నవతెలంగాణ – కాటారం
కాటారం గ్రామంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్యానెల్‌లను టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌర విద్యుత్ పథకం అమలును ప్రత్యక్షంగా పరిశీలించి, ప్యానెల్‌ల పనితీరు, నిర్వహణ, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు. ఈ తనిఖీలో టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్.ఈ. శ్రీ బి. మల్చూర్, డీఈఈ (టెక్నికల్) శ్రీ జగదీష్, డీఈఈ కాటారం శ్రీ డి. నాగరాజు, రెడ్కో డీఎం శ్రీ మహేందర్ రెడ్డి, ఏడీఈ కాటారం శ్రీ బి. రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సౌర విద్యుత్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ ఖర్చు తగ్గింపు వంటి ప్రయోజనాలు అందుతున్నాయని అధికారులు వివరించారు. ప్యానెల్‌ల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎండీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సౌర విద్యుత్ ప్యానెల్‌ల లబ్ధిదారులు కూడా పాల్గొని తమ అనుభవాలను అధికారులతో పంచుకున్నారు.




