ప్రముఖ జర్నలిస్టు, రచయిత, తొంభై ఏళ్ల వయసున్న మార్క్ టుల్లీ అనారోగ్య సమస్యలతో ఇటీవల కన్నుమూశారు. 22 ఏళ్లపాటు ఆయన బీబీసీ ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. 1935 అక్టోబరు 24న బ్రిటిష్ ఇండియా కోల్‌కతాలోని టోలీగంజ్‌లో ఈయన జన్మించారు. డార్జిలింగ్‌లో పాఠశాల విద్యను చదివిన ఆయన ఉన్నత చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. 1964లో బీబీసీ కరస్పాండెంట్‌గా ఢిల్లీకి చేరుకున్నారు. దేశంలో జరిగిన పలు చరిత్రాత్మక ఘటనలను ఆయన బీబీసీ ద్వారా ప్రజలకందించారు. బీబీసీ రేడియో కార్యక్రమం ‘సమ్థింగ్ అండర్ స్టుడ్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భారత్‌పై రూపొందించిన అనేక డాక్యుమెంటరీలలో పాలుపంచుకున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా 2002లో నైట్ హుడ్ లభించింది. 1992లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ అందుకున్నారు. ‘నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా’, ‘ఇండియా ఇన్ స్లో మోషన్’, ‘ది హార్ట్ ఆఫ్ ఇండియా’ వంటి తొమ్మిది పుస్తకాలు రాశారు. ఒక జర్నలిస్ట్‌గా ఇండియా స్థితిగతుల్ని బాగా అర్ధం చేసుకుని ఆయన వార్తా కధనాలను అందించారు.
దేశాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోవాలంటే పల్లె భారతం, పట్టణ భారతం అన్న కోణంలో అధ్యయనం చేయాలని విలువైన సూచన చేశారు. ”ఇండియా ఇన్ స్లోమోషన్ ”అన్న టుల్లీ పుస్తకంపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో సుమారుగా ఇరవై ఏండ్ల క్రితం జగన్ సమీక్ష రాశారు.ఆ సమీక్ష నాకు ఎంతో నచ్చింది.ఆ సమీక్షను వెయ్యి కాపీలు ప్రింట్ చేసి జనంలోకి తీసుకెళ్లాను. (అప్పుడు వాట్సప్, ఫేస్ బుక్‌లు లేవు కనుక) ఒక బ్రిటిష్ జర్నలిస్ట్, న్యూఢిల్లీలో బిబిసి బ్యూరో చీఫ్‌గా ఇరవైయేళ్లు ఆ పదవిలో ఉన్నారు. జూలై 1994లో రాజీనామా చేయడానికి ముందు ఆయన బిబిసిలో ముప్పయి సంవత్సరాలు పనిచేశారు.తన పదవీ కాలంలో దక్షిణాసియాలో జరిగిన అన్ని ప్రధాన సంఘటనలను, ఇండో-పాకిస్తాన్ ఘర్షణలు, భోపాల్ గ్యాస్ విషాదం, ఆపరేషన్ బ్లూ స్టార్ ( తర్వాత ఇందిరా గాంధీ హత్య, సిక్కు వ్యతిరేక అల్లర్లు), రాజీవ్ గాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత వరకు అన్నింటిని కవర్ చేసిన గొప్ప జర్నలిస్టు టుల్లీ. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని, 1975లో డిక్రీ ద్వారా పాలన ప్రారంభించిన వెంటనే ఆయన భారతదేశం నుండి బహిష్కరించబడ్డాడు. బెదిరింపులను ఎదుర్కొన్నాడు, దాడికి గురయ్యాడు.
దేశంలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడటానికి కొంతకాలం ముందు ఏడాదిన్నర తర్వాత ఆయన తిరిగి మరళా భారత్‌కు వచ్చారు.1992లో హిందూత్వ కార్యకర్తలు బాబ్రీమసీదు కూల్చివేతను కవర్ చేస్తున్నప్పుడు, కొంతమంది అతన్ని ఎదుర్కొని, ”మార్క్ టల్లీకి మరణం” అని నినాదాలు చేశారు. ఇది బిబిసి పట్ల వారికున్న అపనమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. స్థానిక అధికారి కొన్ని గంటలు టుల్లీని దాచిన తర్వాత అతను బయటకు వెళ్లడానికి సహాయం చేశాడు. కూల్చివేత అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారతదేశం స్వతంత్ర దేశంగా లౌకికవాదానికి ”అతిపెద్ద ఎదురుదెబ్బ” అని చెప్పాడు. అప్పటి డైరెక్టర్ జనరల్ జాన్ బర్ట్‌తో వాదన తర్వాత జూలై 1994లో ఆయన బిబిసికి రాజీనామా చేశారు. బర్ట్ ”భయంతో కార్పొరేషన్‌ను నడుపుతున్నాడు”, పేలవమైన రేటింగ్‌లు, నిరాశకు గురైన సిబ్బందితో బిబిసిని మార్చాడని” ఆయన ఆరోపణలు చేశాడు. ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పే లక్షణాన్ని ఈ జర్నలిస్ట్‌లో మనం చూడొచ్చు.
1994లో ఆయన పాకిస్తాన్ మీదుగా రైలులో ప్రయాణించే పద్దెనిమిది రోజులను బిబిసి కోసం గ్రేట్ రైల్వే జర్నీస్ ఎపిసోడ్ ”కరాచీ టు ది ఖైబర్ పాస్”ను చక్కగా ప్రెజెంట్ చేశారు. నిక్ లెరా నిర్మించిన వరల్డ్ స్టీమ్ క్లాసిక్స్ సిరీస్ ఎపిసోడ్ ”స్టీమ్స్ ఇండియన్ సమ్మర్” ను కూడా ఆయన ప్రదర్శించారు. 1994 నుండి ఆయన న్యూఢిల్లీలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తూ వచ్చారు. 2019లో బిబిసి తన ప్రసారాన్ని ముగించే వరకు అతను వారపు బిబిసి రేడియో కార్యక్రమం సమ్థింగ్ అండర్ స్టూడ్‌కు రెగ్యులర్ ప్రెజెంటర్‌గా ఉన్నాడు. 2010 అక్టోబర్ 7న బెంగళూరు ఇనిషియేటివ్ ఫర్ రిలిజియస్ డైలాగ్‌కు అతిథిగా హాజరైన ఆయన ”మనం ఎంత కచ్చితంగా ఉండాలి? మతపరమైన బహుళత్వం సమస్య” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన తన అనుభవాలను, భారతదేశం చారిత్రాత్మకంగా ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలకు నిలయంగా ఉందనే వాస్తవాన్ని వివరించారు.
ఒకతరం రేడియో శ్రోతలకు టుల్లీ స్వరం ఒక అద్భుతం.అనేక క్లిష్ట పరిస్థితుల్లో , అనేక కష్టాల నడుమ ఆయన జర్నలిస్ట్‌గా కొనసాగారు. 2002లో ఆయన రాసిన ”ఇండియా ఇన్ స్లో మోషన్” పుస్తకంలో రాజకీయ అవినీతి, బాండెడ్ లేబర్ స్థితిగతులపై, సూఫీ అధ్యాత్మికతలపై చాలా స్పష్టంగా స్పందించారు. టుల్లీ ఇంగ్లీష్, హిందీ భాషలలో సమాన ప్రావీణ్యం కలిగిన సాహిత్యాన్ని సజీవంగా ఉంచడానికి తన ప్రయత్నాలను అందించారు. 17 మే 2015న జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో యాభైమంది వక్తలలో కీలక వక్తగా ఉన్నారు. అక్కడ ఆయన దేశ నిర్మాణంలో సాహిత్యం పాత్రను గుర్తుచేశారు. అటు జర్నలిస్ట్‌గా ఇటు సాహితీ వేత్తగా ఆయన జనం పక్షమే నిలిచారు. విశ్వసనీయతతో రిపోర్టింగ్ చేసిన ఆ తరం జర్నలిస్ట్‌ల నుంచి నేటితరం జర్నలిస్టులు స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదిరాసినా వార్తే అన్న చందంగా సమాచార చేరవేతలో జరుగుతున్న తప్పులు సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. దశాబ్దాలుగా విలువలతో కూడిన జర్నలిస్ట్‌గా టుల్లీకి మనం ఇచ్చే నివాళి నిబద్దతతో, క్రమశిక్షణతో, నిజాయితీతో కూడిన జర్నలిస్ట్‌గా మెలగటమే.
పి.వి.రావు
9010153065



