Sunday, March 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఉగాది తిరస్కారాలు….శ్రవణాలు

ఉగాది తిరస్కారాలు….శ్రవణాలు

- Advertisement -

పరాభవనామ సంవత్సరానికిగాను రకరకాల ప్రభుత్వాలు నానారకాలైన అవార్డులివ్వాలని నిర్ణయించాయి. అందులో భాగంగా కసరత్తులుచేసి, వివిధ పేర్లతో జాబితాలు తయారు చేశాయి.
అసలు మనిషి శ్రమశక్తినుండే మాటలు, భాష, పాటల రూపంలో సాహిత్యం మొదలైందన్న విషయాన్ని మరచిపోయిన మనుషులు దానికి తెలివి అని, మేధస్సు అని ఇంకా ముందుకుపోయి దైవత్వాన్ని ఆపాదించడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తెలుగు తెలిసిసినోళ్లకు పరాభవ అంటే తెలిసే అర్థం ఒకటే, పరాభవం చేయడం లేదా అవమానించడం అని. ఐతే మిత్రులు కొందరు సందేశాలు పంపారు, పరా అంటే పార్వతీదేవి అనీ, భవ అంటే శివుడని. మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు అని వారికి గౌరవంగా సమాధానమిచ్చాను. వాళ్లూ అంతే గౌరవంగా స్వీకరించారు. ఐతే ఈ భాషలు, భావాలు మనిషి శ్రమనుండే వచ్చాయని వాళ్లూ తెలుసుకోవాలి, గౌరవించాలి అది నా కోరిక. మనుషులుగా మన శ్రమను మనం విస్మరించకూడదుగా!

ఉగాది తిరస్కరణ పురస్కారం. వినడానికే విచిత్రంగా అనిపించినా, కనిపించినా, వినిపించినా మీరు చదివింది వాస్తవం. ఈ అవార్డుకింద మొదట ఒక జాబితా ప్రకటిస్తారు. అందులో పేర్లున్నవాళ్లకు ఫోన్లుకూడా చేస్తారు. తప్పకుండా రావాలని చెప్పి అటునుండి మాట కూడా తీసుకుంటారు. కొద్దిసేపటి తరువాత అదే నెంబరునుండి ఇంకో ఫోను. సారీ సార్‌, పొరబాటున ఇంతకుముందు మీకు అవార్డు వచ్చిందన్నాము, ఇప్పుడు అమాత్యులవారి కొత్త జాబితాలో మీపేరు లేదు. మీరు రానవసరం లేదన్నట్టు సమాచారం. నాన్‌ మైనారిటీ పురస్కారం ఈసారి ప్రత్యేకంగా పరమభక్తరాష్ట్రంగా చెప్పుకునే వాళ్లిస్తున్నారు. ఆ రాష్ట్రానికాపేరెందుకొచ్చిందంటే అధికారంలో ఉన్న ఏపార్టీయైనా పరమభక్తి ప్రదర్శించుకుంటారు ఢిల్లీ ప్రభువులపట్ల. ఇప్పటి ప్రభువులను మాత్రమేనని గమనించాలిక్కడ. ఢిల్లీ సుల్తానుల విషయం వస్తే మాత్రం ఊగిపోతారు, తిడతారు వారిని కొట్టే అవకాశం లేదు కాబట్టి అవన్నీ సినిమాల్లో చూపిస్తారు. సబ్‌ కో సన్మతి దే భగవాన్‌ అన్న గాంధీగారి పేరున ఉన్న పథకం పేరు మార్చినా ముక్కుమీద వేలేసుకొని ఉండే రాజకీయ ర్యాంకింగ్‌ విద్యార్థులు వీరు.

మాదకద్రవ్య ఉగాది పురస్కారాలు కూడా ఉంటాయని పరాభవ తెలియజేసింది. పెద్దలకొక న్యాయం, పేదలకొక న్యాయం మనకు తెలిసున్న విషయమే. రేవ్‌ పార్టీలని, ఫామ్‌హౌస్‌ పార్టీలనీ మనిషులు చాలా ముందుకు పోయారు. అక్కడ జరిగేదాన్ని అరికట్టడానికి సినిమాల్లోలాగ సింగిల్‌ ఆఫీసర్‌ సరిపోడు. గుంపుగాపోయినా మాఫియాలతో ఫైటింగ్‌ చేయవలసివుంటుంది. పోలీసులకంటే ముందు అటువైపునుండి కాల్పులు జరగొచ్చు. గంజాయి కనిపిస్తే సహించమని, ఎటువంటి మత్తు పదార్థాలను ప్రోత్సహించమని ఎన్నికల వాగ్దానాలను ఎలా గుమ్మరించారో ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. మాఫియా ఇంకా ఎక్కువగా డ్రగ్స్‌ను గుమ్మరిస్తోంది. ఈసారి ఉగాది పచ్చడిలో ఏమేమి కలిపారో కూడా తెలియడం లేదు. అలాగుంది పరిస్థితి అర్థం కానంతగా. ప్రభుత్వాల ప్రోత్సాహకాలు అలాగున్నాయి ఈ ఉగాదికి.

పంచాంగ శ్రవణాలు కొత్తకొత్తగా ఉండొచ్చు. డబ్బు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, వ్యాపారపరంగా యుద్ధసామాగ్రి పరిశ్రమలో, పెట్రోలియం విమానయాన రంగాల్లో పెట్టుబడులు లాభదాయకం అని పంచాంగశ్రవణంలో ఎక్కడైనా విన్నా ఆశ్చర్యంలేదు. వ్యవసాయ, ఫలసాయ రంగాల్లో మిశ్రమ అతి మిశ్రమ ఫలితాలుంటాయి కాబట్టి ప్రభువులు చెప్పిన పంటలే వేయండి అని ముఖ్యమంత్రి వైపు చూడొచ్చు. ఆయన వాట్సప్పు భాషలో థమ్సప్పు చూపొచ్చు. మహిళలకు అన్ని రకాల పదవుల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వార్తలనిండా వాళ్లే ఉంటారు అంటే మనమేమో అనుకుంటాము. మరుసటిరోజు, ఆ మాటకొస్తే ఏరోజు చూసినా వార్తల్లో వాళ్లే ఉంటారు వేరేవిధంగా. వాతావరణ మార్పులు సహజం, ప్రకృతి, మానవ విపత్తుల విషయంలో జాగ్రత్త అవసరం అనీ చెప్పొచ్చు. ఈ ప్రపంచానికి రాహువు కేతువువల్ల ప్రమాదం పొంచివుంది అనొచ్చు,. అంటే ట్రంపు, నెతన్యాహునా పండితులవారూ అనడిగితే దాటేయొచ్చు.

ఐతే దేశంలో రాహుకేతువులెవరని ఒకమ్మాయి కొంటెగా అడిగితే రాజకీయ రాహుకేతువులు, వ్యాపార రాహుకేతువులూ సెపరేటుగా ఉంటాయమ్మా అనొచ్చు. ఎ.ఐ చెప్పిన పంచాంగ శ్రవణమొకటి చూద్దాం. ఈ ప్రపంచమంతా నాపై ఆధారపడుతుంది. ఈ ఉగాదికున్న మెదడు బరువు మరుసటి ఉగాదికి ఓ ఐదుగ్రాములు తగ్గుతుంది. నాకోసం పనిలో ఉన్న కంప్యూటర్లు, ఏసీలు, నెట్‌ వర్కులవల్ల భూమి ఇంకా వేడెక్కిపోతుంది. ఇంకా అన్నీ చెబితే గుండె బలంగాలేనోళ్లకు ఈ ఉగాది చివరిది కూడా కావచ్చు. అందుకే ఆపేస్తున్నాను. ఒక అష్టావధానం దగ్గర ఓ పృచ్ఛకుడు అవధానినడిగాడు మాస్టారూ బంగారు బాతుగుడ్డు, కోడిగుడ్డు, గాడిదగుడ్డు ఈ మూడూ వచ్చేలాగ పద్యమొకటి వదలండి అని. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అవధాని కాస్త పరేషానై కాస్త సమస్యను మార్చమన్నాడు. కొన్నిరోజులు మీ ప్రశ్నల్లో గుడ్డు అన్న పదం లేనివిధంగా చూసుకొండి అని ఓ అభ్యర్ధన కూడా చేశాడు!

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -