– గుర్గావ్, పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్న సీఐడీ బృందాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్‌లో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కుంభకోణంలో పరారీలో ఉన్న మరో ఇద్దరు కీలక నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో చట్టవిరుద్ధంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు జరుపుతూ రూ.కోట్లను దండుకున్న డాక్టర్లు, దళారీల వైనం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశామని చారుసిన్హా తెలిపారు. తాజాగా ఈ కేసులో మూడో నిందితుడైన పి.పవన్ కుమార్, 15వ నిందితుడు ప్రదీప్ గుప్తాలను అరెస్ట్ చేశామని ఆమె చెప్పారు. ఈ కేసు వెలుగులోకి వచ్చాక పవన్‌కుమార్, ప్రదీప్ గుప్తాలు పరారీలో ఉన్నారని ఆమె తెలిపారు. ఏపీలోని తాడెపల్లి గూడెనికి చెందిన పవన్.. చెన్నై, మరికొన్ని ప్రాంతాలకు చెందిన కొందరు పేదలను గుర్తించి, వారి కిడ్నీని దానం చేయటం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులిప్పిస్తామంటూ ఆశలు చూపించి సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రికి తీసుకొచ్చేవాడు. వారిని అక్కడ డాక్టర్ రాజశేఖర్‌కు అప్పగించి, కమీషన్ రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.13 లక్షలను తీసుకునేవాడని చారుసిన్హా తెలిపారు. ఆ విధంగా పలువురు దాతలకు మాయమాటలు చెప్పి, తీసుకొచ్చి డబ్బులను దండుకొని, విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడని ఆమె చెప్పారు. అలాగే హర్యానా రాష్ట్రం గుర్గావ్‌కు చెందిన ప్రదీప్ గుప్తా సైతం పేదవారికి డబ్బు ఆశ చూపించి, కిడ్నీ మార్పిడి జరిపించేవాడని ఆమె తెలిపారు. వారిని తీసుకు వచ్చి పవన్‌కు అప్పగించేవాడనీ, తద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు వసూలు చేసేవాడని వివరించారు. రెండు ప్రత్యేక బృందాలు గాలింపులు జరిపి, ఈ ఇద్దరిని గుర్గావ్, పంజాబ్ రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు చారుసిన్హా తెలిపారు.
కిడ్నీ రాకెట్ కుంభకోణంలోమరో ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES