ముంబయిలో స్టార్మర్‌కు ఘన స్వాగతం
వ్యాపారవేత్తలతో సమావేశం
నేడు ప్రధాని మోడీతో భేటీ
ముంబయి : యూకే ప్రధాని కీర్ స్టార్మర్ బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఇది భారత్‌లో ఆయన మొదటి అధికారిక పర్యటన. బుధవారం ఉదయం ముంబయి చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కీర్ బృందం దిగింది. వారిని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు సాదరంగా ఆహ్వానించారు. యూకే నుంచి 125 మంది సభ్యులతో గరిష్టస్థాయి వాణిజ్య బృందంతో వచ్చిన స్టార్మర్.. అనంతరం ముంబయిలో వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. తాజ్‌మహల్ ప్యాలెస్‌లో వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిస్పోజబుల్ కెమెరాతో సెల్ఫీ తీసుకున్న ఆయన ఆటోగ్రాఫ్ మూమెంట్ వైరల్ అయింది.
యూకే ప్రధానికి స్వాగతం : మోడీ ట్వీట్
యూకే ప్రధాని కీర్ స్టార్మర్, భారత పర్యటన గురించి భారత ప్రధాని మోడీ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ”భారత్‌కు మొదటి చారిత్రక సందర్శనకు వచ్చిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌ను స్వాగతిస్తున్నా.. యూకే నుంచి వచ్చిన అతి పెద్ద వాణిజ్య డెలిగేషన్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా.. రేపటి మా సమావేశంలో.. ఇరుదేశాలు బలమైన, పరస్పర లాభదాయక భవిష్యత్తు సాధించే దిశగా ముందుకు వెళ్లడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అని మోడీ పేర్కొన్నారు.యూకే ప్రధాని భారత పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యానికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది. నేడు (గురువారం) ముంబయిలో మోడీ, స్టార్మర్‌ల మధ్య చర్చలు జరగనున్నాయని వెల్లడించింది.
‘విజన్ 2035’ రోడ్‌మ్యాప్ ప్రకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాల్లో పురోగతిని సాధించడమే లక్ష్యంగా ఇరు దేశాలు సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. భారత్-యూకే కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సెటా) ఇందులో కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తున్నది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన భారత పర్యటన గురించి ఎక్స్ వేదికగా చాలా ఆసక్తికర సందేశాన్ని పోస్ట్ చేశారు. ”నేను ముంబయిలో బ్రిటీశ్ వ్యాపారానికి నాంది పలుకుతున్నాను. ఎందుకంటే భారత్‌లో బ్రిటీశ్ వ్యాపారాలు వృద్ధి చెందితే, స్వదేశంలో(బ్రిటన్) ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి.” అని ఆయన రాసుకొచ్చారు. కాగా నేడు జరుగబోయే ఇరు దేశాల ప్రధానుల భేటీపై సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకోనున్నది.