– కామారెడ్డి పట్టణంలో విషాదం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలానికి చెందిన ఇద్దరు బాలురు చేపలు పట్టేందుకు వెళ్లి పాడుబడిన బావిలో పడి మృతి చెందినట్లు పట్టణ సిఐ నరహరి ఒక ప్రకటన తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో నివసించే ఇద్దరు బాలురు పాడుబడిన బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం, గోసంగి కాలనీలో నివసించే పనేటి శారద తన కుమారుడు సింహాద్రి ( నరసింహ ) (10) ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని 7వ తేదీన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆమె అన్న కుమారుడు కోదండమ్ విజయ్ (9) కూడా ఇంటి నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని పాడుబడిన బావిలో ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పాడుబడిన బావిలో చేపలు పట్టేందుకు వెళ్లిన బాలురు జారి పడటంతో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన ప్రకటనలో తెలిపారు.



