నవతెలంగాణ – బంజారాహిల్స్
చెప్పిన మాటలు వినిపించుకోవడంలేదని బాలుడి శరీరంపై బాగా కాల్చిన అట్లకాడతో ఎనిమిది చోట్ల కాల్చిన ఘటన నగరంలోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి వల్లు తేజ నందన్ ఏడేళ్ల బాలుడిపై అట్లకాడతో ట్యూషన్ టీచర్ దాడి చేశారు.
ట్యూషన్ లో చదవడం లేదనే కారణంతో చేతులు, కాళ్ళు, ముఖంపై వాతలు పెట్టింది. కనీసం బాలుడి కుటుంబానికి సమాచారం కూడా ఇవ్వలేదు. గ్యాస్ స్టౌవ్ పై వేడి చేసిన అట్లకాడతో తేజనందన్ శరీరం పై 8 చోట్ల గాయపరిచింది. ఆ గాయాలతో బాలుడు నడవలేకపోతున్నట్టు సమాచారం. తమ బిడ్డను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక ఆగ్రహానికి లోనైన విద్యార్థి తలిదండ్రులు ట్యూషన్ టీచర్ పై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ కొడుకును విచక్షణా రహితంగా అట్లకాడతో కాల్చిన శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం బాలుడు తేజ నందన్ చికిత్స పొందుతున్నట్టు సమాచారం.



