ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ టోలీచౌకీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద ఘటన
నవతెలంగాణ-మెహదీపట్నం
హైదరాబాద్‌లోని టోలిచౌకీలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందపడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకీలోని అల్ హస్నాత్ కాలనీలో ఆరంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. భవనం పైభాగంలో ఏర్పాటు చేసిన గోవా కర్రలపై కార్మికులు పనులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఆ కర్రలు అకస్మాత్తుగా కూలిపోయాయి.
దాంతో అక్కడ పని చేస్తున్న కార్మికులుపై నుంచి కిందపడిపోయారు. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుపతిరావు (30), ఆదినారాయణ (50) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న టోలిచౌకీ పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్. రమేష్, ఒడిశాకు చెందిన మేస్త్రీ ఎం. రమేష్, నగరంలోని ఇస్మాయిల్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ లాల్ అహ్మద్ ఉన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
భవనంపై నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



