Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌కేర్‌గా టీవీవీపీ

డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌కేర్‌గా టీవీవీపీ

- Advertisement -

– లభించిన ప్రభుత్వ విభాగం హోదా
– ఫలించిన దశాబ్దాల ఐక్య పోరాటం
– సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదరకు డాక్టర్ల, నర్సుల సంఘాల కృతజ్ఞతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ)ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌గా మార్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్‌ డీఎస్‌హెచ్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నేండ్లు అటానమస్‌ వ్యవస్థగా ఉన్న టీవీవీపీకి, ప్రభుత్వ విభాగం హోదా లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1986లో అటానమస్‌ బాడీగా ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం టీవీపీపీ పరిధిలో కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పతులు మొత్తంగా 184 ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, టీచింగ్‌ ఆస్పత్రులకు నడుమ బ్రిడ్జ్‌గా ఈ హాస్పిటళ్లలో ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలను టీవీవీపీ అందిస్తోంది. పూర్తిస్థాయి ప్రభుత్వశాఖ కాకపోవడంతో బడ్జెట్‌ కేటాయింపులు, వేతనాల చెల్లింపు, తదితర అంశాల్లో జాప్యం జరుగుతూ వస్తున్నది. దీంతో దీర్ఘకాలంగా టీవీవీపీ ఉద్యోగులు డైరెక్టరేట్‌ హోదా కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ సెకండరీ హెల్త్‌ కేర్‌గా మార్చేశారు. తెలంగాణలోనూ మార్చాలన్న డిమాండ్‌ పెరిగింది. వేతనాలు ఆలస్యంగా వస్తుండడం, ఈహెచ్‌ఎస్‌ వంటి బెనిఫిట్స్‌ లేకపోవడంతో వీవీపీ పరిధిలోని హాస్పిటళ్లలో పనిచేసేందుకు డాక్టర్లు కూడా ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగుల డిమాండ్‌ నెరవేర్చడంతో పాటు, ఇటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీవీవీపీని డీఎస్‌హెచ్‌గా మార్చాల్సిన అవసరాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ గుర్తించారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా నిపుణులతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించారు. విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, డీఎస్‌హెచ్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపేలా మంత్రి చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో సగటున 4 నుంచి 6 హాస్పిటళ్లు టీవీవీపీ పరిధిలో ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఆ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయనున్నారు. నిధుల కేటాయింపు పెరగనుంది. ఆ ఆస్పత్రులన్నీ పూర్తిస్థాయి ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి. దీంతో వైద్య సేవలు మెరుగు అవనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల టీవీవీపీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. డైరెక్టరేట్‌గా మార్పు ద్వారా సెకండరీ హెల్త్‌ కేర్‌ సేవలపై మరింత కేంద్రీకృత పర్యవేక్షణ సాధ్యమవుతుందనీ, ఆస్పత్రుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. నిధుల వినియోగంలో సమర్థత పెరగడంతో పాటు సేవా, ఆర్థిక అంశాల్లో ఉద్యోగుల సమస్యలకు త్వరిత పరిష్కారం లభించనుంది. ఆరోగ్య శాఖలోని ఇతర విభాగాలతో సమన్వయం మెరుగుపడటంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజరు కుమార్‌ లకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం అసోసియేషన్‌ డాక్టర్లు నరహరి, లాలూ ప్రసాద్‌, రవూప్‌, టీపీసీసీ మెడికల్‌ అండ్‌ డాక్టర్స్‌ వింగ్‌ చైర్మెన్‌ డాక్టర్‌ రాజీవ్‌ నాయక్‌, తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -