మర్రి రాఘవయ్య డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారతీయ రైల్వేల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల జీత, భత్యాల సవరణ కోసం నియమించిన ఎనిమిదో వేతన సంఘం కనీస వేతనం రూ. 55 వేలుగా నిర్ణయించాలని కోరారు. అదే నిష్పత్తిలో అన్నీ క్యాడర్లల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 శాతం దాటిన కరువు భత్యాన్ని మూలవేతనంలో కలపాలని సూచించారు. అలాగే 18 నెలలు దాటిన కరువు భత్యాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటీకరణ, సరళీకరణ పేరిట రైల్వేలను ప్రయివేటు పరం చేయకూడదన్నారు. ఇందుకు ఇండిగో ఉదంతమే సాక్ష్యమని వివరించారు.
కొత్త కార్మిక చట్టాల అమలు వల్ల కార్మికులు హక్కులు కోల్పోయారని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1617 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. ఉద్యోగుల అంకితభావంతో సాధ్యమైందని చెప్పారు. 19 వేల కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మించినా, అదే నిష్పత్తిలో ఉద్యోగ నియామక ప్రక్రియ జరగలేదని విమర్శించారు. బాలాసోర్ నుంచి రైలు ప్రమాదాలు జరగకుండా భద్రత విభాగాల్లో యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను చేపట్టాలని కోరారు. రూ. 34 వేల కోట్లు లీజు చార్జీలు, రూ.16 వేల కోట్ల మేర వడ్డీ చెల్లిస్తున్నట్టు, అమృత్ భారత్, సుందరీకరణ, నవీకరణ పేరుతో వృధా ఖర్చు తగ్గించి రైలుపట్టాలను పటిష్టపరచాలని అన్నారు. జపాన్ సాంకేతికతో బుల్లెట్ రైళ్ల రవాణా ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. విజయవాడలో ఈనెల 17, 18 తేదీల్లో ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షులు ఎ.ప్రభాకర్, సంయుక్త ప్రధాన కార్యదర్శి భరణీ భానుప్రసాద్, మీడియా ఇన్‌ఛార్జి షేక్‌రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ రైల్వేల్లో రెండు లక్షల ఖాళీలు భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



