Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంమరో ఇద్దరు వైద్యుల అరెస్ట్‌

మరో ఇద్దరు వైద్యుల అరెస్ట్‌

- Advertisement -

వారితో మాకు సంబంధం లేదు
అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ వెల్లడి
ఢిల్లీ పేలుడు ఘటనలో తాజా పరిణామం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మరో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. వీరు అల్‌-ఫలాహ్‌ విశ్వవిద్యాలయానికి చెందినవారని పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్తున్న విషయంపై అల్‌-ఫలాహ్‌ విశ్వవిద్యాలయం స్పందించింది. అరెస్టయిన డాక్టర్లతో తమకు ఎలాంటి సంబంధమూ
లేదని స్పష్టం చేసింది. దీంతో తాజా పరిణామం కీలకంగా మారింది. ఇక దర్యాప్తు బృందాలు వెతుకుతున్న బ్రెజా కారును ఇదే యూనివర్సిటీలోనే కనుగొన్నాయి. ఢిల్లీ బ్లాస్ట్‌కు హ్యుందారు-ఐ20 కారు కారణమని నిఘా సంస్థలు గుర్తించాయి. దీనిని నడిపింది డాక్టర్‌ ఉమర్‌ అని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తుతో ముడిపడి ఉన్న మారుతి బ్రెజా కారును పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలించారు. ఇందులో భాగంగా సదరు కారును అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీలో గుర్తించినట్టు వారు చెప్పారు. ఢిల్లీ పేలుడు ఘటన అనంతరం అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ పేరు విస్తృతంగా వినిపిస్తున్న విషయం విదితమే.

ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
పేలుడుతో సంబంధమున్న ఫరీదాబాద్‌ ఉగ్రనెట్‌వర్క్‌ కేసులో పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. ఇందులో భాగంగా టెర్రర్‌ మాడ్యుల్‌తో సంబంధమున్న జమ్మూకాశ్మీర్‌ వైద్యుడు డాక్టర్‌ ముజఫర్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలంటూ వారు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మంది అరెస్టయ్యారు. వారిలో ఒకరు డాక్టర్‌ ఆదిల్‌ కాగా.. ఆయన సోదరుడే డాక్టర్‌ ముజఫర్‌. నిందితుల విచారణలో భాగంగా ఈయన పేరు బయటకు వచ్చింది.

‘అల్‌-ఫలాహ్‌’కు న్యాక్‌ షోకాజ్‌ నోటీసులు
ఢిల్లీలో పేలుడు తర్వాత అల్‌-ఫలాహ్‌ యూనిర్సిటీ పేరు విస్తృతంగా వినబడుతోంది. దర్యాప్తులో భాగంగా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయాలూ బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ బ్లాస్ట్‌ ఘటన అనంతరం నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) విశ్వవిద్యాలయానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ చెల్లని, పాత సర్టిఫికెట్లు వాడుతూ తప్పుదారి పట్టిస్తోందని న్యాక్‌ ఆరోపించింది. తమకు గ్రేడ్‌-ఏ సర్టిఫికెట్‌ ఉన్నట్టు యూనివర్సిటీ తన వెబ్‌సైట్‌లో చూపించుకున్న కారణంగానే న్యాక్‌ ఈ చర్యలకు దిగింది. ఆ గ్రేడ్‌-ఏ సర్టిఫికెట్‌లు 2016, 2018లోనే చెల్లుబాటు ముగిశాయనీ, అయినప్పటికీ వాటిని ఇప్పటికీ వెబ్‌సైట్‌లో చూపించడం తప్పుదారి పట్టించే చర్యగా న్యాక్‌ పేర్కొన్నది. ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చింది. యూనివర్సిటీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు? భవిష్యత్‌ అప్రూవల్‌లు రద్దు చేయొద్దా? యూజీసీ, ఎన్‌ఎంసీ, ఎన్‌సీటీఏ, ఏఐసీటీఏ వంటి సంస్థల గుర్తింపు నిలిపివేయకూడదా? అని తన నోటీసులో న్యాక్‌ పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -