రూ.7.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ 1200 పాయింట్లు పతనం
అన్ని షేర్లపైనా బేర్ పంజా
యూఎస్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల ఎఫెక్ట్
ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద సంకేతాలు దలాల్ స్ట్రీట్‌ను అతలాకుతలం చేశాయి. గురువారం ఒక్క పూటలోనే సెన్సెక్స్ 1,200 పాయింట్లు పైగా క్షీణించడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.7,5 లక్షల కోట్లు హరించుకుపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే వార్తలతో ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి, పెరిగిన చమురు ధరలు, రూపాయి బలహీనత వంటి అంశాలు మార్కెట్ల పతనానికి ఇతర కారణాలుగా నిలిచాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు క్షీణించి.. 82,264 కనిష్ట స్థాయిని తాకింది. తుదకు 1236 పాయింట్లు లేదా 1.48 శాతం పతనంతో 82,498కి క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 365 పాయింట్లు లేదా 1.41 శాతం నష్టంతో 25,454 వద్ద ముగిసింది.
బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.7.55 లక్షల కోట్లు ఆవిరై.. రూ.464 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అమ్మకాల వెల్లువ కొనసాగడంతో సెన్సెక్స్-30లో ఏ ఒక్క సూచీ రాణించలేకపోయింది. సూచీలు ఏ ఒక్క దశలోనూ కోలుకోలేకపోవడం ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూడటంతో దలాల్ స్ట్రీట్‌లో బేర్ పంజా విసిరింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.59 శాతం, స్మాల్ క్యాప్ 1.27 శాతం చొప్పున క్షీణించాయి. ”భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు పెరగడం అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.” జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
ప్రధాన ప్రతికూలాంశాలు..
పలు పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. ట్రంప్ చర్యలతో మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకోవడం ప్రధాన కారణమైంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా మిలిటరీ దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లను భయపెట్టాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది.
భగ్గుమన్న ముడిచమురు ధరలు..
యుద్ధ ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కరోజే 4 శాతం పైగాపెరిగి 71 డాలర్లకు చేరుకుంది. భారత్ తన అవసరాలకు చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి.. ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం మార్కెట్‌ను దెబ్బతీసింది.
యూఎస్ ఫెడ్ రేట్లపై అనిశ్చితి..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ జనవరి మీటింగ్ మినిట్స్ ప్రకారం.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ద్రవ్యోల్బణం తగ్గకపోతే వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా ఉందన్న సంకేతాలు వెలువడటంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. గత మూడు రోజులుగా మార్కెట్లు వరుసగా లాభపడగా.. తాజా ప్రతికూలాంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీ రంగాల్లోని దిగ్గజ షేర్లు భారీగా పడిపోయాయి. అమెరికా బాండ్ రాబడులు 4.10 శాతానికి పెరగడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. దీనికి తోడు డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడటం కూడా మార్కెట్‌పై విశ్వాసాన్ని దెబ్బతీసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే వరకు వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.



