Wednesday, December 24, 2025
E-PAPER
Homeక్రైమ్విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి

విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి

- Advertisement -

డ్రయినేజీ శుభ్రం చేస్తుండగా ప్రమాదం
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పీఎస్‌ పరిధిలో విషాద ఘటన
నవతెలంగాణ-రామచంద్రాపురం

సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బ్లాసమ్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున డ్రయినేజీ శుభ్రం చేసే క్రమంలో ఇద్దరు కార్మికులు విషవాయువు పీల్చి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్‌మెంట్‌ నిర్వహణ సభ్యులు ఐదు నెలల క్రితం డ్రయినేజీ శుభ్రపరిచే పనులను కొల్లూరులోని ఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కంపెనీకి అప్పగించారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలో పని చేస్తున్న హరీశ్‌ సింగ్‌ (22), సోమిత్‌ రుయిడాస్‌ (23) కార్మికులు సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో బ్లాక్‌-ఏ పక్కనున్న ఎస్‌టీపీ నుంచి నీటిని తొలగించే పనులు ప్రారంభించారు. అదే సమయంలో కంపెనీ సూపర్‌వైజర్‌ అతుల్‌ కూడా అక్కడే ఉన్నాడు. నీటి తొలగింపు పూర్తయిన అనంతరం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో హరీశ్‌, సోమిత్‌ ఇద్దరూ ఎస్‌టీపీలోకి దిగారు. ఎంతసేపటికి స్పందన లేకపోవడంతో సూపర్‌వైజర్‌ అతుల్‌ గట్టిగా కేకలు వేయగా అపార్ట్‌మెంట్‌ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిని కాపాడేందుకు అతుల్‌ తాడుకు కట్టుకుని ఎస్‌టీపీలోకి దిగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా బయటకు వచ్చాడు. సమాచారం అందుకున్న కంపెనీ యజమానుల్లో ఒకరైన ప్రణవ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో వ్యక్తి కూడా వారిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఇద్దరినీ బయటకు తీసివేయగా వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎస్‌టీపీలో ఉన్న విషవాయువులే మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడంపై ఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -