Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంపిల్లర్‌ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

పిల్లర్‌ గుంతలో పడి ఇద్దరు బాలురు మృతి

- Advertisement -

– పొట్ట కూటి కోసం వస్తే కడుపుకోతే మిగిలింది
– ఉప్పల్‌ భగాయత్‌లో విషాదకర ఘటన
నవతెలంగాణ-ఉప్పల్‌

బతుకు దెరువు కోసం పట్నానికి వచ్చి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆ కుటుంబంలో పిల్లర్‌ గుంత విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లల బతుకులను చిదిమేసి కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. ఓ భవన స్థలంలో పిల్లర్‌ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన దంపతులు.. సుజాత, వెంకటేష్‌ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌ కుర్మానగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు మణికంఠ(15) అర్జున్‌(8), ఒక కూతురు ఉన్నారు. కాగా, మంగళవారం తల్లిదండ్రులు పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇద్దరు కుమారులు కనిపించలేదు. దాంతో వారు చుట్టూ పక్కల వెతికి అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఉప్పల్‌ భగాయత్‌లో కులసంఘాల భవనానికి కేటాయించిన స్థలంలో పిల్లర్‌ కోసం తవ్విన గుంతలో తేలుతున్న శవాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ ఎలక్షన్‌ రెడ్డి, ఎస్‌ఐలు, హైడ్రా అధికారులు, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లర్‌ కోసం తవ్విన గుంత నుంచి ఇద్దరు బాలుర మృతదేహాలను బయటకు తీశారు. వారు అదృశ్యమైన బాలురుగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -