దేశ పాలకులు నోరు విప్పటం లేదు
వామపక్షాల ఐక్యతే ముఖ్యం : సీపీఐ 25వ జాతీయ మహాసభలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎం.ఎ బేబీ
దేశాన్ని కాపాడేందుకు బీజేపీని కూల్చాలి : సీపీఐ జనరల్ సెక్రెటరీ డి. రాజా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత్‌పై సుంకాలు విధించడం సహా ట్రంప్ నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ అన్నారు. ట్రంప్ విశ్వమహారాజులా ప్రవర్తి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పన్నుల ఉగ్రవా దానికి సమా ధానం చెప్పే వారు ఎవరూ లేరని, భారత్-పాకిస్తాన్ యుద్ధంతో సహా వివిధ యుద్ధాలను ఆపినందుకు ట్రంప్ నోబెల్ బహుమతిని అడుగు తున్నారని తెలిపారు. చండీగఢ్‌లో సురవరం సుధాకర్‌రెడ్డి నగర్‌లోని అతుల్ కుమార్ అంజన్ ప్రాంగణం లో జరుగుతున్న సీపీఐ 25వ జాతీ య మహాసభలో ఆయన మాట్లాడారు.
ప్రత్యామ్నాయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి : ఎంఎ బేబీ
కేరళలోని వామపక్ష ప్రత్యామ్నా యాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేయాలని ఎం.ఎ బేబీ అన్నారు. నవంబర్ 1 నాటికి దేశంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రంగా అవతరించే ఘనతను కేరళ సాధించబోతోందన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు, కేరళ ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యత సాధించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొట్టాయం-వెల్లూరులో పనిచేస్తున్న హిందూస్తాన్ న్యూస్‌పేపర్ లిమిటెడ్‌ను విక్రయించడానికి, ప్రయివేటీకరించడానికి ప్రయత్నిం చిందని, కానీ కేరళ ప్రభుత్వం దానిని కొనుగోలు చేసి కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పేరుతో కార్య కలాపాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ లాభాల్లో పనిచేస్తోందనీ, ఇదే కేరళ మోడల్ అని స్పష్టం చేశారు. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందనీ, ఇక్కడ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో వామపక్షాల ఐక్యత ముఖ్యమని తెలిపారు. ఒకప్పుడు దేశానికి ద్రోహం చేసిన వారు నేడు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. మహాత్మా గాంధీ హత్యలో పాల్గొన్న సావర్కర్ నా గురువు అని ఎర్రకోట నుంచి ఒక వ్యక్తి సిగ్గు లేకుండా చెబుతున్నారని ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ ధోరణులు మరింత బలపడుతున్నాయనీ, దీనిలో భాగంగా ‘ఎన్‌కౌంటర్’ల పేరుతో మావోయిస్టులను చంపుతున్నారని విమర్శించారు. గిరిజనులు, మహిళలు, దళితులు అన్ని వర్గాలను అణచి వేస్తు న్నారనీ, ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా వారి చేతుల్లో ఆయుధంగా మారిందని ఎం.ఎ బేబీ విమర్శించారు.
దేశాన్ని కాపాడేందుకు బీజేపీని కూల్చాలి: డి.రాజా
సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు రాజకీయాలపై నిర్ణయాత్మక ప్రభావం చూపే నిర్ణయాలు సీపీఐ 25వ పార్టీ కాంగ్రెస్‌లో తీసుకుంటామని అన్నారు. ఈ మహాసభ కమ్యూనిస్ట్, వామపక్ష ఉద్యమాలను, లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను ఏకం చేస్తుందనీ, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని రూపొందిస్తుందని ఆయన తెలిపారు. ”మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు అందరికీ సహాయపడే విధానాలుంటాయని ప్రజలకు చెప్పారు. ‘సబ్‌కాసాథ్ సబ్‌కావికాస్’ అనే నినాదం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇది సామాన్యుల, కార్మికుల, రైతుల ప్రభుత్వం కాదనీ, కార్పొరేట్ల ప్రభుత్వమని ప్రజలు అర్థం చేసుకున్నారు” అని ఆయన తెలిపారు. ఇది అదానీ, అంబానీలు దేశాన్ని దోచుకోవడానికి సహాయపడే ప్రభుత్వమని విమర్శించారు. అందుకే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షపార్టీలు పోరాడుతున్నాయనీ, దేశాన్ని కాపాడటానికి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికోసం అన్ని వామపక్షశక్తులు కలిసి రావాలనీ, ఈ మహాసభ దీనిపై చర్చిస్తుందని అన్నారు.
జాతీయజెండా ఎగురవేసిన భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్
విప్లవ వీరుడు భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సీపీఐ సీనియర్ నాయకుడు భూపిందర్ సంబార్ పార్టీ జెండాను ఎగురవేశారు. జలియన్‌వాలా బాగ్ స్మారక చిహ్నం తరహాలో నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద ప్రతినిధులు నివాళులర్పించారు. సీపీఐ మహాసభ ప్రతినిధుల సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ తదితరులు మాట్లాడారు. ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని డి. రాజా, సంస్థాగత నివేదికను కె.నారాయణ, కార్యనిర్వాహక నివేదికను బాలచంద్ర కె.కాంగో ప్రవేశపెట్టారు. క్యూబన్, పాలస్తీనా ప్రజలతో సంఘీభావ సమావేశం సాయంత్రం జరిగింది. రెండు దేశాల రాయబారులు పాల్గొన్నారు. అనంతరం రాజకీయ తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. నివేదికలపై మంగళవారం బహిరంగ చర్చ కొనసాగుతుంది.