కొత్త మార్కెట్ల వైపు చూపు
కతిహార్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల ప్రభావం భారతీయ మఖనాలపై (తామర గింజలు) పడింది. అమెరికా ప్రజలు ఎక్కువగా మఖనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. తామర పూల గింజల నుంచి తయారు చేసే మఖనాలు తేలికగా, కరకరలాడుతూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మఖనాలపై దిగుమతి సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం పెంచేయడంతో అమెరికన్ల నెలవారీ బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. ‘నా నెలవారీ బడ్జెట్ 900 డాలర్లకు పెరిగింది. కోవిడ్‌కు ముందు అది 500 డాలర్లే ఉండేది. ట్రంప్ సుంకాలతో పరిస్థితి దారుణంగా తయారైంది’ అని కోల్‌కతా నుంచి కొలొరాడోకు వలస వెళ్లిన రవజిత్ సింగ్ చెప్పారు. పాతిక గ్రాముల మఖనాల ప్యాకెట్ ఖరీదు గతంలో రెండు డాలర్లు ఉండేది. ఇటీవలి కాలంలో అది రెట్టింపై నాలుగు డాలర్లకు చేరుకుంది.
మఖనాలే కాదు…ట్రంప్ టారిఫ్ దెబ్బతో పప్పుధాన్యాలు, బాసుమతి బియ్యం ధరలు కూడా కొండెక్కాయి. తొలుత పాతిక శాతం సుంకాలు విధించిన ట్రంప్, ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ సాయం చేస్తోందన్న కారణం చూపి మరో పాతిక శాతం వడ్డించారు. దీంతో దేశంలోని అనేక రంగాలపై ప్రభావం పడింది. ముఖ్యంగా రొయ్యలు, డైమండ్స్, వస్త్ర రంగాలు బాగా దెబ్బతిన్నాయి.
సుంకాల కారణంగా అమెరికాకు మఖనాల ఎగుమతులు 40 శాతం పడిపోయాయని వ్యాపారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు ఇప్పుడు నూతన, ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించారు. మన దేశంలో మఖనాలు లోతట్టు ప్రాంతాలలో…ముఖ్యంగా బీహార్‌లోని తూర్పు ప్రాంతంలో బాగా పెరుగుతాయి. లక్షన్నర మంది రైతులకు అది జీవనాధారంగా ఉంటోంది.
ప్రపంచంలో జరుగుతున్న మఖనాల ఉత్పత్తిలో 90 శాతం వాటా మన దేశానిదే. గత ఆర్థిక సంవత్సరంలో జర్మనీ, చైనా, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు సుమారు 800 మెట్రిక్ టన్నుల మఖనాలు ఎగుమతి అయ్యాయి. అయితే వీటిలో యాభై శాతం వరకూ అమెరికాకే పోతున్నాయి. దేశీయ మార్కెట్ సహా మఖనా పరిశ్రమ మొత్తం టర్నోవర్ 3.6 బిలియన్ రూపాయలు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అమెరికాకు ఎగుమతులు తగ్గుతుండడంతో మన వ్యాపారులు స్పెయిన్, దక్షిణాఫ్రికా మార్కెట్ల వైపు దృష్టి సారించారు. దేశీయంగా కూడా మఖనా మార్కెట్ బలంగానే ఉంది. ఇది వివిధ రుచులలో లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మఖనాలకు ఉన్న వ్యాపార సామర్ధ్యాన్ని గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో బిలియన్ రూపాయల ప్రారంభ కేటాయింపుతో మఖనా బోర్డును ఏర్పాటు చేసింది.



