుకుపోయే అభివృద్ధి వ్యూహం’ తోటే విజయాలు సాధిస్తోందని సామ్రాజ్యవాదులు ప్రచారం చేసుకున్నారు. ఇక రెండవ కారణం: సామ్రాజ్యవాద దేశాలు తమ దేశాల్లోని పారిశ్రామిక కార్యకలాపాలను మూడవ ప్రపంచ దేశాలలోకి తరలించడానికి సిద్ధం కావడం. ఆ విధంగా తరలించడం వలన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు, వెనుకబడిన దేశాలకు నడుమ ఉన్న అగాధం పూడుకు పోతుందని సామ్రాజ్యవాదం ప్రచారం చేసుకుంది. అంటే, తమ దేశాల నుండి పరిశ్రమలు బైటకు తరలిపోయిన ఫలితంగా ఆ సామ్రాజ్యవాద దేశాల్లో నిరుద్యోగం పెరుగుతూన్నా పట్టించుకోకుండా సామ్రాజ్యవాదులు చేతులు ముడుచుకుని కూర్చుంటారు అని మనమంతా భావించాలన్నమాట!

ఐతే ఎన్ని వాదనలు జరిగినా. అవన్నీ అంతిమంగా ప్రభుత్వాలు తమ దేశాల ఆర్థిక వ్యవస్థలను నియంత్రించకుండా విడిచిపెట్టాలన్న విధానానికి అనుకూలంగా మొగ్గు చూపాయి. ఆ మూడవ ప్రపంచ దేశాలలోని పాలక బడా బూర్జువా వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి పూనుకోవడమే ఈ మొగ్గు వెనుక ఉన్న భౌతిక కారణం. తాము ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు భావించాయి. దానితోబాటు తమ బిడ్డలు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు తరలిపోయి అక్కడ స్థిరపడడం మొదలుపెట్టడంతో పట్టణాల్లోని ఉన్నత మధ్య తరగతి ప్రజలు కూడా ఈ వ్యూహానికి అనుకూలతను ప్రదర్శించారు. తమ ప్రయోజనాలు సంపన్న పెట్టుబడిదారీ దేశాలతో ఎక్కువగా ముడిపడి వున్నాయని, దేశీయంగా ఉన్న రైతాంగంతోగాని, కార్మికులతోగాని తమకేమీ పని లేదని ఈ ఉన్నత మధ్య తరగతి ప్రజలు భావించసాగారు. ఈ లోపు చమురు రంగంలో హఠాత్తుగా ధరలు పెరిగి, దాని ఫలితంగా విదేశీ వ్యాపార చెల్లించపుల లోటు పెరిగి మూడవ ప్రపంచ దేశాల్లో సంక్షోభాలు తలెత్తాయి. ఈ సంక్షోభాలను ఉపయోగించుకుని ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ అనేక మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో కీలక స్థానాల్లో తమ మనుషులు నియమితులయ్యేలా చూసుకున్నాయి. ముందు ఆఫ్రికన్‌ దేశాలతో మొదలుపెట్టి తర్వాత తక్కిన దేశాలలోనూ ఈ పథకాన్ని అమలు చేశాయి. ఆ విధంగా ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఆర్థిక వ్యవస్థలను లోపలి నుంచే దెబ్బ తీయసాగాయి. ఇండియా వరకు ఈ పథకానికి లోబడకుండా వుండేందుకు చాలాకాలం పాటు ప్రయత్నించింది. కాని చివరికి 1991లో ఇండియా కూడా ఆ పథకానికే లోబడిపోయింది.
ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇక్కడ వివరించడానికి ఇది సందర్భం కాదు. కాని ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ చెప్పాలి. సంపన్న దేశాల మార్కెట్లమీద ఆధారపడేలా మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక విధానాలను ప్రభావితం చేసి, ”అందరికీ ఒకేలా వర్తించే నియమావళి” ఆధారంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నడవాలంటూ చాలా గొప్ప గొప్ప కబుర్లు చెప్తూ వచ్చారు సామ్రాజ్యవాదులు. కాని ఇప్పుడు తమ ఆదేశాలకు తలొగ్గకపోతే సుంకాలను పెంచుతాం అంటూ మూడవ ప్రపంచ దేశాల చేతులను మెలి తిప్పుతున్నారు. వాళ్ళు చెప్పే ఆదేశాలు అమలైతే దాని పర్యవసానాలు ఇక్కడ కోట్లాదిమంది నిస్సహాయులైన పేద రైతాంగం మీద, కార్మికులమీద, ముఖ్యంగా మహిళా కార్మికుల మీద పడి వాళ్ళ జీవితాలను దుర్భరం చేస్తాయి. వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తాయి. ఇప్పటికే ఇది పత్తి రైతుల విషయంలో మనం చూస్తున్నాం. మోడీ ప్రభుత్వం మన దేశానికి దిగుమతి అవుతున్న పత్తి మీద ఇంతవరకూ ఉన్న 11 శాతం సుంకాన్ని ఇటీవల రద్దు చేసింది. అక్కడ అమెరికాలో రైతులకు భారీగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది. అక్కడి నుంచి వచ్చిపడే పత్తి వలన ఇక్కడ దేశీయ మార్కెట్‌ లో పత్తి రేటు బాగా పడిపోతోంది. రైతుల ఆత్మహత్యలు అనివార్యం అయే పరిస్థితి ఏర్పడింది. అంతేగాక మన వస్త్రాల మీద చాలా భారీగా 50 శాతం సుంకాన్ని విధించింది అమెరికా. దానితో ఇక్కడ గార్మెంట్‌ పరిశ్రమలలో పని చేస్తున్న కోట్లాదిమంది రోడ్డున పడే ప్రమాదం దాపురించింది. ట్రంప్‌ సుంకాల బెదిరింపుల పర్యవసానం ఇదే. గాజాలో సైనిక చర్యల ద్వారా పాలస్తీనా ప్రజలమీద సాగుతున్న ఉగ్రవాద దారుణాలు ఇతర చోట్ల కూడా జరగనున్నాయి. ఐతే అవి సైనిక చర్యల ద్వారా గాక, సుంకాల ఉగ్రవాద చర్యల ద్వారా జరగబోతున్నాయి. అలా కాకూడదంటే మూడవ ప్రపంచ దేశాలు అమెరికా ఆదేశాలకు తలొగ్గి వ్యవహరించాలి. తమ పాలన నుండి విముక్తి పొందిన పూర్వపు వలస దేశాలమీద సామ్రాజ్యవాదులు ఈ సుంకాల ఉగ్రవాద చర్యలతో పగ తీర్చుకుంటున్నారు.

ఈ అనుభవాలనుండి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? ప్రధానంగా దేశీయ మార్కెట్‌ మీద ఆధారపడుతూ, స్వావలంబనను అన్నివేళలా బలపరుచుకుంటూ, ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యూహం అమలు చేయడం అనేది వలస పాలన నుండి బైటపడ్డ ప్రతీ దేశానికీ అవశ్యం. ఇండియా కాని, మరికొన్ని మూడవ ప్రపంచ దేశాలు కాని స్వాతంత్య్రం సాధించిన తొలి సంవత్సరాల్లో అనుసరించిన వ్యూహం ఇదే. అదే ”ఎగుమతులతో ప్రపంచ మార్కెట్‌ లోకి విస్తరించే” వ్యూహాన్ని అమలు చేయడానికి పూనుకోవడం అంటే అది మూడవ ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాదుల ఆదేశాలకు తలొగ్గి నడుచుకోవడానికే దారి తీస్తుంది. ఎందుకంటే, ప్రపంచ మార్కెట్‌ అనేది సామ్రాజ్యవాదుల మీద ప్రధానంగా ఆధారపడివుంది.
ఆహార ధాన్యాల విషయంలో మన దేశం సాధించిన స్వావలంబనకు నీళ్ళొదిలి, అమెరికా నుండి వచ్చే ఆహార ధాన్యాలమీద ఆధారపడి బతకవలసిన పరిస్థితిని మోడీ రైతు చట్టాలు తీసుకురాబోయాయి. కాని ఏడాదికి పైగా రైతులు సాగించిన గొప్ప పోరాటం ఈ దారుణం జరగకుండా అడ్డుకోగలిగింది. ఒకవేళ అమెరికా నుండి వచ్చే ఆహార ధాన్యాలమీద ఆధారపడ వలసిన పరిస్థితే గనుక ఏర్పడి వుంటే, మన దేశం మీద అమెరికా తన పెత్తనాన్ని మరింత ధాటిగా కొనసాగించేందుకు వీలు కలిగివుండేది.
అందుచేత ఇండియా వంటి దేశం తన అభివృద్ధి వ్యూహాన్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దీని అర్ధం మళ్ళీ పాత విధానాలకు వెనక్కి మళ్ళడం అని అనుకోరాదు. ఆర్థిక వ్యవస్థమీద ప్రభుత్వ నియంత్రణ పాత కాలంలో లాగే ఇప్పుడు కూడా అవసరమే. ఐతే ఆర్థిక వ్యూహం మాత్రం ప్రధానంగా దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అంటే వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయాలి (ఇది జరగాలంటే భూ సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి). శ్రామిక ప్రజల ఆదాయాలు పెరిగేలా ఆదాయాల అసమానతలను తగ్గించాలి. ప్రభుత్వం సంక్షేమ చర్యలకోసం కేటాయింపులు బాగా పెంచాలి.

ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆగస్టు 15న ప్రకటించిన జిఎస్‌టి రాయితీలు ఈ కోవకే చెందుతాయి కదా అని కొందరు అనుకోవచ్చు. కాని అది పూర్తిగా అర్ధం లేనిది. జిఎస్‌టి లో ప్రకటించిన రాయితీలు శ్రామిక ప్రజానీకానికి ఊరట కలిగించేవేమీ కాదు. పైగా ఈ రాయితీల కారణంగా ప్రభుత్వానికి తగ్గే ఆదాయాన్ని భర్తీ చేసుకోడానికి మోడీ సంపన్నుల మీద ఎటువంటి అదనపు పన్నులనూ ప్రతిపాదించలేదు (రెండు వారాల క్రితం నేను రాసిన వ్యాసంలో జిఎస్‌టి రాయితీలు జిడిపిలో 0.1 శాతం మాత్రమే అని పేర్కొన్నాను. కాని అవి 0.6 శాతం అని తేలింది. ఆ రాయితీల కారణంగా ప్రభుత్వం కోల్పోయే ఆదాయం 32,000 కోట్ల రూపాయలు అని పేర్కొన్నాను. కాని అది రూ.1,95,000 కోట్లు అని తేలింది.). ఇప్పుడు కావలసింది ఇటువంటి అతి స్వల్పమైన చర్యలు కావు. ప్రభుత్వం చేపట్టవలసిన ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంలో సంక్షేమ చర్యలకు జిడిపిలో కనీసం 10 శాతం కేటాయించాలి.
దానితోబాటు, ట్రంప్‌ సుంకాల ఫలితంగా ఉపాధి కోల్పోనున్న కార్మికుల కడగండ్లను తీర్చడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలను చేపట్టాలి. సామ్రాజ్యవాదం ఇప్పుడు సుంకాల విధింపునే ఆయుధంగా వాడుతోంది కనుక కేవలం ఎగుమతి సబ్సిడీలు ఇస్తే సరిపోదు. అలా చేస్తే అప్పుడు ట్రంప్‌ సుంకాలను మరింత పెంచుతాడు. ఐనప్పటికీ, ఎగుమతి సబ్సిడీలను పెంచడం గురించి కూడా ఆలోచించవచ్చు. కాని దానితోబాటు వేరే ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం ప్రయత్నించడం అవసరం. అలాగే కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం కూడా పూనుకోవాలి.
ఐతే, ఈ దిశగా మోడీ ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టడం లేదు. పైగా ఏదో విధంగా అమెరికాను సంతృప్తి పరిచేందుకు సిద్ధపడుతోంది. ఎటువంటి సుంకమూ లేకుండా దేశంలోకి నూలు దుస్తులను దిగుమతి చేసుకోడానికి తలుపులు తెరుస్తోంది. దీని ఫలితంగా మన పత్తి రైతులు దారుణంగా నష్టపోతారు. అంతే కాదు, ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని విస్తరించి దారిద్య్రంలో మగ్గుతున్న కోట్లాది మందికి ఊరట కల్పించాల్సి వుండగా దానికి బదులు ఆ పథకానికి కోతలు పెడుతోంది.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad