Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక..

వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక..

- Advertisement -

దంపతుల ఆత్మహత్య.. మూడేండ్ల చిన్నారి పరిస్థితి విషమం
‘వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ సూసైడ్‌ నోట్‌
క్షమించండి.. అంటూ తల్లిదండ్రులకూ లేఖ
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారంలో ఘటన


నవతెలంగాణ-బెజ్జంకి
ఇతరులకు ఆర్థిక అవసరాల కోసం.. వడ్డీ వ్యాపారుల వద్ద మధ్యవర్తిగా సంతకం చేసి అప్పులు ఇప్పించగా.. ఆ అప్పులిచ్చిన వారు డబ్బుల కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మూడేండ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్లకొండ శ్రీ హర్ష(33), రుక్మిణి(28) దంపతులు.. బెజ్జంకిలో రినో సారీస్‌, రెడీమెడ్స్‌, కిడ్స్‌ బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేండ్ల కూతురు హరిప్రియ ఉంది. కాగా, ఇతరుల అవసరాల కోసం శ్రీ హర్ష మధ్యవర్తిగా ఉండి.. వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు ఇప్పించాడు. ఆ డబ్బులు చెల్లించాలని కొన్ని రోజులుగా వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వడ్డీ వ్యాపారులు హర్ష కారును తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. దాంతో వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఆ దంపతులు పురుగుల మందు తాగి.. వారి కూతురికి కూడా పురుగుల మందు తాగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా, స్పృహలోకి వచ్చిన హరిప్రియ తల్లిదండ్రులు పడి ఉండటంతో కేకలు వేసింది.

ఇంట్లో నుంచి అరుపులు వినపడటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే రుక్మిణి మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షతోపాటు చిన్నారి హరిప్రియను చికిత్స కోసం కరీంనగర్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో హర్ష మృతి చెందాడు. చిన్నారి హరిప్రియ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం హరిప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమ మృతికి ఐదుగురు వ్యక్తులు ముఖ్య కారకులుగా పేర్కొంటూ.. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీపీ, సీఐ, ఎస్‌ఐకు మృతుడు రాసిన సుమారు 10 పేజీల మరణ వాంగ్ములం లేఖ బయటపడింది. అంతేకాకుండా.. ”అమ్మ, నాన్నా, తమ్ముడు.. క్షమించండి.. తమ్ముడు నీ స్వార్థం చూసుకోకు.. నాన్న బాధను కూడా అర్థం చేసుకో.. ఎప్పుడూ డబ్బు అని నాన్నను బాధ పెట్టకు.. వారిని బాగా చూసుకో.. ఇల్లు, కారు అమ్మి అన్ని అప్పులు తీసేయండి.. సారీ.. రా” అంటూ మృతుడు శ్రీహర్ష లేఖలో రాసిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కాగా, ఏసీపీ రవీందర్‌ రెడ్డి, సీఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -