గల్ఫ్‌దేశాల్లోని వలస కార్మికుల దుస్థితి
ఆందోళనలో కుటుంబసభ్యులు
భయం గుప్పెట్లోనే ‘గల్ఫ్’
నిత్యం బాంబుల హోరు..సైరన్‌ల మోత
ఒక వైపు బాంబులు పడుతున్న శబ్దాలు, మరో వైపు సైరన్‌ల మోతల మధ్య వలస కార్మికులు బిక్కుబిక్కుమంటూ తమ విధులు చేపడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధవాతావరణం.. ఇక్కడి వారిలో ఆందోళనలను రేకిత్తిస్తున్నాయి. ఉపాధి నిమిత్తం వెళ్లిన వారు ఎలా ఉంటున్నారో అంటూ బాధిత కుటుంబీకులు తమ వారికి ఫోన్లు చేస్తూ వాకబు చేస్తున్నారు. తిరిగి వచ్చేయాలని సూచిస్తున్నారు. తొలిరోజుల్లో ఉన్నంతలా పరిస్థితి లేదని, సేఫ్‌గానే ఉంటున్నట్టు కార్మికులు తమ కుటుంబీకులకు భరోసా ఇస్తున్నారు. అయితే తిరిగి రాలేక.. అక్కడా ఉండలేక.. పలువురు వలస కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తుండటంతో యుద్ధమేఘాలు ఆవరించాయి. గత నెల 28వ తేదీన ప్రారంభమైన బాంబుల మోత కొనసాగుతూనే ఉంది. వ్యవసాయంలో నష్టాలు, ఉన్న ఊర్లో సరైన ఉపాధి లేక అప్పుల పాలై.. వాటిని తీర్చేందుకు, కుటుంబ పోషణకు ఇంటిల్లిపాదిని వదిలి పొట్టచేత పట్టుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 2 లక్షల మంది కార్మికులు గల్ఫ్‌దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. పశ్చిమాసియా దేశాలైన దుబాయ్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, అబుదాబి, యూఏఈ లాంటి ప్రధాన గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువ మంది వివిధ పనులు చేసేందుకు వెళ్తుంటారు.
మన రూపాయి మారకంతో పోలిస్తే అక్కడి దినార్‌లు, రియాన్‌ల మారకం విలువ ఎక్కువ కావడంతో వచ్చే ఆదాయంతో ఎంతోకొంత అప్పులు తీర్చుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేయడంతో ప్రతిగా గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, అబుదాబీ, దుబాయ్, ఖతర్, యూఏఈ తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్‌లతో ప్రతిదాడులకు దిగింది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధ వాతావరణం నెలకొనడంతో తిరిగి ఇక్కడికి రాలేక.. అక్కడే ఉండలేక బిక్కుబిక్కుమంటూనే పనులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబీకుల్లో ఆందోళన మాత్రం తొలగడం లేదు. నిత్యం వార్తలు చదువుతూ తమ వారు ఎలా ఉంటున్నారో అన్న ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.
బాంబుల మోతల్లోనే విధులకు..
అయితే యుద్ధం మొదలైన రెండు రోజులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ప్రస్తుతం కొద్ది మేర తగ్గినట్టు ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వలస కార్మికులను వెంటాడుతోంది. ఆయా దేశాల వారు ఇండ్లకే పరిమితం కాగా.. వలస వెళ్లిన కార్మికులే ప్రధానంగా పనులకు వెళ్తున్నట్టు సమాచారం. పనులకు వెళ్తున్న క్రమంలో బాంబులు పడుతున్న శబ్దాలు వస్తూనే ఉంటున్నాయి. రోజుకు రెండు నుంచి మూడు సార్లు సైరన్‌ల మోతలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన సైరన్‌లను ఏక కాలంలో ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మోగిస్తున్నారు. దాంతో ఎక్కడున్న వారు అక్కడే అలర్ట్‌గా ఉంటున్నారు. అమెరికా దాడులతో కువైట్ విమానాశ్రయం రన్‌వే దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
బాంబుల శబ్ధం వినిపిస్తున్నాయి : శివకుమార్. కువైట్ (నిజామాబాద్ వాసి)
యుద్ధం ప్రారంభంలో ఎక్కువగా బాంబుల శబ్ధాలు వినిపించాయి. డ్రోన్‌లు కనిపించాయి. ప్రస్తుతం కొంత మేర తగ్గింది. పనులకు వెళ్తున్నాం. అప్పుడప్పుడు బాంబులు పడ్డట్టు సౌండ్ వస్తుంది. దాడులకు వస్తున్న డ్రోన్‌లను, క్షిపణులను కూల్చివేస్తున్నట్టు చెబుతున్నారు. మాల్‌లు తెరుచుకున్నాయి. ప్రధానంగా అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. నివాసాల జోలికి రావట్లేదు. కూల్చివేసిన క్షిపణుల శకలాలు కిందపడిన సందర్భంలో పలువురు గాయపడుతున్నారు. నివాసాల మీద అయితే ఇప్పటి వరకు దాడులు జరగలేవు.
రక్షణ కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోవడంతో పొట్ట చేతపట్టుకొని గల్ఫ్ దేశాలకు ఇరు జిల్లాల నుంచి తరలివెళ్లిన కార్మికులకు, తెలుగు వారికి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలు పంపి తెలుగువారిని స్వదేశానికి తీసుకురావాలి. ఇందుకోసం కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ యుద్ధాలు జరిగినా చివరకు అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. -రమేశ్‌బాబు, సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి



