నవతెలంగాణ – బంజారా హిల్స్
నగరంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగర పరిధిలోని గ్రీన్‌ల్యాండ్స్ వద్ద వైట్ హౌస్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం .. ఆదివారం తెల్లవారు జామున సుమారు 5.30 గంటల సమయంలో గ్రీన్‌ల్యాండ్స్ నుంచి బేగంపేట్ వైపు వెళ్తున్న 16 టైర్ల ఇసుక లారీ (TS09UD9279) వెనుక నుంచి వస్తున్న హోండా యాక్టివా (TG04C7248)ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకున్న వ్యక్తికి తీవ్ర గాయాలపాలైనందున ఆయన్ను స్థానిక ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్దాణ చేశారు.
మృతులను ముద్ధంగల్ నవీన్ (30), నివాసం జేఎన్‌టీయూ, హైదరాబాద్. స్వస్థలం ఖమ్మం జిల్లా హవేలి రూరల్‌గా గుర్తించారు. అలాగే డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర (35), వృత్తి జనరల్ ఫిజీషియన్, కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రి. నివాసం మేతడిస్ట్ కాలనీ, కుండన్‌బాగ్, బేగంపేట్, స్వస్థలం ధర్మపురి, కరీంనగర్ జిల్లాగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ పసుపుల శంకర్ (38), పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.