రానున్న యాభై రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా గడువు ప్రకటించాడు. దీనితో పాటు ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణులు అందిస్తానని కూడా వెల్లడించాడు.ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లదిమిర్ పుతిన్ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీని ట్రంప్ ఆదేశించాడు. బెదిరించిన ఒక్కరోజులోనే ట్రంప్ మాట మార్చాడు. ఉక్రెయిన్ సంక్షోభం బుధవారం నాటికి 1,238వ రోజులో ప్రవేశించింది. పరస్పరదాడులు సాగుతున్నాయి. కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది. అధికారం స్వీకరించిన 24గంటల్లో పోరును ఆపివేస్తానని ప్రకటించిన ట్రంప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు. కొద్ది రోజుల క్రితం 500శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ నెల సమాచారం ప్రకారం మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు రోజుకు 20.8లక్షల పీపాలకు చేరి పదకొండు నెలల గరిష్ట రికార్డును సృష్టించింది. వార్తల ప్రకారం చూస్తే రష్యా నుంచి తమ అవసరాల్లో చైనా 47, భారత్ 38, ఐరోపా యూని యన్, టర్కీ ఆరేసి శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ఇతర దేశాల నుంచి చూస్తే ఇరాక్ 18.2, సౌదీ అరేబియా 12.1, యుఏయి 10.2, అమెరికా నుంచి 6.3శాతాల చొప్పున దిగుమతి చేస్తున్నది.
సోమవారం నాడు ప్రగల్భాలు పలికిన ట్రంప్ మంగళవారం నాడు మాట మార్చాడు.దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు లేదు, ఆలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పాడు. జూలై నాలుగవ తేదీన మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లపై దాడి చేయగలరా అంటూ ఫోన్‌లో జెలెన్‌స్కీని ట్రంప్ అడగ్గా కచ్చితంగా మీరు గనుక మాకు ఆయుధాలిస్తే కొడతాం, రష్యా పట్టణాల మీద దాడిచేసి వారికి నొప్పితెలిసేట్లు చేయండని ట్రంప్ వ్యాఖ్యా నించినట్లు ఫైనాన్సియల్ టైమ్స్ రాసింది. హత్యలను ఆపాలని కోరుతున్న తాను, పోరు ఆపాలని, మానవత్వంవైపు తప్ప ఎవరి పక్షమూ కాదని మంగళవారం నాడు అధ్యక్ష భవనంలో ట్రంప్ విలేకర్లతో చెప్పాడు. అధ్యక్షుడు కేవలం ప్రశ్నలను అడిగాడు తప్ప హింసాకాండను ప్రోత్సహించేందుకు కాదని ట్రంప్ ప్రతినిధి చెప్పాడు. సైనిక చర్య ముగింపు గడువు విధింపు, ఆధునిక ఆయుధాలు అందచేయాలన్న ట్రంప్ ప్రకటనను రష్యా నేత పుతిన్ ఖాతరు చేయలేదని రాయిటర్స్ పేర్కొన్నది. మిలిటరీ చర్యను ముగించే ఆలోచనలో కూడా లేదని, లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని క్రెమ్లిన్ వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది. ట్రంప్, పశ్చిమదేశాల బెదిరింపులకు భయపడటం లేదని యుద్ధం కొనసాగించటానికి వీలుగా తమ ఆర్థిక పరిస్థితి ఉందని అన్నట్లు కూడా రాసింది.
గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ట్రంప్ గెలిచిన తర్వాత ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల గురించి అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు తర్జన భర్జనలో ఉన్నాయి. ట్రంప్ ఓవల్ ఆఫీసులో సోమవారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటే భేటీ జరిపినపుడు ట్రంప్ తమ నిర్ణయాన్ని వెల్లడించాడు. యాభై రోజుల్లో గనుక పోరు విరమణ ఒప్పందం కుదరకపోతే వందశాతం పన్నులు విధిస్తాం, దాని అర్ధం మీకు తెలిసిందే, అనేక అంశాలపై వాణిజ్యాన్ని వినియోగిస్తాను, అవి యుద్ధాల పరిష్కారాలకు ఎంతో దోహదం చేస్తాయన్నాడు. ఆపరేషన్ సిందూర్ నిలిపివేసి పాకిస్తాన్‌తో రాజీకి వచ్చే విధంగా భారత్‌ను ఒప్పించేందుకు వాణిజ్య ఆయుధాన్ని వినియోగించినట్లు చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. తమ అధ్యక్షుడు చెప్పిన పన్నుల విధింపు అంటే రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాల మీద అని అధికారవర్గాలు వివరించాయి. రష్యాతో అమెరికా వాణిజ్యం పెద్దగా ఏమీ లేదు గనుక దాని మీద అపరాధ సుంకాలు విధించేదేమీ ఉండదు. వాస్తవానికి రష్యా మీద ఆంక్షలేమీ ఉండవని, దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసేవారి మీద విధించే పన్నుల గురించి ట్రంప్ చెప్పినట్లు నాటోలో అమెరికా రాయబారి వైట్‌కర్ మాట్ చెప్పాడు.ఈ చర్యతో రష్యాపై నాటకీయంగా ప్రతికూల ప్రభా వాలు ఉంటాయని అన్నాడు. అయితే అమెరికా బెదిరింపులను గతంలోనే అమెరికా, భారత్ ఖాతరు చేయని సంగతి తెలిసిందే. రష్యా కూడా లెక్క చేయలేదు.
గత ఆరునెలలుగా పుతిన్‌తో సంప్రదింపుల గురించి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదని, రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500శాతం పన్ను విధించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడ తానని సెనెటర్ లిండ్సే గ్రాహమ్ చెప్పాడు. గొప్పలు చెప్పుకున్న ట్రంప్ అది జరగకపోవటంతో అవమానభారంతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. పుతిన్ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు పేట్రియాట్ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పాడు. పరిష్కరించాలనే చిత్తశుద్ది అమెరికాకు లేదన్నది స్పష్టం. ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధర ఒక్కొక్కటి నలభై లక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్‌కు సరఫరా చేసే ఆయుధాలను ఐరోపాకు విక్రయించి అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు తరలించే విధంగా అమెరికా నిర్ణయించింది. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి రష్యాను బుట్టలో వేసుకోవాలని ట్రంప్ చూశాడు. ఆ పప్పులు ఉడకలేదు, దాంతో ఆయుధాల సరఫరా పునరుద్ధరించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపున శాంతి చర్చలకు చొరవ చూపేందుకు పోప్ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తరువాత జెలెన్‌స్కీ ప్రకటించాడు. దాని గురించి ఎటూ తేలకముందే సరికొత్త ఆంక్షల గురించి ట్రంప్ ప్రకటించాడు. పుతిన్ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్ తీరును తాము పట్టించుకోవటం లేదని గతవారంలో రష్యా స్పందించింది.ఆయుధ ఒప్పందం ఆటతీరునే మార్చి వేస్తుందని రూటే వర్ణించాడు.జర్మనీతో సహా ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటివి అమెరికా నుంచి తీసుకొని నూతన ఆయుధాలను సరఫరా చేస్తాయని చెప్పాడు. తాను ముందుగా ఐరోపా దేశాలు ఇలాంటి చొరవ తీసుకుంటాయని అనుకోలేదని కానీ అవి చేశాయని ట్రంప్ అభినందించాడు. త్వరలో మరికొన్ని క్షిపణులను కూడా అందించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా క్షిపణులను అడ్డుకునేందుకు పేట్రియాట్ వ్యవస్థలను వినియోగిస్తామని, అయితే ఎదురుదాడి చేసే ఆయుధాలను కూడా ఇచ్చే అవకాశం ఉందని నాటోలో అమెరికా రాయబారి చెప్పాడు. నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తే వచ్చే విమర్శల నుంచి తప్పుకొనేందుకు, తన చేతికి మట్టి అంటకుండా, ఖజానా మీద భారం మోపకుండా ఐరోపా దేశాలకు ఆయుధాలను విక్రయించి అటు నుంచి తరలించేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడ ఇది.
అధికారానికి వచ్చిన తర్వాత ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. ‘రష్యాకు రాయితీలివ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే. మేం 350 బిలియన్ డాలర్లు ఇచ్చినా యుద్ధంలో గెలిచేది లేదు చచ్చేది లేదని’ జెలెన్‌స్కీతో అన్నాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు. ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు.ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్ తమను వదలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్‌ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. ఎత్తుగడ ఏమిటో తెలియదు గానీ పదేండ్ల క్రితమే పుతిన్ గురించి ట్రంప్ పొగడ్తలు ప్రారంభించాడు.
గత గురువారం నాడు రోమ్ నగరంలో ఉక్రెయిన్ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెన్‌స్కీ ఇటలీలో ట్రంప్ ప్రతినిధి కెయిత్ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్ లియోను రెండు నెలల్లోనే జెలెన్‌స్కీ రెండుసార్లు కలిశాడు. పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్ పునరుద్దరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్ క్షిపణులను వెంటనే ఉక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. మీరు గనుక ఉక్రెయిన్ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయి స్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్ మాటలు దాన్ని నిర్ధారిస్తు న్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల ఉక్రెయిన్ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.
రష్యా ఆధీనంలోని జపోర్‌ఝియా ప్రాంతంలో ఉన్న అణువిద్యుత్ కేంద్రంపై వంద లాది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పింది. అక్కడ అణు ప్రమాదం జరిగితే దానికి రష్యాను బాధ్యురాలిగా చేసి ఒత్తిడి తేవాలన్న కుట్ర దీనిలో కనిపిస్తోంది. దీని వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు. పేట్రియాట్స్‌తో సహా ఆధునిక ఆయుధాలను అందచేయాలన్న నిర్ణయం నాటకీయంగా జరగలేదు. గత కొద్ది వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. వీటితో పుతిన్ దారికి వస్తాడని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జూన్‌లో జరిగిన నాటో సమావేశాల్లో ఒక కొలిక్కి వచ్చిన ఈ ఆలోచనపై అంతకు ముందే విధి విధానాల గురించి చర్చ మొదలైంది.నాటో నేరుగా ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గొన్నట్టే. అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథ నడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ‘అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెన్‌స్కీకి ఇవ్వండని’ అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. ‘మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని’ ఉక్రేనియన్ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు ఉక్రేనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెన్‌స్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజా లున్న ప్రాంతాలను అమెరికాకు రాసిచ్చిన తర్వాత దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం!
ఎం కోటేశ్వరరావు
8331013288