– 18 కాయిల్స్ చోరీ, రూ.80 వేల వరకు నష్టం
– రైతులకు సాగునీటి ఇబ్బందులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామ పరిధిలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ పైనున్న రెండు ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.రెండు ట్రాన్స్ ఫార్మర్ల సంబంధించిన 18 కాయిల్స్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం వ్యవసాయ తోటల్లోకి వెళ్లిన రైతులు ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమైన విషయాన్ని గమనించి స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనకు సంబంధించి ఉప్లూర్ లైన్ మెన్ శ్రీకాంత్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పరిధిలోని కాకతీయ కాలువపై ఉన్న ఎస్ఎస్ 95, ఎస్ఎస్ 96 నంబర్లు గల రెండు ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా ధ్వంసం చేశారు.
ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ లో ఉండే 9 కాయిల్స్ చొప్పున రెండు ప్రాన్స్ ఫార్మర్లకు చెందిన 18 కాయిల్స్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేయడంతో అందులో ఉండే ఆయిల్ మొత్తం భూమి పాలయ్యింది. వెంటనే విషయాన్ని లైన్ మెన్ శ్రీకాంత్ తమ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారు ట్రాన్స్ ఫార్మర్ల చోరీ విషయాన్ని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఐ అనిల్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ అన్నయ్య, ఎస్ఎల్ఏ నాగభూషణం, సబ్ ఇంజనీర్ అమేద్ లతో కలిసి సంఘటన స్థలాలను సందర్శించి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రెండు ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేయడం మూలంగా సుమారు రూ. 80 వేల వరకు నష్టం వాటిల్లినట్టు విద్యుత్ శాఖ ఏఈ అన్నయ్య తెలిపారు. కాగా దుండగులు రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేయడంతో వాటి పరిధిలోని రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. విద్య శాఖ సిబ్బంది త్వరగా నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసి తమకు సాగు కష్టాలను తీర్చాలని రైతులు కోరుతున్నారు.



