Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంఅనిల్‌ అంబానీపై ద్విముఖ దర్యాప్తు

అనిల్‌ అంబానీపై ద్విముఖ దర్యాప్తు

- Advertisement -

సీబీఐ కొత్త కేసులో విచారణ
మరోవైపు ఈడీ ముందు అంబానీ హాజరు
మరిన్ని ఆస్తులు అటాచ్‌

న్యూఢిల్లీ : పలు బ్యాంక్‌లను వేల కోట్ల రూపాయలకు ముంచిన మోసం కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మెన్‌ అనిల్‌ అంబానీ చుట్టూ కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఒకే రోజున అటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణను ఎదుర్కోవడంతో పాటు, ఇటు సీబీఐ నమోదు చేసిన కొత్త బ్యాంకు మోసం కేసులో ఆయన నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఫిర్యాదు మేరకు అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)పై సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

2013-17 మధ్య కాలంలో బీఓబీలో విలీనం కాకముందు అప్పటి విజయ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ నుండి పొందిన రుణాలను పక్కదారి పట్టించి బ్యాంకుకు రూ.2,220 కోట్ల నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసు నమోదు చేసిన వెంటనే గురువారం నాడు సీబీఐ బృందాలు ముంబయిలోని అనిల్‌ అంబానీ నివాసం అబోడ్‌, ఆర్‌కామ్‌ రిజిస్టర్డ్‌ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వాస్తవానికి ఈ రుణ ఖాతాను 2017లోనే మొండి బాకీగా ప్రకటించారు. అయితే.. దీనిని మోసపూరితమైనది (ఫ్రాడ్‌)గా గుర్తించడంపై అంబానీ బాంబే హైకోర్టు నుంచి స్టే పొందారు. ఫిబ్రవరి 23న ఆ స్టే గడువు ముగియడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెంటనే ఫిర్యాదు చేసింది.

అనిల్‌ అంబానీ నివాసం జప్తు..
దాదాపు రూ.40,000 కోట్ల భారీ బ్యాంకింగ్‌, మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ అంబానీ గురువారం ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో రెండో విడత విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు ఆయన సెంట్రల్‌ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. అక్కడ అధికారుల బృందం ఈ భారీ రుణాల దారి మళ్లింపు, ఆర్థిక లావాదేవీలపై ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ విచారణకు ఒకరోజు ముందు బుధవారం ముంబయిలోని పాలి హిల్‌ ప్రాంతంలో ఉన్న ఆయన 17 అంతస్తుల నివాసం అబోడ్‌ను ఈడీ అధికారులు జప్తు చేశారు. దీని విలువ సుమారు రూ. 3,716 కోట్లుగా ఉంటుందని అధికార వర్గాల అంచనా.

తన వ్యక్తిగత ఆస్తులను అప్పులు ఇచ్చిన బ్యాంకుల నుంచి కాపాడుకోవడానికి అనిల్‌ అంబానీ ఈ నివాసాన్ని రైస్‌ఇ ట్రస్ట్‌ అనే ప్రయివేటు ఫ్యామిలీ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. దీనిని సంపదను దాచుకునే మోసపూరిత ప్రయత్నంగా ఇడి వర్గాలు అభివర్ణించాయి. తాజా చర్యతో ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ఏకకాలంలో రెండు అతిపెద్ద దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో అనిల్‌ అంబానీకి మరింత ఉచ్చు బిగిసిందని స్పష్టమవుతోంది. తాజా పరిణామాలు కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -