సికింద్రాబాద్, నారాయణగూడలో ఏర్పాటు
బస్తీ దవాఖానల్లోనూ శాంపిల్స్ సేకరణ
ఆయుష్మాన్ భారత్ కింద రూ.20 కోట్లు కేటాయింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇక అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఇప్పటికే సుమారు 250కి పై చిలుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ.. ఇప్పుడు ఆధునిక డయాగ్నోస్టిక్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆయు ష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మిషన్‌లో భాగంగా ఇటీ వల నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో మెట్రోపాలిటన్ సర్‌వైలెన్స్ యూనిట్ (ఎంఎస్‌యూ) ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
పెరుగుతున్న నగర జనాభా
రోజు రోజుకూ జనాభా, పట్టణీకరణ పెరుగుతున్న హైదరాబాద్ మహా నగరవాసులకు మరింత అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంఎస్‌యూ ను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దాంతో జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లోని రెండున్నర వేల గజాల స్థలాన్ని చూపగా, అక్కడ ఎంఎస్‌యూ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు సమాచారం. అలాగే, నారాయణగూడలోని ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఆవరణలో కూడా అందుబాటులో ఉన్న మరో రెండున్నర వేల చదరపు గజాల స్థలాన్ని ప్రతిపాదించగా.. అక్కడ కూడా యూనిట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ రెండు ఎంఎస్‌యూలలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించేలా అందుబాటులోకి తేనున్నారు.
వివిధ రకాల వ్యాధుల గుర్తింపు
సికింద్రాబాద్, నారాయణగూడలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌యూ యూనిట్ల ద్వారా వివిధ రకాల వ్యాధులను గుర్తించడం, ప్రజలను అప్రమత్తం చేయటం, వ్యాధుల లక్షణాలను ధ్రువీకరించడం, నమూనా సేకరణ, విశ్లేషణకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ తరపున దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్ వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) కార్యక్రమంలో ఈ యూనిట్ భాగం కానున్నది. ఈ రెండు యూనిట్లకు కేంద్రం రూ.20 కోట్లు వెచ్చించనున్నట్టు సమాచారం.
బస్తీ దవాఖానల్లోనూ శాంపిల్స్ సేకరణ
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు కోటి మందికిపైగా జనాభాకు 30 సర్కిళ్లలో దాదాపు 256 బస్తీ దవాఖానల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. కొన్ని వైద్య పరీక్షలకు బస్తీ దవాఖానల్లో కూడా శాంపిల్స్ సేకరిస్తున్నప్ప టికీ, రిపోర్టులు వచ్చే సరికి ఆలస్యమవుతోంది. దాంతో ఎంఎస్‌ఈయూ ద్వారా వైద్య పరీక్షలను వీలైనంత త్వరితగతిన నిర్వహించి, రిపోర్టులు అందజేసే అవకాశాలు న్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, వైద్య పరీక్షలు అవసరమైన ప్రజలు నేరుగా సికింద్రాబాద్, నారాయణ గూడల్లో ఏర్పాటు చేయనున్న మెట్రోపాలిటన్ సర్‌వైలెన్స్ యూనిట్‌కు వచ్చే అవసరం లేకుండా, బస్తీ దవాఖానల్లో శ్యాంపిల్స్ ఇస్తే వారికి 24 గంటల్లోనే రిపోర్టులు మళ్లీ అక్కడకు వచ్చేలా ఈ యూనిట్‌లు పని చేయనున్నట్టు సమాచారం. డైలీ వివిధ బస్తీ దవాఖానల నుంచి వచ్చే శాంపిల్స్‌ను బట్టి ఈ యూనిట్ పని చేస్తుంది. వీలైతే మున్ముందు ప్రజలకు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించి నిర్వహణ బాధ్యతలను చేపట్టేలా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం.
అందుబాటులోకి మరిన్ని బస్తీ దవాఖానలు
ఢిల్లీ నగరంలో గల్లీ గల్లీలో వైద్య సేవలందిస్తున్న మోహల్లా దవాఖానలపై 2017లో స్టడీ చేసిన జీహెచ్‌ఎంసీ.. 2018 నుంచి సిటీలో బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. తొలుత జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న వైద్య సేవలందించిన బస్తీ దవాఖానలు ఇప్పుడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్థోపెడిక్ సేవలందించే స్థాయికి ఎదిగాయి. ప్రస్తుతం 256 వరకు ఉన్న బస్తీ దవాఖానల సంఖ్యను 300 వరకు పెంచేందుకు అవసరమైన సహాయ సహకారాలు కూడా అందించేందుకు ఆయుష్మాన్ భారత్ ప్రతినిధుల బృందం సుముఖత చూపినట్టు సమాచారం.
రెండు ‘ఎంఎస్‌యూ’ యూనిట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES