Saturday, May 24, 2025
Homeజాతీయం'నేషనల్‌ హెరాల్డ్‌' కేసులో ట్విస్ట్‌

‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో ట్విస్ట్‌

- Advertisement -

– తెరపైకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేరు
– ఈడీ చార్జిషీట్‌లో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నాయకుల పేర్లు
– తీవ్రంగా స్పందించిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌
– తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చారు
– బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చర్యలు తీసుకుంటుందా?
– బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విమర్శల దాడి
– రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసిన తాజా పరిణామం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. కోర్టులో తాను దాఖలు చేసిన చార్జిషీటులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును చేర్చినట్టు తెలుస్తున్నది. ఆయనతో పాటు పవన్‌కుమార్‌ బన్సల్‌, దివంగత నాయకుడు, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీరు రాజకీయ ప్రయోజనాలు, పదవులు వంటి హామీలతో.. యంగ్‌ ఇండియా సంస్థకు నిధులు రాబట్టారని ఈడీ ఆరోపిస్తున్నది. రేవంత్‌రెడ్డి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యంగ్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌కు పలువురి నుంచి ఈ విధంగా నిధులను రాబట్టారని ఈడీ వివరించింది. దర్యాప్తు సంస్థ తన చార్జిషీట్‌లో వీరి పేర్లు చేర్చినప్పటికీ.. నిందితులుగా మాత్రం పేర్కొనలేదు. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌లతో పాటు మరో ఐదుగురు పేర్లను ఈడీ ఇప్పటికే తన చార్జిషీట్‌లో నిందితులుగా చేర్చిన విషయం విదితమే.
తీవ్రంగా స్పందించిన బీఆర్‌ఎస్‌
ఈడీ తన చార్జిషీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేరును చేర్చటం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నది. ఈ వార్తలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తీవ్రంగానే స్పందించింది. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా మార్చారని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, కమీషన్‌ డీల్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రాజీపడిందని కొన్ని నెలలుగా బీఆర్‌ఎస్‌ చేస్తున్న హెచ్చరికలను ఇప్పుడు కేంద్ర సంస్థలు ధృవీకరించాయని ఆయన అన్నారు.
”తెలంగాణ బ్యాగ్‌మ్యాన్‌ను ఈడీ అధికారికంగా బయటపెట్టింది. రాజకీయ హామీలతో దాతలను ప్రభావితం చేస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడ్డాడు. ఆయన పదవి చేపట్టక ముందే.. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. సీఎం అయినప్పటి నుంచి.. ఆయన దానిని వేల కోట్ల స్కాంగా విస్తరించారు” అని కేటీఆర్‌ తెలి పారు. జవాబుదారీతనం నుంచి తప్పించు కోవటం కోసం రేవంత్‌రెడ్డి రోజువారీ అటెన్షన్‌ డైవర్షన్‌ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

ఏమిటీ కేసు?
అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయటానికి కుట్ర జరిగినట్టు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్‌ ఇండియా(వైఐ) సంస్థను స్థాపించినట్టు చెప్తున్నది. ఈ సంస్థ ఏర్పాటుకు కాంగ్రెస్‌ నాయకులతో పాటు ఇతరులు 2019 నుంచి 2022 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పవన్‌ బన్సల్‌, అహ్మద్‌ పటేల్‌లు ప్రలోభ పెట్టారని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్దారించుకున్నట్టు వివరించింది.
ఈడీ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి, పవన్‌ బన్సల్‌లు ఇంకా స్పందించలేదు. యంగ్‌ ఇండియా సంస్థ ఏర్పాటుకు రూ.30 లక్షలు ఇచ్చానని కాంగ్రెస్‌ నాయకుడు అరవింద్‌.. ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్‌పటేల్‌ సూచనల మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌లకు కూడా నోటీసులు ఇచ్చి విచారించింది. గతనెలలో ఈ చార్జిషీట్‌ను ఈడీ ఢిల్లీ కోర్టులో దాఖలు చేసింది.
కేంద్ర సర్కారు మౌనాన్ని ప్రశ్నించిన కేటీఆర్‌
ఈ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ మౌనాన్ని కేటీఆర్‌ ప్రశ్నించారు. ”చార్జిషీట్‌లో రేవంత్‌పేరు ఉండటంపై కేంద్రం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే గత కుంభకోణాలలాగే ఆయనను రక్షిస్తుందా? అమృత్‌ స్కాం, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ స్కాం, సివిల్‌ సప్లరు స్కాంలను చాప కింద తోసేస్తారా?” అని ప్రశ్నించారు. ఇది రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ‘డొనేషన్‌ ఫర్‌ నామినేషన్‌’ రాకెట్‌ను బయటపెట్టిందని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రాజకీయ చిత్తశుద్ధిపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుల ముందు రహస్యంగా మోకరిల్లుతాడా? అని ప్రశ్నించారు. సీఎం కుర్చీ వణుకుతోందనీ, కూలిపోతుందనే భయం రేవంత్‌రెడ్డిని రోజూ వెంటాడుతున్నదని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -