Tuesday, March 3, 2026
E-PAPER
Homeజాతీయందలాల్‌ స్ట్రీట్‌లో ట్రంప్‌ యుద్ధోన్మాద కల్లోలం

దలాల్‌ స్ట్రీట్‌లో ట్రంప్‌ యుద్ధోన్మాద కల్లోలం

- Advertisement -

రూ.6.5 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
సెన్సెక్స్‌ 1000 పాయింట్ల పైగా పతనం

ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధోన్మాద చర్యలు దలాల్‌ స్ట్రీట్‌లో కల్లోలం సృష్టించాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వారాంతంలో అమెరికా, ఇజ్రాయిల్‌ జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్‌ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించారనే వార్త ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చనే ఆందోళనల్లో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,048 పాయింట్లు లేదా 1.29 శాతం క్షీణించి 80,239కు పరిమితమయ్యింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 313 పాయింట్లు లేదా 1.24 శాతం నష్టపోయి 24,866 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్‌తో పోల్చితే బీఎస్‌ఈ 2700 పాయింట్లు పతనమై.. ఓ దశలో 78,543 కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఒక్కరోజే బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6.5 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.457 లక్షల కోట్లకు పడిపోయింది. నిఫ్టీలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 1.58 శాతం, 1.75 శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్‌-30లో కేవలం బీఈఎల్‌ 2.09 శాతం, సన్‌ఫార్మా 0.84 శాతం, ఐటీసీ 0.38 శాతం చొప్పున పెరగ్గా.. మిగితా 27 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. వరుస అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఆరు నెలల కనిష్ట స్థాయికి క్షీణించాయి. యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో చమురు రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. రంగాల వారీగా చూస్తే ఆటోమొబైల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాలు 2 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. ముఖ్యంగా ఇండిగో, ఎల్‌ అండ్‌ టీ, అదానీ పోర్ట్స్‌ వంటి దిగ్గజ షేర్లు 3-6 శాతం వరకు పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు యుద్ధ పరిణామాలను గమనిస్తూ నాణ్యమైన బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, డిఫెన్స్‌ రంగ షేర్లను నెమ్మదిగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మిగితా స్టాక్స్‌ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పట్లో మార్కెట్లలో స్థిరత్వం రాకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -