నవతెలంగాణ – తుర్కపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని రుస్తాపురం సమీపంలోని చోక్లా తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్వాపూర్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కూలీల పిల్లలు తండాలో ఆడుకుంటున్న అబ్దుల్ రెహమాన్ 3 ½ సంవత్సరాల బాలుడు, ప్రీతి కుమారి (3)బాలిక గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో కనిపించకుండాపోయారు. అకస్మాత్తుగా కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే స్థానికుల సహాయంతో తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, చిన్నారుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. యాదాద్రి ఏసీపీ పి. శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట రూరల్ సిఐ ఎం శంకర్ సూచనల మేరకు తుర్కపల్లి పీఎస్ ఎస్ఐ తకీయుద్దీన్, సిబ్బందితో కలిసి చోక్లా తండాకు చేరుకుని, తప్పిపోయిన పిల్లల ఫోటోలను సేకరించి, గాలింపు చర్యలు ప్రారంభించారు. మధ్యాహ్నం 12:00 గంటలకు, ఇద్దరు పిల్లలను భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గుర్తించారు.
వీరిని యాదాద్రి ఏసీపీ శ్రీనివాస్ నాయుడు సమక్షంలో వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. పిల్లలు సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో మిస్సింగ్ కథ ప్రశాంతంగా ముగిసింది. సమాచారం అందుకున్న క్షణాల్లోనే రంగంలోకి దిగి పిల్లల ఆచూకీ కనిపెట్టిన తుర్కపల్లి ఎస్ఐ, సిబ్బందిని పలువురు అభినందించారు.