Sunday, July 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజియూ-సీటింగ్‌

యూ-సీటింగ్‌

- Advertisement -

‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు… మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ.. వెనుకవచ్చు వాళ్లతో బాట అయినది’ అంటాడో కవి. ఇలాంటి అడుగులు వేయడంలో, సామాజిక స్పృహతో కొత్త సంస్కరణలు తీసుకోవడంలో కేరళ రాష్ట్రం ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. అలాంటి మరో వినూత్న ప్రయోగంగా పాఠశాలల్లో యూ-సీటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. బెంచీలు ‘ఖ’ ఆకారంలో వేసి విద్యార్థులను కూర్చోబెట్టడమే యూ-సీటింగ్‌ విధానం. తరగతి గదిలో పిల్లలందరూ సమానమే అనే భావన కల్పించేం దుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఈ మధ్యనే ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది.
ఇటీవల మలయాళంలో విడుదలైన ‘స్థానార్థి శ్రీకుట్టన్‌’ అనే చిత్రంలో యూ-ఆకారపు సీటింగ్‌ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత దాని స్ఫూర్తితో కేరళలోని కొన్ని పాఠశాలల్లో ఈ కొత్త సీటింగ్‌ పద్దతిని ప్రవేశపెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి మంచి స్పందన వచ్చింది. అందుకే తమిళనాడు, ఒడిషా, పంజాబ్‌ రాష్ట్రాల పాఠశాలల విద్యాశాఖలు కూడా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. దాంతో దేశ వ్యాప్తంగా ఇదో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఆచరించేందుకు ముందుకు వచ్చింది.
సాధారణంగా బ్యాక్‌ బెంచ్‌లో కూర్చునే విద్యార్థులంటే అల్లరి చేసేవారని, చదువుపై అంత శ్రద్ధ పెట్టరనీ, పాఠాలు సరిగా వినరనే భావన సమాజంలో ఉంది. అంతెందుకు ఉపాధ్యాయులు కూడా చదివే పిల్లలనే ముందు వరసలో కూర్చోబెట్టడం మనం చూస్తున్నాం. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే సామాజికంగా వెనుక బడిన పిల్లలే ఎక్కువగా బ్యాక్‌ బెంచ్‌లో కూర్చుంటారు. ఎందుకంటే వారిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ. ఇక విద్యార్థిగా ఉన్నప్పుడు తరగతి గదిలో అంబేెద్కర్‌ లాంటి వారు అనుభవించిన అంటరానితనం గురించి మనం చదివాము, ఆవేదన చెందాము. ఇలాంటి వాటికి స్వస్తిపలికేందుకు యూ-సీటింగ్‌ విధానం కొంతవరకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు!
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో వెనకబడుతున్నారనీ, ముందు వరసలో కూర్చోబెట్టండంటూ ఉపాధ్యాయులను అభ్యర్ధిస్తుంటారు. ఈ కొత్త సీటింగ్‌తో ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు పిల్లలందరినీ గమనించే అవకాశం ఉంటుంది. ఇప్పటికి వరకు మన దగ్గర ఉన్న ఉపాధ్యాయ కేంద్రీకృతంగా సాగుతున్న తరగతి గది, విద్యార్థి కేంద్రీకృతంగా మారే అవకాశమూ ఉంటుంది. పిల్లలు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు, చర్చల్లో పాల్గొనేందుకు సాధ్యమవుతుంది. మరీ ముఖ్యంగా తరగతి గదిలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే ధోరణి సమసిపోతుంది. అంటే విద్యార్థుల మధ్య ఫస్ట్‌ బెంచ్‌ – బ్యాక్‌ బెంచ్‌ అనే అసమానత తొలగిపోతుంది.
అయితే యూ సీటింగ్‌ విధానం మొత్తం విద్యా వ్యవస్థనే మార్చివేయదు. కాకపోతే విద్యార్థుల్లో గతంకంటే అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడటానికి, మనోధైర్యం పెంపొందడానికి మాత్రం ఇది కచ్చితంగా ఉపకరిస్తుంది. దీనికి ఉదాహరణ ఫిన్లాండ్‌ దేశం. నిజానికి యూ సీటింగ్‌ విధానం ఇప్పుడు మన దేశానికి కొత్తకానీ ఫిన్లాండ్‌లో ఎప్పుడో ప్రవేశపెట్టారు. ఫలితంగా అక్కడ నాణ్యమైన విద్యావ్యవస్థ సాధ్యపడిందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ కొన్ని ఆధునిక పాఠశాలల్లోని తరగతి గదుల్లో డెస్క్‌లు, కుర్చీలకు బదులుగా సోఫాలు, మృదువైన కుర్చీలు, ఆధునిక టేబుళ్లను ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు తమ సీటింగ్‌ అమరికను అవసరమైన విధంగా మార్చుకునే వీలు కూడా కల్పించారు. విద్యార్థులు గ్రూపుగా కూర్చుని చర్చించుకునే పద్ధతి కూడా ఉంది. ఫిన్లాండ్‌లో ఈ విధానం వల్ల విద్యావ్యవస్థ ఎలా మెరుగుపడిందో తెలియజేస్తూ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బాలల రచయిత ఆయేషా ఆర్‌.నటరాజన్‌ తన ‘యారుదైయ వాగుపర్రై (Yaarudaiya Vaguparrai)’ అనే పుస్తకంలో చక్కగా వివరించారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం అసలు ఆ విధానమే సరైనది కాదని కొట్టిపారేస్తున్నారు. కొన్ని వివక్షతలు, బేధాలను తొలగించుకోవడాన్ని ఎందుకు వీళ్లు ఆహ్వానించలేకపోతున్నారా అర్థం కాదు.
ఎవరు ఏమనుకున్నా యూ-సీటింగ్‌ వల్ల మంచి ఫలితాలు వస్తాయనడానికి ఫిన్లాండ్‌ లాంటి విదేశాలే కాదు మన దేశంలో కేరళ, తమిళనాడు, పంజాబ్‌, ఒడిసా రాష్ట్రాలు కూడా తాజా ఉదాహరణలు. ఏ విధంగా చూసినా యూ సీటింగ్‌ అనేది మన విద్యార్థులకు మేలు చేసే కొత్త ప్రయోగం. విద్యార్థి దశలోనే అందరూ సమానం అనే బీజం పడి అది నవ భారతానికి నాంది పలుకుతుంది. దానికి బాటను చూపే యూ సీటింగ్‌ విధానానికి అనుగుణంగా మనం కూడా తరగతి గదులు మార్పులు చేసుకుని ముందుకెళ్లాలి. ఈ వినూత్న సంస్కరణ అందరూ సాదరంగా ఆహ్వానించాలి. సమాన భారతావని దిశగా అడుగులు వేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -