Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంట్రంప్‌ సుంకాలు స్వయం వినాశకం

ట్రంప్‌ సుంకాలు స్వయం వినాశకం

- Advertisement -

గ్లోబల్‌ స్తబ్దతకు దారి తీస్తాయి
భారత్‌కూ అతిపెద్ద దెబ్బే : ఆర్బీఐ మాజీ గవర్నర్‌ సి రంగరాజన్‌

హైదరాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లు స్వయం వినాశకానికి దారి తీస్తాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ సి రంగరాజన్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇక్ఫారు ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 15వ కాన్వకేషన్‌లో రంగరాజన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ కఠినమైన సుంకాలు, ఆర్థిక విధానాలను విమర్శించారు. యూఎస్‌ విధానాలు ప్రపంచ ఆర్థిక ధోరణులను స్థబ్దతకు గురి చేస్తాయని హెచ్చరించారు. అమెరికాకు కూడా స్వయం వినాశకరమేనని అన్నారు. ట్రంప్‌ ఆర్థిక విధానాల వల్ల భారత్‌ అత్యంత దెబ్బతిన్న దేశంగా ఉందని చెప్పారు. వివిధ దేశాలు స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని అనుమతించే బ్లాక్‌లుగా ఏర్పడటం అనివార్యమని రంగరాజన్‌ అన్నారు. కాగా.. బ్రిక్స్‌ను నేరుగా ఆయన ప్రస్తావించలేదు. బ్రిక్స్‌ అనేది దక్షిణాది దేశాల కోసం ఒక రాజకీయ, దౌత్యపరమైన సమన్వయ వేదికగా ఉంది. ఇందులో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్‌ వంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యమే అతిపెద్ద లక్ష్యాంగా ఉండాలని ఆయన సూచించారు. ”ప్రపంచం ఈ రోజు అస్థిర స్థితిలో ఉంది. ట్రంప్‌ తీసుకుంటున్న కొన్ని ఆర్థిక విధానాలు ప్రపంచ వాణిజ్యాన్ని స్తబ్దతకు గురి చేస్తున్నాయి. అమెరికాలోని విధాన నిర్ణేతలు తాము అనుసరిస్తున్న విధానాలు స్వయం వినాశకరమని త్వరలోనే గ్రహిస్తారన్నారు. ట్రంప్‌ సుంకాలు, ఆర్థిక విధానాలతో భారత్‌ అత్యంత దెబ్బతిన్న దేశంగా నిలుస్తుంది.” అని రంగరాజన్‌ అన్నారు.

సగటున 11.41 శాతం వృద్ధి అవసరం..
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం సాధించి 100 ఏండ్లు పూర్తి చేసుకునే సమయానికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించాలంటే.. రాబోయే 25 ఏండ్ల పాటు సగటున 11.41 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయాల్సి ఉంటుందని రంగరాజన్‌ అన్నారు. కాగా.. 2012-13 నుండి 2023-24 వరకు దేశం సగటున 6.1 శాతం జీడీపీని నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది సరిపోదని.. వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించడానికి నామమాత్ర జీడీపీని 11.41 శాతం వార్షిక రేటుకు పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. 2024-25 కోసం అధిక ఆదాయ దేశాల తలసరి ఆదాయ పరిమితి ప్రస్తుతం 14,006 డాలర్లుగా ఉందని.. 2047-48 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం సుమారు 18,414 డాలర్లకు చేరొచ్చన్నారు. 2022-23 నాటికి భారతదేశ తలసరి ఆదాయం 2,381 డాలర్లుగా ఉందని రంగరాజన్‌ అన్నారు. ఇది ప్రధాన సవాల్‌ను విసురుతుందన్నారు. దీన్ని అధిగమించడానికి అధిక ఎక్కువ వృద్ధి రేటు అవసరమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -